S. Vishnuvardhan Reddy: రాజకీయలబ్ధి కోసమే రాహుల్ కుట్రలు
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:35 AM
పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజల్ని ఎదగనివ్వకూడదు, ఎదిగితే ఎదురుతిరుగుతారు. పరిపాలనలో లేనప్పుడు ఎదగలేకపోయారు అని రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి.
‘‘పరిపాలన చేస్తున్నప్పుడు– ‘ప్రజల్ని ఎదగనివ్వకూడదు, ఎదిగితే ఎదురుతిరుగుతారు.’ పరిపాలనలో లేనప్పుడు– ‘ఎదగలేకపోయారు’ అని రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి.’’ ఈ సింపుల్ లాజిక్‌తో దేశాన్ని ఏడు దశాబ్దాలుగా నాశనం చేస్తూ వచ్చిన నెహ్రూ పరివారం ఇప్పటికీ మారలేదు. ‘దేశమంటే మా ఆస్తి’ అనుకునే ఆ పరివారంలో తెలివి మీరిన వారసుడు రాహుల్‌గాంధీ. నాడు తమ పూర్వీకులు చేసిన కుట్రల్నే నేడు ఆయన దేశంపై చేస్తున్నారు. కానీ చేతిలో అధికారం లేదు. కాబట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కులాన్ని ఆయుధంగా ఎంచుకున్నారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ‘సైన్యానికి, న్యాయవ్యవస్థ’కు కులాన్ని అంటగట్టేశారు. ‘పదిశాతం జనాభా ఉన్న కులాలే ఆయా వ్యవస్థల్ని నడిపిస్తున్నాయని, బడుగు, బలహీన వర్గాలకు అవకాశం రాలే’దని మొసలి కన్నీళ్లు కార్చారు. అదే నిజమైతే ముందుగా ఆ బడుగు, బలహీనవర్గాలన్నీ కలిసి నిర్దాక్షిణ్యంగా శిక్షించాల్సింది రాహుల్‌తో సహా నెహ్రూ పరివారాన్నే. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రెండు తరాల పాటు వారే దేశాన్ని పరిపాలించారు. దేశ ప్రజలందర్నీ సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఎదగనీయకుండా చేసింది. ఎప్పటికీ వారిని ఆశలపల్లకిలో ఉంచి ఓటు బ్యాంకుగా మార్చుకుంది. ఫలితంగా వారు ఏడు దశాబ్దాల తర్వాత కూడా వెనుకబడే ఉన్నారు. ఇప్పుడు ఆ వెనుకబాటునే చూపించి రాహుల్‌గాంధీ మరోసారి వారిని రెచ్చగొట్టి రాజకీయలబ్ధి పొందాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో డా. బి.ఆర్. అంబేడ్కర్ (1950లో మొదటి చట్టం) ప్రభావంతో ఎస్సీ, ఎస్టీలకు 22.5శాతం రిజర్వేషన్లు (విద్య, ఉద్యోగాలు) అమలు చేశారు. 1990లో మండల్ కమిషన్ (OBCలకు 27శాతం)ను వీపీ సింగ్ (కాంగ్రెస్ మద్దతు) అమలు చేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆ అరవై ఏళ్లలో ఈ వర్గాల స్థితిగతుల్లో పెద్ద మార్పేమీ లేదు.
నాటి కాంగ్రెస్ నాయకత్వంలో అగ్రవర్ణాల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. నెహ్రూ, ఇందిరా పాలనలో ఎస్సీలకు మంత్రి పోస్టులు కేవలం 5 శాతం మాత్రమే. కాంగ్రెస్ పాలనలో RTE (2009) వంటి చట్టాలు వచ్చినా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమానవిద్య అందలేదు. 1991 సంస్కరణల తర్వాత ఆర్థికవృద్ధి అర్బన్ ఎలైట్‌కు మాత్రమే పరిమితమైంది. ఇవన్నీ కాంగ్రెస్‌కు తెలియక కాదు. ‘సామాజిక న్యాయం’ పేరు చెప్పి, కార్పొరేట్ లాబీలకు తమ పార్టీ మొగ్గు చూపిందని రాహుల్‌గాంధీ గత ఏడాది స్వయంగా ఒప్పుకున్నారు. నాడు కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే ‘వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా’ను అమలు చేయలేదు. 2004 నుంచి 2014 మధ్యకాలంలో పదేళ్లపాటు రాహుల్ రాజ్యాంగేతరశక్తిగా అధికారంలో ఉన్నారు. ఏకంగా తమ సొంత ప్రభుత్వ కేంద్ర కేబినెట్ నిర్ణయాల పత్రాలను మీడియా సమావేశంలో చించి, చెత్తబుట్టలో వేసి అధికారం చెలాయించారు. కానీ... బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలందర్నీ సమానంగా అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంది. 70 ఏళ్ల పాటు కొనసాగిన వివక్షను తొలగించి, అందర్నీ సమాన స్థాయికి తీసుకురావడానికి ఓ యజ్ఞమే చేస్తోంది. నేడు చీఫ్ జస్టిస్ స్థాయికి ఓ దళిత బహుజనుడు ఎదిగారంటే దానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత EWSకు 10 శాతం రిజర్వేషన్, SC/ST సబ్ ప్లాన్ అమలు, PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కాలర్‌షిప్స్... వంటి చర్యలతో ఈ వర్గాల లిటరసీ రేటు 10–15 శాతానికి పెరిగింది. ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం 20శాతానికి చేరింది. NSSO 2023 రిపోర్ట్ ప్రకారం, ఈ వర్గాలు GDPలో కంట్రిబ్యూషన్ 12శాతానికి పెరిగింది (2014లో ఇది కేవలం 8శాతం). సుప్రీంకోర్టు జడ్జిల్లో 4/34 (12 శాతం), IASలో ఓబీసీ 18శాతం, ఎస్సీ 15శాతం, ఎస్టీ 6శాతం– మొత్తం 39శాతం ప్రాతినిధ్యం లభిస్తోంది. ఈ ప్రగతి ‘సబ్‌కా సాథ్–సబ్‌కా వికాస్’ అజెండాతో జరిగింది. నీతి ఆయోగ్ 2024 రిపోర్ట్ ప్రకారం 2014–24 మధ్య ఈ వర్గాలు 2.5 కోట్ల పీఎం ఆవాస్ ఇళ్లు, 10 కోట్ల ఉజ్వల కనెక్షన్లు పొందాయి.
ఆయా వర్గాల్లో ఆర్థిక అభివృద్ధి 8.5శాతం పెరిగింది. బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ల అమలు మెరుగుపడింది. DoPT ప్రకారం 2023లో ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ నియామకం రేటు 85శాతంగా ఉన్నట్లుగా ప్రకటించింది. 2014లో ఇది 70శాతం శాతమే. విద్యలో PM విద్యా లక్ష్‌్య, 6,000 PM శ్రీ విద్యాలయాలు – ASER 2024: SC/ST లిటరసీ 72శాతం (2014లో 62శాతం), OBC 78శాతం (నాడు 68శాతం). ఆర్థికంగా చూస్తే... జన్‌ధన్ యోజన (50 కోట్ల అకౌంట్లు, 70శాతం– SC/ST/OBC), ముద్రా లోన్‌లు (60శాతం ఈ వర్గాలకే) ఇచ్చారు. RBI 2024 రిపోర్టు ప్రకారం ఈ వర్గాలు MSMEలలో 45శాతం లబ్ధి పొందుతున్నాయి (2014లో ఇది 30శాతం మాత్రమే). 2014–24 మధ్య ఈ వర్గాలు 15 మిలియన్ల ఉద్యోగాలు పొందాయని.. పేదరికం 25శాతం నుంచి 12శాతానికి తగ్గిందని నీతి ఆయోగ్ స్పష్టంగా తెలిపింది. మోదీ ప్రభుత్వం చేపట్టిన 102వ రాజ్యాంగ సవరణ చట్టం, 2018 ద్వారా ‘వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ (NCBC)కు రాజ్యాంగ హోదా’ కల్పించడం భారత ప్రజాస్వామ్యంలో చరిత్రాత్మక అడుగుగా నిలిచింది. ఈ సవరణతో Article 338B కింద NCBC ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా రూపుదిద్దుకుంది. ఈ వివరాలను విశ్లేషించుకుంటే ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ల పాటు వారిని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తొక్కిపెట్టింది. ఇప్పుడు వారిని బీజేపీ పైకి తీసుకువస్తూంటే.. కులగణన పేరుతో రెచ్చగొట్టి వారిని మరోసారి ఎదగకుండా చేసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. నెహ్రూ పరివారంలో చివరి వారసుడి తెలివితేటలను ఇప్పుడు అందరూ గమనిస్తున్నారు. నెహ్రూ చేసిన తప్పులే దేశానికి రాచపుండ్లుగా మారాయి. వాటన్నింటినీ బీజేపీ ప్రభుత్వం మాన్పుతూ వస్తోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ తాము ఒప్పుకున్న తప్పిదాలను గుర్తు చేసుకుని.. వాటిని సరిదిద్దుకునేలా రాజకీయాలు చేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించడం అసాధ్యం.
ఎస్. విష్ణువర్ధన్‌రెడ్డి బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు