Regularization of Teachers: కాంట్రాక్ట్ అధ్యాపకుల డిమాండ్ అక్రమం
ABN , Publish Date - May 10 , 2025 | 03:49 AM
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులరైజేషన్ కోసం ఆందోళనలు చేస్తున్నారు. అయితే, ఈ డిమాండ్‌ను అప్రజాస్వామికంగా భావించి, శాస్త్రీయ విద్యావిధానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకులు వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని ఆందోళన చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ విధివిధానాలకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసిన నాటి నుంచి ఈ ఆందోళనలు మొదలయ్యాయి. అయితే ఇది ఒక అశాస్త్రీయమైన, అప్రజాస్వామికమైన డిమాండ్. ప్రభుత్వరంగ సంస్థలలో లేదా విశ్వవిద్యాలయంలో ఉద్యోగులను నియమించడానికి ఒక ప్రక్రియ ఉంటుంది. నైపుణ్యం కలిగిన అర్హులైన వారిని ఉద్యోగులుగా నియమిస్తారు. విశ్వవిద్యాలయాల్లో నోటిఫికేషన్ లేకుండా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా, రోస్టర్ విధానం అమలు చేయకుండా, కాంట్రాక్ట్ అధ్యాపకులు నియమాకాల్లోకి వచ్చారు. ఇలాంటి చర్యలు రాజ్యాంగ విరుద్ధం. రిజర్వేషన్లను పాటించకుండా జరిగిన ఇటువంటి నియామక ప్రక్రియ ద్వారా ఉద్యోగాల్లోకి వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయమని డిమాండ్ చేయడం అన్యాయం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒప్పంద అధ్యాపకులు కోఠి మహిళా యూనివర్సిటీలో, మంథనిలో ధర్నా నిర్వహిస్తూ ఈ సమస్య గురించి తెలియని విద్యార్థుల చేత రెగ్యులరైజేషన్ డిమాండ్‌ను పలికించారు. తరగతులు బహిష్కరిస్తూ రోడ్ల మీద కూర్చోబెట్టారు.
ఆ సమస్యలో ఉన్న రాజ్యాంగేతర డిమాండ్ల గురించి తెలియని అమాయకమైన విద్యార్థులను ఆందోళనలో భాగం చేయడం సమర్ధనీయం కాదు. గతంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎలాంటి నియామక ప్రక్రియా లేకుండా ఉద్యోగాల్లోకి వచ్చారు. వారు రెగ్యులరైజేషన్ అడగడం ఒక సమస్య అయితే, శాస్త్రీయ విద్యావిధానం కోసం పనిచేస్తున్న ప్రగతిశీల వాదులు ఈ ఆందోళనలకు మద్దతు తెలపడం ఆశ్చర్యం. శాస్త్రీయ విద్యావిధానం కోసం పోరాడేవారు దానికి విఘాతం కలిగించే చర్యలను ఖచ్చితంగా అడ్డుకుంటారు. విద్యారంగంలో నైపుణ్యానికి పెద్ద పీట ఉంటుంది కానీ, అనుభవానికి కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రపంచ అవసరాలకు తగిన నైపుణ్యాలు సంపాదిస్తున్న నేటి తరంలో నైపుణ్యాల ప్రతిపాదికన కాకుండా కేవలం అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోమని అడగడం బాధాకరం. దశాబ్ద కాలంగా రాష్ట్రంలోని యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 292 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పింది. ఇంకా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో 1200 పైచిలుకు అధ్యాపక నియామకాలు చేయాల్సి ఉంది. అయితే 1100కు పైగా ఉన్న కాంట్రాక్టు అధ్యాపకులు 292 పోస్టుల్లో వాళ్ళని రెగ్యులరైజేషన్ చేయమని అనడం వాళ్ళ డిమాండ్‌లో ఉన్న సంక్లిష్టతను, అస్పష్టతను తెలియజేస్తుంది. డిగ్రీలు, పీజీలు ఉన్నతమైన మార్కులతో పాసై పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులు 10 సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం వేచి చూస్తున్న తరుణంలో ఒప్పంద అధ్యాపకుల ఆందోళనలు వీరి ఆశలను తుంచే విధంగా ఉన్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులు దశాబ్దకాలం పైగా ప్రభుత్వ విద్యా రంగంలో పనిచేస్తున్నారు. కాబట్టి వారికి రాబోయే యూనివర్సిటీ నియామకాలలో అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని కోసం అప్రజాస్వామికమైన రెగ్యులరైజేషన్ కాకుండా, నియామక ప్రక్రియలో వెయిటేజ్ ఇవ్వాలి. అదే విధంగా సమాన పనికి సమాన వేతనాన్ని అందజేయాలి. ఆరోగ్య భద్రత కల్పించి వారిని ఆదుకోవాలి. ఒప్పంద ఉద్యోగులు భారత రాజ్యాంగ విలువలకు లోబడి ప్రజాస్వామ్యయుతమైన, న్యాయమైన డిమాండ్లతో ఉద్యమాలను చేపట్టాలి
- అల్లూరి విజయ్ PDSU (విజృంభణ),
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ