Make Palakonda a Separate District: పాలకొండ జిల్లా ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:47 AM
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించింది. ఏ మాత్రమూ అవగాహన లేకుండా చేపట్టిన ఈ జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలోని..
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించింది. ఏ మాత్రమూ అవగాహన లేకుండా చేపట్టిన ఈ జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలోని అనేక మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పాలకొండ ప్రాంత ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఈ ప్రాంతం గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉండేది. పునర్విభజన అనంతరం పార్వతీపురం మన్యం జిల్లాలో కలిపారు. ప్రస్తుతం పాలకొండ రెవెన్యూ డివిజన్‌లో 13 మండలాలున్నాయి. పాలకొండ, చుట్టు పక్కల మండలాల ప్రజలు ప్రస్తుత జిల్లా కేంద్రమైన పార్వతీపురానికి చేరుకోవడానికి చాలా సమయం పడుతోంది. దీంతో సమీపంలోని ఇతర మండలాలతో కలిపి పాలకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఈ ప్రాంతాన్ని జిల్లాగా మారిస్తే చుట్టుపక్కల మండలాల వారు జిల్లా కేంద్రమైన పాలకొండకు గంట సమయంలోపే చేరుకోవచ్చు. సీతంపేట, పాలకొండ ప్రాంతాల్లో గతంలో నిర్మించిన అనేక ప్రభుత్వ భవన సముదాయాలున్నందున, పాలకొండ జిల్లా ఏర్పాటు వల్ల ప్రభుత్వంపై అదనంగా ఆర్థికభారం పడే అవకాశం చాలా తక్కువ. పాలకొండ జిల్లా ఏర్పాటు కుదరకపోతే ఈ ప్రాంతాన్ని తిరిగి శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ‘జిల్లాల అస్తవ్యస్త విభజన’ సమస్యను పరిష్కరిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేస్తూ, పాలకొండను జిల్లాగా మార్చాలి.
– చౌడ నాయుడు పాలకొండ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు