Trumps Climate Change Denial: ట్రంప్ వ్యర్థ ప్రలాపాలు
ABN , Publish Date - Oct 10 , 2025 | 03:13 AM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వక్కాణించిన మాట. ఐక్యరాజ్యసమితి 80వ సర్వ ప్రతినిధి సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ ఆరోపణ చేశారు....
వాతావరణ మార్పు ఒక ‘మహా వంచన’ -– ఇది, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వక్కాణించిన మాట. ఐక్యరాజ్యసమితి 80వ సర్వ ప్రతినిధి సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ ఆరోపణ చేశారు. ఆయన ఉద్దేశంలో వాతావరణ మార్పును అరికట్టేందుకు తక్షణమే కార్యసాధక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నవారు అందరూ దగాకోరులే సుమా! తన అసంబద్ధ ప్రలాపంలో హరిత ఇంధన పరివర్తనకు ప్రయత్నిస్తోన్న యూరోప్‌ను ట్రంప్ మరీ నిందించారు. శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పి హరిత ఇంధనాలను మరింతగా వినియోగించుకునేందుకు యూరోపియన్ దేశాలు చేస్తున్న ప్రయత్నాల వల్ల వ్యయాలు పెరుగుతాయి, అభివృద్ధి అంతమవుతుందని ఆయన విమర్శించారు. వాతావరణ మార్పును ధ్రువీకరిస్తున్న వైజ్ఞానిక నిదర్శనాలను ఆయన కొట్టివేశారు. బొగ్గు కాలుష్యరహిత స్వచ్ఛమైన ఇంధన వనరు అని ట్రంప్ నొక్కి చెప్పారు. మీ అవగాహనా సామర్థ్యాన్ని న్యూనపరిచేందుకో, ట్రంప్ వాదనలు ఎంత అహేతుకమో వివరించేందుకో నేను ఇది రాయడం లేదు. వాతావరణ మార్పు ఎంత వాస్తవమో మనకు అనుభవపూర్వకంగా తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ వైపరీత్యాలు పెచ్చరిల్లిపోతూ అపార ఆర్థిక విధ్వంసానికి, అంతులేని మానవ విషాదానికి కారణమవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రసంగిస్తున్నప్పుడు ట్రంప్ మహాశయుడు నిజంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? అన్నదే అసలు ప్రశ్న. ఈ విషయమై మనం చర్చించి తీరాలి.
ఐరాసలో సమావేశమైన ప్రపంచ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు; మీరు, నా లాంటి వాళ్లను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడలేదు. అభివృద్ధి చెందిన దేశాలలో మధ్యతరగతి, శ్రామికవర్గ జనావళిని ఉద్దేశించే ఆయన ఆ ప్రసంగాన్ని వెలువరించారని నేను భావిస్తున్నాను. తమ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచీకరణ అవడం వల్ల తాము ఎంతగానో నష్టపోయామని, దగా పడ్డామని ఈ రెండు వర్గాలవారు నమ్ముతున్నారు. తమ దేశాలను దురాక్రమించిన ‘వలసకారులు’ తమ జీవనాధారాలను కొల్లగొడుతున్నారనే భావం ఈ రెండు వర్గాల ప్రజల మనసుల్లో ఉన్నది. ఆ భావం మరింత ప్రగాఢంగా నాటుకుపోయేలా చేయడమే ట్రంప్ లక్ష్యం. బలహీన ప్రభుత్వాలు వలసకారుల వెల్లువను అనుమతిస్తున్నాయని ట్రంప్ ఆక్రోశిస్తున్నారు. ఈ వలసల కారణంగా జీవన వ్యయాలు పెరిగిపోతున్నాయని, నిజ వేతనాలు తగ్గిపోతున్నాయని, ఈ పరిణామాలు పాశ్చాత్య నాగరికత పతనానికి దారితీస్తాయని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. ఈ సందేశాన్ని ప్రపంచమంతటికీ, మరీ ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు అన్నిటికీ తీసుకువెళ్లాలన్నది ట్రంప్ ధ్యేయంగా ఉన్నది. తద్వారా పాశ్చాత్య దేశాలలో ‘వామపక్ష పిచ్చివాళ్ల’ (ఇది ఆయన మాటే, నాది కాదు) పట్ల వ్యతిరేకత ప్రబలిపోయేలా చేయాలని ఆయన సంకల్పించుకున్నారు. సామాజిక న్యాయం, వాతావరణ చర్యకు నిబద్ధమైన ప్రభుత్వాలకు దూరమై ‘సరైన’ విధానాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యేలా చేసేందుకు జరిగిన రాజకీయ ప్రయత్నంగా ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ ప్రసంగాన్ని చూడాలి. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి నేతృత్వం వహించిన, స్వేచ్ఛా విపణి ప్రపంచీకరణ వ్యవస్థను నిర్మించిన పాశ్చాత్య దేశాలలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే విషయాన్ని కూడా మనం విస్మరించకూడదు.
ట్రంప్ తన మాటలతో వారిలో ఆ ఆగ్రహం మరింతగా ప్రజ్వరిల్లేలా చేస్తున్నారు. తద్వారా పాశ్చాత్య ప్రపంచ రాజకీయాలలో తాను ఒక మౌలిక మార్పు తీసుకురాగలనని ఆయన విశ్వసిస్తున్నారు. బహుళ పాక్షిక వ్యవస్థకు, ప్రపంచ సంఘీభావానికి, వాతావరణ మార్పు నిరోధక చర్యలకు వ్యతిరేకంగా ఉన్నవారు అంతిమ విజయం సాధించాలని ట్రంప్ ప్రగాఢంగా అభిలషిస్తున్నారు. ఇది ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో పాలనా వ్యవస్థల మార్పును సంకల్పించడమే. అదే సంభవిస్తోంది మరి. యూరోప్ వాతావరణ విధానాలు ఎదురుగాలులను ఎదుర్కొంటున్నాయి. తదుపరి విడత ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల విషయమై ఒక ఒప్పందాన్ని సాధించడంలో యూరోపియన్ కమిషన్ విఫలమయింది. ఈ విధానాలకు ప్రతిఘటన అంతకంతకూ పెరుగుతోంది. ట్రంప్ వలే వాతావరణ మార్పును నిరాకరిస్తున్న రాజకీయ పార్టీల పట్ల అనుకూలత పెరుగుతోంది. ఇది చాలా శోచనీయం. ఈ మార్పులు మరింత వేగవంతమవ్వాలని ట్రంప్ ఆశిస్తున్నారు. అప్పుడే ప్రపంచం తన పక్షానికి వస్తుందనేది ఆయన భావిస్తున్నారు. ఇదొక రాజకీయ చదరంగం. వాతావరణ మార్పు అనేది ఇందులో ఒక పాచిక. ఇంధన వాణిజ్యంలో ఆర్థిక ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ఈ రాజకీయం జరుగుతోంది. ఇందులో భాగంగానే వాతావరణ మార్పు నిరోధక అజెండా అనేది ‘వామపక్ష వెర్రి వాళ్లది’ అని ట్రంప్ పదే పదే అపహసిస్తున్నారు.
వాతావరణ మార్పు విపత్తుతో మానవాళి మనుగడే సంక్షోభంలో పడిందని విశ్వసిస్తున్న, కాలుష్య ఇంధన వ్యవస్థలను నిర్మలం చేయాల్సిన అవసరముందని భావిస్తున్న వారందరూ ఆయన దృష్టిలో వామపక్ష వెర్రివాళ్లే! ఇటువంటి వైఖరి ప్రజలు ఏదో ఒక పక్షం వైపు మొగ్గేలా చేస్తుంది. కొవిడ్ విలయం కాలంలో ఇదే జరిగింది. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలా లేక అందులోనే కొనసాగాలా అనే విషయమై ఓటింగ్ సమయంలో బ్రిటన్‌లోనూ సంభవించింది కూడా ఇదే కాదూ? సమాజంలో ఇటువంటి చీలికలు సమస్యను మరింత సంక్లిష్టం చేస్తాయి. కులీనులు వెర్సెస్ సామాన్యులుగా సమాజాన్ని చీల్చివేస్తాయి. మరింత ఘోరమైన విషయమేమిటంటే ఈ ధోరణి వైజ్ఞానిక పరిశోధనలనూ కొట్టివేస్తోంది. నిపుణులు వాస్తవాన్ని అర్థం చేసుకోవడం లేదని దుయ్యబడుతున్నది. సామాన్య ప్రజల బాధాకర వాస్తవాలను అర్థం చేసుకోవడం లేదని ఆక్షేపిస్తోంది. ఈ ప్రమాదకర ధోరణులకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ అవమానకరమైన మాటల కంటే ఇవి మరింత హానికరమైనవి. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో పనిచేస్తున్న పర్యావరణ వాదులను అలా ఆక్షేపించడం వారి కృషిని, నిబద్ధతను తక్కువ చేయడమే అవుతుంది. ట్రంప్ దృష్టిలో వర్ధమాన దేశాలలోని పర్యావరణ వాదులు అభివృద్ధి నిరోధకులే! పర్యావరణం, అభివృద్ధి అనేవి ఒకే నాణేనికి బొమ్మ–బొరుసు లాంటివనే సత్యాన్ని గుర్తించేందుకు ఆయన నిరాకరిస్తున్నారు. ఈ కారణంగానే మేము చాలా జాగ్రత్తగా, ఉద్దేశపూర్వకంగా వాతావరణ మార్పు నిరోధక విధానాలు మా దేశాల అభివృద్ధి వ్యూహాలలో భాగంగా ఉండేలా చేసేందుకు కృషి చేస్తున్నాము. కాలుష్యం లేకుండా సాధించే అభివృద్ధే నిరపాయకరమూ, ప్రయోజనకరమూ అవుతుందని మేము విశ్వసిస్తున్నాం. ఈ సత్యాన్ని మేము ఎప్పటికీ విస్మరించం. పర్యావరణ కాలుష్యాన్ని పెంపొందించే అభివృద్ధి మన ఉమ్మడి ఆవాసమైన ఈ ధరిత్రిని తప్పక ధ్వంసం చేస్తుంది. ఈ దృష్ట్యా ఐరాసలో ట్రంప్ ప్రసంగాన్ని ఆయన చేసిన మరో శబ్దాడంబర భాషణగా తీసివేయకూడదు. వాతావరణ మార్పు భావన సహేతుకతను నిర్మూలించేందుకు చాలా జాగ్రత్తగా రూపొందించిన వ్యూహమది. దీన్ని మనం సమర్థంగా ఎదుర్కోవాలి.
-సునీతా నారాయణ్
(‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ డైరెక్టర్ జనరల్,
‘డౌన్ టు ఎర్త్’ సంపాదకురాలు)