Moral Values Decline: దిగజారిపోతున్న నైతిక విలువలు
ABN , Publish Date - May 30 , 2025 | 05:28 AM
నైతిక విలువలు, మానవ సంబంధాలు నశించిపోతున్న ఈ కాలంలో వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. ఆస్తి కోసం బంధాలను తృణప్రాయంగా చూస్తున్న సంఘంలో మార్పు అవసరం.
బంధాలు, అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. ఆస్తి సమానంగా పంచినా ఇంకా ఎక్కువ ఆశించటం; కూతుళ్లకు ఇచ్చారని చనిపోయిన తల్లిదండ్రులకు తలకొరివి పెట్టకుండా మొఖం చాటేయడం జరుగుతున్నాయి. అలాంటి వారికి గ్రామ పెద్దలు దహన సంస్కారాలు జరిపించిన ఘటనలు ఉన్నాయి. ఆస్తి కోసం సొంత అన్నదమ్ముల్ని హత్య చేయడం, ఆస్తి రాయించుకుని తల్లిదండ్రులను వీధిపాలు చేస్తున్న ఘటనలు కూడా చాలా ఉన్నాయి. వృద్ధాప్యంలో అండదండలుగా ఉంటారనుకున్న కొడుకులు, కూతుళ్లు పట్టించుకోకపోవడంతో భిక్షాటన చేస్తున్న వారి వార్తలు పేపర్లలో చూస్తూనే ఉన్నాం. వృద్ధాప్యంలో దిక్కులేని పక్షులుగా జీవించే కంటే, చావే నయమని కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయి, చిన్న కుటుంబ వ్యవస్థ వచ్చింది. నైతిక విలువలు, మానవతా విలువలు మృగ్యమైపోతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఇప్పుడు యువకులుగా ఉన్నవారు మున్ముందు వృద్ధులవుతారు. అప్పుడు తమ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలి.
– అయినం రఘురామారావు