Share News

Urea Crisis in Telangana: సమన్వయ లోపంతోనే యూరియా కష్టాలు

ABN , Publish Date - Aug 30 , 2025 | 04:54 AM

తెలంగాణలో వానాకాలం పంటలకు అవసరమైన ఎరువులు దొరక్క రైతులు ఆందోళన చెందుతుంటే, ప్రభుత్వం మాత్రం స్థానిక ఎన్నికలపై దృష్టి సారించిందన్న..

Urea Crisis in Telangana: సమన్వయ లోపంతోనే యూరియా కష్టాలు

తెలంగాణలో వానాకాలం పంటలకు అవసరమైన ఎరువులు దొరక్క రైతులు ఆందోళన చెందుతుంటే, ప్రభుత్వం మాత్రం స్థానిక ఎన్నికలపై దృష్టి సారించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఈ యూరియా కొరత ఎందుకు వచ్చింది? తెలంగాణలో అన్నదాతలు యూరియా కోసం వానలో తడుస్తూ సరఫరా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం సరిహద్దుల వరకు ఇదే దృశ్యం. చివరికి విసిగి వేసారి రాస్తారోకోలు కూడా నిర్వహించారు. ఇది కేవలం రైతుల సమస్యగానే కాక, రాజకీయంగా కూడా చిచ్చు రేపుతోంది. వానాకాలంలో పత్తి, వరి పంటలకు యూరియా డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ ఖరీఫ్‌లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. కేంద్రం 9.8 లక్షల టన్నులు కేటాయించినా, ఆగస్టు నాటికి 5.4 లక్షల టన్నులే రాష్ట్రానికి చేరాయి. దాంతో 3 లక్షల టన్నుల లోటు ఏర్పడింది. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, కేంద్రం మధ్య ఆరోపణల యుద్ధం, సమన్వయ లోపం వల్ల రైతులు నష్టపోయారు. సమయానికి ఒత్తిడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత యూరియా అవసరం మరింత పెరిగింది. ఎకరానికి 170 కిలోల వినియోగం ఉంది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. భారీ వర్షాలతో యూరియా కొరత రాష్ట్రవ్యాప్తంగా మరింత తీవ్రమైంది. ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయాలు, సహజవాయువు ధరల పెరుగుదల, చైనా వంటి దేశాల ఎగుమతి పరిమితులు యూరియా దిగుమతులపై ప్రతికూల ప్రభావం చూపాయి. యుద్ధ ఉద్రిక్తతలు కూడా దిగుమతి సమస్యలను మరింత పెంచాయి.


వర్షాకాలం రాకముందే, మార్చి నెల నుంచే యూరియా నిల్వలను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. వర్షాకాలం సమీపిస్తోందని ముందుగానే అంచనా వేసి, యూరియా నిల్వల కోసం కేంద్ర అధికారులతో సంప్రదింపులు జరపడంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. గత పది సంవత్సరాలుగా రాష్ట్ర అధికారులు, వ్యవసాయ శాఖ మంత్రి ఏప్రిల్–మే నెలల్లోనే ఢిల్లీకి వెళ్లి యూరియా నిల్వలను సమీకరించేవారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పద్ధతిని అనుసరించకపోవడం వల్లే ఈ రోజు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో బ్లాక్ మార్కెటింగ్ హల్‌చల్ చేస్తోంది. సబ్సిడీ యూరియా పారిశ్రామిక అవసరాలకు మళ్లిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ప్రైవేట్ డీలర్ల వద్ద నిల్వలు, అధిక ధరలు, కఠిన రేషన్ విధానాలు రైతులకు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్‌ (డీఈఎఫ్‌) వినియోగం గణనీయంగా పెరిగింది. నూతన డీజిల్ వాహనాలకు ఇది తప్పనిసరి కావడంతో, డీఈఎఫ్‌ తయారీలో యూరియాను వినియోగిస్తున్నారనే సమాచారం ఉంది. ఫలితంగా వ్యవసాయానికి కేటాయించిన సబ్సిడీ యూరియా పారిశ్రామిక అవసరాలకు మళ్లిపోయే అవకాశం ఉంది. ఈ దందాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విజిలెన్స్‌ అధికారులను రంగంలోకి దించి, కఠిన చర్యలు తీసుకోవాలి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ 145 పని దినాల్లో 78 రోజులు నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలు, అమ్మోనియం లీకేజీతో ఉత్పత్తి నిలిచిందని యాజమాన్యం చెబుతోంది. ఈ ప్లాంట్ సామర్థ్యం ఏటా 12 లక్షల టన్నులు. షట్‌డౌన్ ప్రభావం తెలంగాణ వాటాపై పడింది. యూరియా కొరత వెనుక ప్రపంచ, దేశీయ సరఫరా సమస్యలు, పెరిగిన సాగు, స్థానిక ఉత్పత్తి అంతరాయాలు, బ్లాక్ మార్కెటింగ్, రాజకీయ సమన్వయ లోపం ఉన్నాయి. రైతు కష్టాలు తీరాలంటే సమయానికి సరఫరా, పారదర్శక పంపిణీ, తగిన బఫర్ స్టాక్‌లు, సమన్వయంతో కూడిన ప్రణాళిక తప్పనిసరి. లేకపోతే ప్రతి ఏడాది రైతులకు కష్టాలే మిగులుతాయి.

-బోయిన‌ప‌ల్లి వినోద్‌ కుమార్‌ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు

Updated Date - Aug 30 , 2025 | 04:55 AM