President Rule: మార్పులేని మణిపూర్
ABN , Publish Date - Jul 29 , 2025 | 02:57 AM
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతిపాలనను మరో ఆర్నెల్లు పొడిగించాలని కేంద్రం నిర్ణయించుకుంది..
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతిపాలనను మరో ఆర్నెల్లు పొడిగించాలని కేంద్రం నిర్ణయించుకుంది. రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడ్డాయన్న కేంద్రం వాదన సరైనదే అయినప్పుడు ఈ కొనసాగింపు అవసరం నిజానికి ఉండకూడదు. పగ్గాలు మరో ఆర్నెల్లు కేంద్రం చేతిలోనే ఉండాలని అనుకుంటున్నారంటే, రాష్ట్రం ఇంకా గాడినపడలేదని ఒప్పుకున్నట్టే. తమకు ఎంతో ప్రీతిపాత్రుడైన బీరేన్‌సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే మణిపూర్ తొలి ఆర్నెల్ల రాష్ట్రపతి పాలనలో మెరుగుపడిందనీ, మరికొంతకాలం ఇలాగే తమచేతుల్లోనే కొనసాగితే పూర్తిగా బాగుపడిపోతుందని కేంద్రం తాను నమ్ముతూ, మననూ నమ్మమంటున్నదేమో!
వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వరకూ వర్తించబోయే ఈ కొనసాగింపుతో మణిపూర్ ఏడాది రాష్ట్రపతిపాలన పూర్తిచేసుకుంటుంది. రెండేళ్లపాటు మతాల మధ్య చిచ్చురాజేసి, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేసిన ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 13న రాజీనామా చేయడంతోనే రాష్ట్రపతిపాలన అమలులోకి వచ్చింది. ప్రభుత్వ వ్యవస్థలన్నీ కుప్పకూలి, యంత్రాంగం నిర్వీర్యమై, అరాచకం ప్రబలిపోవడంతో ఇక నేరుగా రాష్ట్రాన్ని గుప్పిట్లోకి తీసుకోకతప్పదని కేంద్రం భావించింది. సంక్షోభ నివారణకు ఉద్దేశించిన తాత్కాలిక చర్యగా ప్రజలు రాష్ట్రపతిపాలనను భావిస్తారు కనుక, సాధ్యమైనంత త్వరలో దానిని ఎత్తివేసి ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పే పని మొదలవుతుందని కూడా ఆశిస్తారు. అయితే, మణిపూర్ విషయంలో కేంద్రం నిర్ణయం ఇందుకు విరుద్ధంగా ఉన్నందున, రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రతిష్ఠించి, సమాజాన్ని సాధారణస్థితికి తెచ్చే కృషిలో ప్రభుత్వ ప్రయత్నాలు పరిపూర్ణంగా ఫలించలేదని అనుకోవాలి.
బీరేన్‌సింగ్ దిగినవెంటనే రాష్ట్రంలో పరిస్థితులు మారిపోతాయన్న భ్రమలు ఎవరికీ లేవు. ఆఖరునిముషం వరకూ ఆయన ముఖ్యమంత్రిగా కాక, ఒక మీతీ నాయకుడిలాగానే వ్యవహరించడంతో, రాష్ట్రం మతవిద్వేషాలతో భగ్గుమన్నది, మీతీలకూ కుకీ–జో తెగలకు మధ్య అవిశ్వాసం పతాకస్థాయికి చేరింది. పోలీసు బలగాలను మీతీ మిలిటెంట్ గ్రూపుల జోలికి పోకుండా నిరోధించారాయన. ‘వాళ్ళను ఆయుధాలు దోచుకోనివ్వండి’ అంటూ మీతీలపక్షాన ఆయన చేసిన వ్యాఖ్యలు ఆడియోటేపుల రూపంలో లీకై, వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ పోయి, ఆ గొంతు బీరేన్‌దేనని నిర్థారణ జరిగి, తనతోపాటు బీజేపీ పెద్దలు పరువుకూడా తీశారు. బీరేన్‌ను తప్పిస్తే తప్ప, హింసకు అడ్డుకట్టపడదని, పరిస్థితులు మారవని మీతీయేతర జాతులూ తెగలూ 2023 నుంచీ మొత్తుకుంటూనే ఉన్నాయి. అయినా, ఢిల్లీ పెద్దలు దిగిరాలేదు. రెండేళ్ళపాటు ఆయన చిత్తం వచ్చినట్టు వ్యవహరించాడు. ఎప్పుడైతే బీరేన్‌కు వ్యతిరేకంగా పార్టీలోనే నిప్పురాజుకొని, స్పీకర్ కేంద్రంగా తిరుగుబాటు రాజకీయం సాగి, కాంగ్రెస్ ఎత్తులతో బీజేపీప్రభుత్వం కూలిపోవడం ఖాయమని తేలిపోయిందో, కేంద్రం ఆయనను నిర్దాక్షిణ్యంగా వదిలించుకుంది. అవిశ్వాసతీర్మానానికి తావులేకుండా ఢిల్లీపెద్దలు రాష్ట్రపతిపాలన విధించి, రాష్ట్రం చేజారిపోకుండా జాగ్రత్తపడ్డారు. బీరేన్ నిష్క్రమణ తరువాత, హింస క్రమంగా నియంత్రణలోకి వచ్చింది, ఆయుధాల స్వాధీనం కూడా జోరందుకుంది. ఇటీవల మీతీ రాడికల్ సంస్థ ‘అరంబై తెంగోల్’ నాయకుడు కనాన్ సింగ్‌ను సైతం సీబీఐ అరెస్టుచేసింది. అప్పుడు కాస్తంత హింస రేగినా, గతంతో పోల్చితే మీతీల జోరుతగ్గి, కుకీ–జో తెగల విశ్వాసం పెరిగింది.
సాధ్యమైనంత త్వరలో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని, అందుకు కేంద్రహోంమంత్రి సానుకూలంగా ఉన్నారని బీరేన్‌సింగ్ ఈ మధ్య తరచుగా తెరమీద కనిపిస్తూ హామీలు ఇస్తున్నారు. తొలి ఆర్నెల్ల రాష్ట్రపతిపాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడినప్పటికీ, బీరేన్ కారణంగా నిలువునా చీలిన సమాజాన్ని దగ్గరచేసే ప్రయత్నాలు జరగలేదు. పౌరసమాజ భాగస్వామ్యంతో పాటు, రాష్ట్రంలో రాజకీయవాతావరణం నెలకొన్నపక్షంలో ఆ అగాధాన్ని పూడ్చడానికి వీలుపడుతుంది. సాధ్యమైనంత వేగంగా రాష్ట్రపతిపాలనకు స్వస్తిచెప్పి, అన్ని జాతులు, తెగల సముచిత ప్రాతినిథ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినపక్షంలో మణిపూర్‌లో మార్పు చూడగలం.