Share News

First Step to Ending Criminal Politics: నేర రాజకీయాల ఆటకట్టుకు తొలి అడుగు

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:27 AM

తీవ్ర నేరాభియోగాలపై అరెస్టై వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, చివరికి ప్రధానమంత్రినైనా 31వ...

First Step to Ending Criminal Politics: నేర రాజకీయాల ఆటకట్టుకు తొలి అడుగు

తీవ్ర నేరాభియోగాలపై అరెస్టై వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, చివరికి ప్రధానమంత్రినైనా 31వ రోజు పదవి నుంచి తప్పించడానికి రాజ్యాంగంలోని 75, 164, 239ఎఎ అధికరణలకు సవరణలను ప్రతిపాదిస్తూ 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 20న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు నిబంధనలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధమని, రాజకీయ దురుద్దేశాలతో ప్రతిపక్షాలకు చెందిన నాయకులను గద్దె దించడానికి దోహదపడతుందని విపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. చివరకు ఈ బిల్లుల్ని సమగ్ర అధ్యయనం నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనకు పంపించాలని మూజువాణీ ఓటుతో లోక్‌సభ నిర్ణయించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి వారం చివరి రోజున జేపీసీ తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రాజ్యాంగ సవరణ దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల్లో కలవరం సృష్టిస్తోంది. అత్యున్నత అధికార స్థానాల్లో అవినీతిని రూపుమాపేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని ఇటీవల బిహార్ పర్యటనలో ప్రధాని మోదీ ఆరోపించారు. ఒక సాధారణ ప్రభుత్వోద్యోగి ఒక చిన్న తప్పు చేసి కొంతకాలం జైలు జీవితం గడిపితే సస్పెన్షన్‌కు గురవుతున్నప్పుడు, 30 రోజులు జైలులో ఉన్న ముఖ్యమంత్రి లేదా ప్రధాని తమ స్థానం నుంచి దిగిపోకుండా ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు ఊచలు లెక్కిస్తూనే మరోవైపు ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారంటే మనం చింతించాలని అన్నారు. అయితే ఈ నిబంధన తటస్థంగా ఉండవలసిన వ్యవస్థలను అనివార్యంగా రాజకీయమయం చేస్తుందని, బెయిలు దరఖాస్తులను నిర్ణయించే జడ్జీలు ఎవరు పాలించాలో నిర్ణయించే శక్తులుగా మారతారని, పోలీసులు కూడా తాము ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని గ్రహిస్తారని కొందరు విమర్శిస్తున్నారు.


అయితే నేరమయమై పోయిన నేటి రాజకీయాల్లో మార్పునకు ఇది ఒక తొలి అడుగుగానే భావించాలే తప్ప, యూనియన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రాజ్యాంగ సవరణతో దేశ రాజకీయాలు సచ్చీలంగా మారిపోతాయని అనుకోవడం భ్రమే. అలాగే ఈ సవరణ ప్రభుత్వాన్ని మార్చేందుకు రాజ్యాంగం ప్రసాదించిన ‘కూల్చివేత ఆయుధం’గా ఎన్డీయే ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని, బ్యాలెట్ కన్నా లాకప్ ఒక మార్గంగా మార్చుకుంటుందని అనుకోవడం కూడా పొరపాటే. నేర రాజకీయాలు అంతమైతే నష్టపోయేవారు హింసా రాజకీయాలకు, నేరాలకు పాల్పడే రాజకీయ నాయకులే... కాబట్టి కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ సవరణను వ్యతిరేకిస్తున్నారన్నది నిజం. వాస్తవానికి మన దేశంలో నేర రాజకీయాలు ఏదో ఒక పార్టీకి మాత్రమే పరిమితమయ్యాయని భావిస్తే పొరపాటు. అన్ని ప్రధాన పార్టీలూ నేరచరితులకు నిర్లజ్జగా పెద్దపీట వేస్తున్నాయి. ఈ నేర చరితులనే సమాజానికి ఆదర్శంగా చూపుతున్నాయి. ఎన్నికల్లో దౌర్జన్యం చేసి గెలవగానే ఈ పార్టీల ప్రభుత్వాలే నేరస్తులపైన కేసుల్ని రద్దు చేస్తున్నాయి. నేరస్తుడి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి, అతడికి రక్షణ పేరుతో సాయుధ పోలీసులనిస్తోంది ప్రభుత్వం! ఇక గెలవగానే అది వరకు నేరస్తులను నిలదీసిన పోలీసు అధికారులను బదిలీ చేయించడం, తమ అడుగులకు మడుగులొత్తే వాళ్లను తమ ప్రాంతాల్లో వేయించుకోవడం అధికారంలో ఉన్నవాళ్లు చేసే మొదటి పని. ఈ విషవలయం నుంచి బయటపడడం వ్యవస్థ భవిష్యత్తుకు, ప్రజల సంక్షేమానికి అవసరం.


నిజానికి మన దేశంలో రాజకీయ నాయకులకి, నేరగాళ్లకు విడదీయరానంత ప్రగాఢ సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. మన ప్రభుత్వ వ్యవస్థలు– ముఖ్యంగా పోలీసు యంత్రాంగం నిర్వీర్యం కావడమే దీనికి ప్రధాన కారణం. పోలీసు అధికారుల నియామకాలు, బదిలీలు, ప్రమోషన్లు వంటివన్నీ ప్రభుత్వంలోని నాయకుల చేతుల్లో ఉన్నాయి. నిజాయితీగా నేర పరిశోధన చేసే ఏ అధికారి అయినా ఎన్నో ఇబ్బందులను, ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వస్తోంది. దాంతో ఇక తప్పని పరిస్థితుల్లో నాయకుల మాట విని నెట్టుకురావాల్సిన పరిస్థితి పోలీసులది. దీంతో పోలీసుల ప్రతిష్ఠ మరింత దిగజారుతోంది. నేర రాజకీయం, హింసా సంస్కృతి, అవినీతి, మాఫియా నేర సామ్రాజ్యాలు, ఎన్నికల అక్రమాలు, కులం పేరుతో ముఠాలు, ప్రైవేటు సైన్యాల ద్వారా తగాదాల పరిష్కారాలు, అధికారుల బదిలీలు, ప్రభుత్వ సిబ్బందిని సొంత సేవకులుగా వినియోగించుకోవడం, ప్రభుత్వ పనులపైన పూర్తి ఆధిపత్యం– ఇవన్నీ మన వ్యవస్థలో కలగాపులగమైపోయాయి. నేరాల దర్యాప్తులో రాజకీయ జోక్యంతో రాజకీయాలు నేరస్తులను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేసి పెట్టడం, సెటిల్మెంట్లు, ఓట్ల కొనుగోలు... ఇవన్నీ కలిస్తేనే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు అనే ఫార్ములా నేరచరితులకు రాజకీయాల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇప్పుడు జరగవలసిన మరొక చర్చ ఏమిటంటే– అవినీతి, అక్రమాలు, ఆర్థిక నేరాలు... ఇలా కేసులు ఏమైనా కావొచ్చు, ఈ కేసులలో దోషులుగా రుజువైన వాళ్ళు పోటీకి, అర్హులా, అనర్హులా అనే దానికంటే... కోర్టుల్లో ప్రాథమిక విచారణ తరువాత, నేరారోపణ జరిగిన అనంతరం తీర్పు వచ్చేలోగా అలాంటి వాళ్ళు పోటీకి అర్హులా, కాదా అనే అంశం మీద అసలు చర్చ జరగాలి. ప్రస్తుత చట్టాల ప్రకారం సాక్షాత్తూ హత్య చేసి దొరికినవాళ్ళు కూడా కోర్టుల్లో తీర్పు వచ్చి శిక్ష పడేదాకా పోటీకి అర్హులు! నాగరిక సమాజంలో ఇంతకన్నా మరో దారుణం లేదు.


ఏది ఏమైనా ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండాలంటే ఇప్పుడైనా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలూ కలిసి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. మొదటిది– సమర్థులు, నిజాయితీపరులైన అధికారులను ఎంపికచేసి, వారికి తగిన అధికారాలను, సిబ్బందిని ఇచ్చి, వెన్నుతట్టి ప్రోత్సహించడం. రెండవది– నేరగాళ్ళను, ముఠా నాయకులను ఎన్నికలకు దూరంగా ఉంచడం. ‘నాలుగు సీట్లు పోయినా ఫర్వాలేదు, మేం మాత్రం మా పద్ధతి మార్చుకుంటున్నాం’ అని ప్రజలకు ప్రత్యక్షంగా రుజువు చేయగలగాలి. మూడోది– నేర పరిశోధనలో రాజకీయ జోక్యం లేకుండా కట్టుదిట్టం చేయాలి. ప్రమోషన్లు, బదిలీలలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలి. చివరిది– నేరాల విషయంలో త్వరితగతిన న్యాయం అందేలా న్యాయవ్యవస్థలో మార్పులు జరగాలి. సకాలంలో న్యాయం అందటం నాగరికతకు చిహ్నం, అసలు న్యాయాన్నే అందించలేకపోతే రాజ్యవ్యవస్థకు, ప్రభుత్వానికి మనగలిగే హక్కులేదు. జాతీయ స్థాయిలో పెద్ద మార్పులు రావాలి. అందుకోసం ఆగకుండా కనీసం స్థానికంగా న్యాయం త్వరగా అందేలా గ్రామ న్యాయాలయాలను, పట్టణాలలో త్వరితగతిన వివాదాలు తీర్చడం కోసం తగిన న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలి. ఈ నాలుగు మార్పులతో పాటు చట్టబద్ధ పాలన సక్రమంగా అమలు చేసే విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. ఇదే సందర్భంలో సమర్థులు, నిజాయితీపరులు... ముఖ్యంగా యువత నాయకత్వ బాధ్యతల్ని అందుకునేలా, వీలున్నంత కాలం చేశాక తమ తర్వాతి తరానికి బాధ్యతల్ని బదిలీ చేసేలా సంస్కరణల్ని తెచ్చుకోవడం ఇప్పుడు ప్రజల ముందున్న ప్రధాన లక్ష్యం. అదేవిధంగా ఓటు వేసేది ఎన్నికల్లో నిలబడ్డవారికి కాదు... తన భవిష్యత్తుకు వేస్తున్నాననే స్పృహ ప్రతి ఒక్కరిలో రావాలి. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలూ ఇలాంటి చర్యలు తీసుకోకుండా, ప్రజల్లో మార్పు రాకుండా కేవలం నేర రాజకీయాల గురించి మాట్లాడుకుని ఉపయోగం లేదు. దీనికి కావలసిందల్లా రాజకీయ సంకల్పం, సమాజంలో అవగాహన.

-కూసంపూడి శ్రీనివాస్ జనసేన అధికార ప్రతినిధి,

ఆంధ్రప్రదేశ్‌

Updated Date - Sep 05 , 2025 | 12:27 AM