Share News

Corruption in Judiciary: న్యాయ వ్యవస్థకు మకిలి పట్టిందా

ABN , Publish Date - May 20 , 2025 | 02:57 AM

న్యాయవ్యవస్థలో అవినీతిపరులున్నట్టు కొందరు విమర్శించినప్పటికీ, నిజాయితీగా పనిచేస్తున్న పెద్ద సంఖ్యలో న్యాయమూర్తుల గురించి కూడా ఆలోచించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల మధ్య అవినీతిపై చేసిన వ్యాఖ్యలు కేవలం కొంతమేర నిజం మాత్రమే.

Corruption in Judiciary: న్యాయ వ్యవస్థకు  మకిలి పట్టిందా

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల్లో సగం మంది అవినీతిపరులు, నేరస్తులేనని వేర్వేరు సందర్భాల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ గతంలో ఆరోపించారు. వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకున్నప్పుడు, జరిమానా కట్టడానికి సైతం వారు నిరాకరించి తమ మాట మీదే నిలబడ్డారు. ‍ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మ నివాసంలో జరిగిన ఓ అగ్ని ప్రమాదం అనంతరం కాలిన కరెన్సీ నోట్లు బస్తాల కొద్దీ బయటపడ్డాయి. దీంతో ‘న్యాయమూర్తుల అవినీతి’ అంశం దేశవ్యాప్తంగా మరోసారి చర్చల్లోకొచ్చింది. పక్కా ఆధారాలు దొరికిపోయినా, సాధారణ నేరస్తుల్లాగా యశ్వంత్‌ వర్మ ఆ నేరారోపణను తిరస్కరించి, ‘తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంద’ని వెల్లడించారు. గతంలో సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.డి. దినకరన్‌లా తన పదవికి రాజీనామా చేసి ఉంటే కనీసం ఆయనకు గౌరవం అయినా దక్కేది. యశ్వంత్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు తిరిగి బదిలీ చేయబోగా, ‘‘మా హైకోర్టేమీ చెత్తబుట్ట కాదు’’ అంటూ అక్కడి న్యాయవాదులు విధులను బహిష్కరించి ఆందోళన చేశారు. చివరకు యశ్వంత్‌ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ నాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా మే 7న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి వచ్చింది.


దేశంలోని అన్ని హైకోర్టుల్లోను (25) కలిపి 1,044 మంది న్యాయమూర్తులు ఉండాలి. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. ఇక కింది స్థాయిలో మొత్తం 25,077 మంది న్యాయమూర్తులుండాలి. కానీ ప్రస్తుతం 19,309 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. ఇంకా 5,768 ఖాళీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లో న్యాయమూర్తుల సంఖ్య 533, తెలంగాణలో 461. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. నేను న్యాయవాదిగా 42 సంవత్సరాల నుంచి క్రియాశీలకమైన ప్రాక్టీస్‌లో ఉన్నాను. నా సర్వీసు మొత్తంలో నేను సుమారు ఐదారు వందలమంది న్యాయమూర్తులతో కలిసి పనిచేశాను. న్యాయమూర్తుల గురించిన పరోక్ష సమాచారం కూడా నాకు అందుతూ ఉంటుంది. అందులో కూడా ఈ మొత్తం సంఖ్య 1000 మంది అనుకుంటే.. వీరందరిని కలిపి చూసినా కూడా అవినీతి ఆరోపణలు వచ్చిన న్యాయమూర్తులు ఏ స్థాయిలోనూ అయిదు శాతం మంది కూడా ఉండరు. 80వ దశకం ప్రారంభంలో నేను న్యాయవాదిగా వచ్చినప్పుడు జిల్లా జడ్జి జీతం పదివేల లోపు, మేజిస్ట్రేటుల జీతం మూడువేల లోపు ఉండేది. అయినా నిజాయితీగా జీవించిన న్యాయమూర్తులే అధికం. ఎలా చూసినా మొత్తం న్యాయమూర్తుల్లో అవినీతిపరులు అయిదు శాతం కన్నా తక్కువే ఉన్నా... సగానికి సగం అవినీతిపరులు ఉన్నట్లు పేర్కొనటం న్యాయమేనా? ఈ అవినీతి కూడా ఉన్నత స్థాయి న్యాయమూర్తుల్లో ఉన్నంతగా కింది స్థాయిలో లేదనే విషయం కూడా గమనించాలి. న్యాయమూర్తుల్లో నీతి, న్యాయం కోసం తమ భవిష్యత్తును పణంగా పెట్టిన మహానుభావుల్ని కూడా మనం స్మరించుకోవాలి.


ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పునిస్తే తదనంతర పరిణామాలు తెలిసి కూడా జస్టిస్‌ జగ్‌మోహన్‌ సిన్హా 1975లో ఆమె ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘జీవించే హక్కు’పై తీర్పు చెప్పిన జస్టిస్‌ ఖన్నా, ఆ తీర్పు ఇవ్వడానికి ముందు తన చెల్లెలితో మాట్లాడుతూ.. ‘రేపు నేనివ్వబోయే తీర్పు భవిష్యత్తులో నన్ను ప్రధాన న్యాయమూర్తిగా ఉండనివ్వదు’ అన్నారట. అన్నట్లే ఆయన స్థానంలో జూనియర్‌ అయిన జస్టిస్‌ బేగ్‌ను 1976లో సీజేగా నియమించారు. జస్టిస్‌ ఏ.ఏ. ఖురేషిని సుప్రీం కొలీజియం సిఫార్సు చేసినా కూడా గుజరాత్‌లో మోదీకి, అమిత్‌షాకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన కారణంగా ఆయన్ను సుప్రీంకోర్టు మెట్లు ఎక్కనివ్వలేదు. పదవీ విరమణ తర్వాత ఇతర పదవుల కోసం కక్కుర్తి పడిన ఓ అయిదారుగురిని చూపించి నిజాయితీగా జీవితం గడిపిన వందలాది న్యాయమూర్తుల్ని అవమానించటం సరైనది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాల్ని అనుసరించిన అనేక సందర్భాల్లో ప్రజలకు ఊరట కలిగించింది న్యాయవ్యవస్థే. ప్రతిపక్షాలు సైతం నిర్వీర్యమైన పరిస్థితుల్లోనూ న్యాయస్థానాలే ప్రజలను ఆదుకున్న చరిత్రని 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో చూశాం. అందుకే పదవీ విరమణ చేసి వెళ్లిపోతున్న న్యాయమూర్తులకు ప్రజలు బారులు తీరి నీరాజనాలు పలికిన దృశ్యాల్ని ఆనాడు అనేక మాధ్యమాల్లో వీక్షించాం. మరి మొత్తం న్యాయవ్యవస్థ పాపపంకిలమైందన్నట్లు ప్రచారం చేయడం న్యాయం కాదు. ప్రజలు అంతిమంగా ఆధారపడాల్సిన వ్యవస్థ పట్ల అపనమ్మకం కలిగించటం కూడా భావ్యం కాదు.

-చెరుకూరి సత్యనారాయణ

Updated Date - May 20 , 2025 | 02:57 AM