Share News

Controversies And Challenges: ప్రశ్నార్థకమవుతున్న ఈసీ విశ్వసనీయత

ABN , Publish Date - Aug 06 , 2025 | 03:07 AM

భారతదేశంలో ఎన్నికల కమిషన్ ఈసీ చచ్చిపోయింది..అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో

Controversies And Challenges: ప్రశ్నార్థకమవుతున్న ఈసీ విశ్వసనీయత

‘భారతదేశంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) చచ్చిపోయింది..’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో 1.5 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని తమ దర్యాప్తులో తేలిందని, ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా త్వరలో నిరూపిస్తామని ఆయన ప్రకటించారు. అనేక విషయాల్లో రాహుల్‌గాంధీ అడపాదడపా చేసే ఆరోపణలు సంచలనాత్మకంగా ఉంటున్నాయి. అవి, కొన్నిసార్లు న్యాయస్థానం విమర్శలకు గురైనప్పటికీ ఎన్నికల కమిషన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. ఇదే సమయంలో బిహార్‌లో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) జరుగుతున్న తీరుపై కొద్ది రోజులుగా పార్లమెంట్ ఉభయ సభలు స్తంభించిపోయాయి. ఎన్నికల కమిషన్ పనితీరుపై పార్లమెంట్‌లో చర్చించడం సంప్రదాయాలకు విరుద్ధమని, గతంలో బలరాం జాఖడ్ స్పీకర్‌గా ఉన్నప్పుడు ఈ మేరకు రూలింగ్ ఇచ్చారని ఉభయ సభల అధిపతులు వాదిస్తున్నారు. అయినప్పటికీ బిహార్‌లో జరుగుతున్న ఎస్ఐఆర్‌ను ప్రతిపక్షాలు అంత సులభంగా వదిలిపెట్టే అవకాశాలు కనిపించడం లేదు.


సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కేసుపై విచారణలో ఎస్ఐఆర్ జరుగుతున్న తీరుపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల కమిషన్ ఓటర్ల పౌరసత్వంపై దృష్టి కేంద్రీకరించడం, కొత్త ఓటర్లను చేర్చుకోవడం కాకుండా ఉన్న ఓటర్లను జాబితా నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఎన్నికల జాబితాలో నమోదు చేసుకోవాలంటే ఒక వ్యక్తికి భారతీయ పౌరసత్వం ఉండాలని, కేవలం భారతీయ పౌరులనే ఓటర్లుగా చేర్చుకోవడం తమ బాధ్యత అని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఓటర్లుగా నమోదు కావాలంటే 11 డాక్యుమెంట్లు సమర్పించాలని, 1987 నుంచి 2004 మధ్య పుట్టినవారు తమ తల్లిదండ్రుల్లో ఒకరి డాక్యుమెంట్‌ను, 2004 తర్వాత పుట్టినవారు తల్లి, తండ్రి ఇరువురి డాక్యుమెంట్లనూ సమర్పించాలని చెబుతోంది. కేంద్రం జారీ చేసిన ఆధార్‌, తాము జారీ చేసిన ఎన్నికల గుర్తింపు కార్డులను కూడా ఈసీ పరిగణనలోకి తీసుకోవడం లేదు.


పౌరసత్వం ఆధారంగా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడం పేరుతో ఎన్నికల కమిషన్ అధికార పార్టీని గెలిపించేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పౌరసత్వ సర్టిఫికెట్ జారీ చేయడం ఎన్నికల కమిషన్ పని కాదని, ఎన్నికలను పర్యవేక్షించే, నిర్వహించే రాజ్యాంగ బాధ్యత మాత్రమే కమిషన్‌కు ఉన్నదని మాజీ ఎన్నికల కమిషనర్‌ అశోక్ లావాసా కూడా వాదిస్తున్నారు. నిజానికి 2025లో ఓటర్ల జాబితా ప్రకటించేందుకు ముందే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేసి ఉంటే ఎన్నికల కమిషన్ ఇంత వివాదంలో ఇరుక్కునేది కాదు. బిహార్‌లో ఎన్నికలు సరిగ్గా రెండు మూడు నెలల్లో జరుగుతాయనగా ఆగమేఘాలపై కేవలం నెలలోపు ఈ సవరణ చేసేందుకు పూనుకోవడమే కమిషన్ నిజాయితీని శంకించేలా చేస్తోంది. ఒక రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ దేశంలో చాలా కాలంగా వివాదంలో ఉంటూనే వస్తోంది. 1990లో టీఎన్ శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన తర్వాత ఎన్నికల వ్యవస్థలో ఎన్నో కీలక మార్పులు తీసుకువచ్చారు. డబ్బు, మద్యం పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టడం, గోడలపై రాతల్ని రాయడంతో పాటు ఎన్నికల ప్రసంగాల్లో మతాన్ని ఉపయోగించడాన్ని కట్టుదిట్టంగా అరికట్టారు. ఓటర్ల ఐడీ కార్డులను, ప్రవర్తనా నియామావళిని ప్రవేశపెట్టారు. ఎన్నికల ఖర్చులపై పరిమితిని విధించారు. ఎన్నికలకు ఎన్ని వాహనాలు ఉపయోగించారో కూడా అభ్యర్థులు లెక్క చెప్పాల్సి వచ్చేది. రిటర్నింగ్ అధికారులు ఈ వాహనాల మీటర్లను చెక్ చేసి ఎన్నికల ఖర్చులపై రోజువారీ లెక్కలతో సరిపోల్చేవారు. ఎన్నికల ముందు యూపీతో పాటు అనేక రాష్ట్రాల్లో 3లక్షల మందికి పైగా రౌడీషీటర్లని ముందస్తు అరెస్టులు చేయించిన శేషన్ ఒక దశలో ఓటర్లను ప్రలోభపెట్టినందుకు ఇద్దరు కేంద్రమంత్రులను తొలగించాల్సిందిగా ప్రధానమంత్రికే తాఖీదు పంపారు. శేషన్ హయాంలో పోలింగ్‌ బూత్‌ల స్వాధీనం, ఎన్నికల సంబంధిత దాడులు, దొమ్మీలు, హత్యలు 90 శాతం పైగా తగ్గిపోయాయి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై ఆయనే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఇప్పటి వరకూ రాజకీయ నాయకులు చాలా చెత్తపనులన్నీ చేశారు. నేను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నంతకాలం ఎన్నికలు ఎలా నిర్వహించాలో నేనే నిర్ణయిస్తాను..’ అని శేషన్ ప్రకటించారు. ‘ఈ శేషన్ ఘటోత్కచుడిలా ఉన్నాడే..’ అని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల వ్యవస్థకు విశ్వసనీయత సాధించినందుకు ఆయనకు రామన్ మెగసెసే అవార్డు లభించింది. కాని శేషన్ అనంతరం మళ్లీ పరిస్థితులు క్రమంగా మొదటికి రావడం ప్రారంభమైంది. యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ నవీన్ చావ్లా వంటి అస్మదీయులను కమిషనర్లుగా నియమించారు. శేషన్ ప్రవేశపెట్టిన సంస్కరణలు, కట్టుదిట్టంగా అమలు చేసిన నిబంధనలన్నీ ఇప్పుడు నీరుకారినట్లు అనిపిస్తున్నాయి. అన్ని వ్యవస్థల మాదిరే ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. డబ్బు, మద్యం, రెచ్చగొట్టే ఉపన్యాసాలతో పాటు అనేక అవలక్షణాలు ఎన్నో మళ్లీ ప్రవేశించాయి. అధికారంలో ఉన్న రాజకీయనాయకుల ఆగడాలపై శీతకన్ను వేసే పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది.


గత కొన్నేళ్లుగా ఎన్నికల కమిషన్‌పై రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. పోలైన ఓట్ల శాతాన్ని ప్రకటించడంలో విపరీతమైన ఆలస్యం చేయడం, అంచనాలను అధిగమించి అత్యధిక ఓట్లు పోలయ్యాయని ప్రకటించడం, లెక్కపెట్టిన ఓట్లు, పోలైన ఓట్లకు పొంతన లేకపోవడం, ఓటర్ల జాబితాలో పేర్లు మాయం కావడం లాంటి అనేక ఆరోపణలు వచ్చాయి. 2014 నుంచీ ఇప్పటి వరకూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అంతర్గత కారణాల వల్ల కమిషన్‌కు రాజీనామా చేసి వెళ్లడం కూడా కొట్టిపారేయదగిన విషయం కాదు. 2018లో మధ్యప్రదేశ్‌లోను, 2024లో మహారాష్ట్రలోనూ భారీ ఎత్తున బోగస్ ఓటర్లను చేర్చారన్న ఆరోపణలు వచ్చాయి. 2024 సార్వత్రక ఎన్నికల్లో కూడా అక్రమాలు జరిగాయని రాహుల్‌గాంధీ ఇప్పుడు ఆరోపిస్తున్నారు. బిహార్‌లో ఎస్ఐఆర్‌ను నిర్వహిస్తున్న వేలాది మంది స్థానిక ఈఆర్‌ఓలు, క్రింది స్థాయి సిబ్బంది ఓటర్ల జాబితాలో చేసే మార్పులపై ఇప్పుడు ప్రతిపక్షాలు దృష్టి సారిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత మాట అటుంచితే తాము ఓడిపోయినందుకు కారణాలు వెతుక్కోవడం ప్రతిపక్షాల నైజం. గతంలో బీజేపీ కూడా ఓడిపోయినప్పుడల్లా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించేది. అదే సమయంలో తాము గెలిచిన నియోజకవర్గాల్లో అక్రమాలు జరిగాయని ఏ పార్టీ ఆరోపించదనేది సత్యం.


ఎన్నికల్లో ఒక పార్టీ ఓడిపోవడానికి ప్రజా వ్యతిరేకత ప్రధాన కారణం. ప్రజా వ్యతిరేకత ఏ మాత్రం ఉన్నా మిగతా కారణాలు కూడా ఆ పార్టీ ఓటమిని మరింత బలపడేలా చేస్తాయి. చాలా చోట్ల ప్రజలు తమ వ్యతిరేకతను పైకి వ్యక్తం చేయరు. ‘నా నియోజకవర్గంలో ఒక గ్రామంలో నేను ఎప్పుడు వెళ్లినా నన్ను ప్రేమగా బిడ్డా అని పలకరించే ఒక వృద్ధురాలు ఈ సారీ నన్ను చూడగానే ముఖం తిప్పుకుంది. దీనితో నేను ఓడిపోతానని అర్థమైంది’ అని సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి ఒక సందర్భంలో చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలో కూడా వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంటే సామాజిక వర్గాలు, ప్రలోభాలు, అధికార దుర్వినియోగం, మతతత్వ పోకడలు కాపాడలేవనేది సత్యం.


ఆగస్టు 1న ప్రకటించిన బిహార్ ఓటర్ల ముసాయిదా జాబితాలో 66 లక్షల మందిని తొలగించారు. వారిలో ఫారాలు సమర్పించనివారు, మరణించినవారు, వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు. బిహార్‌లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, నేపాలీ చొరబాటుదారులు ఎంతమంది ఉన్నారో ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు. దేశంలో ఎక్కడైనా 18 సంవత్సరాలు దాటినవారు ప్రతిసారీ పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకుంటారు. అయితే బిహార్‌లో మాత్రం ప్రతి ఎన్నికలకూ ఓటర్ల సంఖ్య పెరుగుతూ ఉంటే ఈసారి ఓటర్ల సంఖ్య తగ్గినట్లు స్పష్టమవుతోంది. 2025 జనవరిలో ప్రకటించిన జాబితా ప్రకారం 7.80కోట్ల ఓటర్లు ఉంటే ఇప్పుడు ప్రకటించిన ఎస్ఐఆర్ తొలి జాబితా ప్రకారం 7.24 కోట్ల మందికి తగ్గిపోయారు. సెప్టెంబర్ 1న ప్రకటించే మలి జాబితాలో ఇప్పుడున్న ఓటర్లలో ఎంతమంది అదృశ్యమవుతారో చెప్పలేం. బిహార్ ఎస్ఐఆర్ చిలికిచిలికి గాలివానగా మారి దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు.


ఎన్నికల వ్యవస్థలో అక్రమాలు సంభవించకుండా చూడవల్సిన బాధ్యత ఉన్న ఎన్నికల కమిషన్ స్వయంగా వివాదాలకు గురైతే దేశంలో ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం పోతుంది. గత ఏడాది చండీగఢ్‌లో ఒక రిటర్నింగ్ అధికారి మేయర్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఈ రిటర్నింగ్ అధికారి క్షమాపణతో సంతృప్తి చెంది శిక్ష విధించకుండా వదిలిపెట్టారు. ఆ అధికారే మళ్లీ నామినేటెడ్ కౌన్సిలర్‌గా ఆరునెలల్లో మున్సిపల్ కార్పొరేషన్‌లో అడుగుపెట్టారు. తెలంగాణలో ఒక సీఈఓ హయాంలో మిస్సింగ్ ఓట్లు, పోలయిన ఓట్ల విషయంలో రెండుసార్లు తీవ్ర ఆరోపణలు వస్తే ఆయన క్షమాపణలు చెప్పి ఊరుకున్నారు. ఆధునిక భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇలాంటి ప్రహసనాలు మనకెన్నో ఎదురవుతాయి.

-ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Aug 06 , 2025 | 03:07 AM