Uddanam as a Separate District: ఉద్దానంను జిల్లాగా ప్రకటించాలి
ABN , Publish Date - Dec 13 , 2025 | 04:15 AM
ఉత్తరాంధ్రలో సముద్రతీరాన్ని ఆనుకుని విస్తరించిన పచ్చని భూములు, కొబ్బరి తోటలు, పనసపండ్ల సువాసన, చేపల వేటతో సందడిగా ఉండే తీర గ్రామాలు...
ఉత్తరాంధ్రలో సముద్రతీరాన్ని ఆనుకుని విస్తరించిన పచ్చని భూములు, కొబ్బరి తోటలు, పనసపండ్ల సువాసన, చేపల వేటతో సందడిగా ఉండే తీర గ్రామాలు కలిసిన ప్రాంతం ఉద్దానం. సహజసిద్ధమైన అందాలు మాత్రమే కాకుండా ఎంతో సుసంపన్నమైన ప్రాంతం ఇది. అయితే ఇన్ని సహజవనరులు ఉండి కూడా ఉద్దానం ప్రజల జీవితం దశాబ్దాలుగా ప్రశాంతంగా లేదు. ముఖ్యంగా కిడ్నీ వ్యాధులతో వేలాదిగా ప్రజలు బాధపడుతుండడం అందరికీ తెలిసిన విషయమే. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి, ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేయడానికి, ప్రజలకు పరిపాలన దగ్గర చేయడానికి, ఉద్దానంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించడం అవసరం. ఇది ఒక పరిపాలనా చర్య మాత్రమే కాదు, సామాజికన్యాయం పరంగా, ఆరోగ్య పరంగా, ఆర్థికాభివృద్ధి పరంగా, పర్యాటక పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం.
భౌగోళికంగా పరిశీలించినా ఉద్దానం పెద్ద ప్రదేశం. శ్రీకాకుళం జిల్లాలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం జిల్లా కేంద్రం నుంచి చాలా దూరంగా ఉంటుంది. ప్రజలు సాధారణ ప్రభుత్వ సేవలు పొందడానికి కూడా గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు చేరుకోవడం చాలా కష్టమవుతుంది. జిల్లా కేంద్రం దూరంగా ఉండటం వల్ల పరిపాలనలో ఉండే ఆలస్యం, పథకాల అమల్లో జాప్యం, ప్రజలకు వేగంగా సేవలు అందకపోవడం వంటివన్నీ ఈ ప్రాంత అభివృద్ధిని నిలువరించాయి. ఉద్దానం జిల్లాగా ఏర్పడితే ఈ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే చిన్న జిల్లాలు పరిపాలనను ప్రజలకు దగ్గరచేస్తాయి. అధికారులు మెరుగ్గా పర్యవేక్షించగలుగుతారు, దాంతో పథకాలు ప్రజలకు చేరతాయి. సరైన ప్రణాళికలతో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అన్ని రకాలుగా ఎదుగుతుంది.
కొత్త జిల్లా ఏర్పడితే ఈ ప్రాంతంలో ప్రత్యేక వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్‌లు, మత్స్యరంగ అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు కావడానికి సౌలభ్యం ఏర్పడుతుంది. దీనివల్ల యువతకు ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. జిల్లా కేంద్రం ఉద్దానంలో ఉంటే, కొత్త వైద్య కళాశాలలు, ప్రత్యేక ఆసుపత్రులు, డయాలసిస్ కేంద్రాలు, గ్రామస్థాయి హెల్త్ సెంటర్లు ఏర్పడటం వేగవంతం అవుతుంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు రావడం, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు పెరుగుతాయి. రాజకీయంగా కూడా ఉద్దానం జిల్లా ఏర్పడితే ఈ ప్రాంత సమస్యలు రాష్ట్ర స్థాయిలో మరింత బలంగా వినిపిస్తాయి. ఇన్ని కారణాల వల్ల ఉద్దానంను జిల్లాగా ప్రకటించాలి.
– అప్పన్న గొనప, విశాఖపట్నం