Congress in Chaos: కాంగ్రెస్ కలహ కర్ణాటకం!
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:05 AM
తనను తాను ఓడించుకోవడంలోను, తనకు తాను నష్టం కలిగించుకోవడంలోను పోటీపెడితే స్వర్ణపతకం దక్కేది కాంగ్రెస్ పార్టీకే అనడంలో ఏ మాత్రం సందేహం ...
తనను తాను ఓడించుకోవడంలోను, తనకు తాను నష్టం కలిగించుకోవడంలోను పోటీపెడితే స్వర్ణపతకం దక్కేది కాంగ్రెస్ పార్టీకే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కర్ణాటక కాంగ్రెస్‌లోని ‘అంతర్నాటకం’ ఇప్పటికే అనేక వారాలుగా మీడియా సాక్షిగా ఎడతెగకుండా ప్రదర్శితమవుతోంది. ‘కౌన్ బనేగా ముఖ్యమంత్రి’ అనే కాంగ్రెస్ తాజా రాజకీయ నాటకమది. పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ పదవిని ఆశిస్తున్న డీకే శివకుమార్ (డీకేఎస్) మధ్య ఇటీవల జరిగిన ఉదయం ఉపాహార సమావేశంలో మెనూతో పాటు ప్రతి చిన్న విశేషాన్నీ మీడియా సవివరంగా నివేదించింది, విశ్లేషించింది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఒకరు, కైవసం చేసుకునేందుకు మరొకరు కలహించుకుంటుండగా, ఎటూ పాలుపోని పార్టీ హై కమాండ్ ఆ ఉభయులనూ సంయమనపరచలేకపోతోంది. గందరగోళం, నియంత్రణ రాహిత్యం పెరిగిపోతోంది. ఈ శోచనీయ పరిస్థితులకు బాధ్యులు ఎవరు?
గతించిన మంచి రోజులలో అయితే ఆ ఇరువురికీ కాంగ్రెస్ సముచిత ప్రాధాన్యమివ్వగలిగి ఉండేది. అయితే అటువంటి సానుకూల పరిస్థితులు ఇప్పుడు బొత్తిగా లేవు. భారతదేశ పురాతన రాజకీయపక్షం ఇప్పుడు శక్తిహీనమైపోయింది. అధికార వైభవం గతించిన చరిత్రగా ఉన్నది. పార్టీలో నాయకుల మధ్య ఘర్షణలను సామరస్యపూర్వకంగా పరిష్కరించగల రాజకీయ నైపుణ్యాలు దాదాపుగా నిర్వీర్యమైపోయాయి. నాయకత్వ తగాదాలకు పరిష్కారంగా ముఖ్యమంత్రి పదవిలో, పోటీదారులను ఒకరి తరువాత మరొకరిని నియమించే పద్ధతిని అనుసరించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. నిర్మొహమాటంగా చెప్పాలంటే అదొక విడ్డూరమైన ఆలోచన. ఆచరణ యోగ్యం కానిది. కనుకనే అది పనిచేయలేదు. ముఖ్యమంత్రిగా నియమితుడైన నేత రెండున్నర సంవత్సరాల పాటు కొనసాగి, ఆ తరువాత మిగతా రెండున్నర సంవత్సరాలకుగాను ఆ పదవిని తన ప్రత్యర్థి లేదా మరొకరికి అప్పగిస్తాడా? ఈ దేశంలో ఏ నాయకుడూ స్వచ్ఛందంగా సీఎం పదవిని వదులుకోడు, అందునా ఈ కాలంలో. సిద్ధరామయ్య రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తరువాత, ఆ పదవిలో నియమిస్తామని శివకుమార్‌కు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నిజంగా హామీ ఇచ్చి ఉంటే, అది, విఫలమైన పద్ధతిని మళ్లీ అనుసరించడమే అవుతుంది. ఉపయుక్తమైన ఆలోచనేనా ఇది? గతంలో రాజస్థాన్‌లోనూ, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఈ పద్ధతిని అనుసరించేందుకు జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోయాయి. ఫలితంగా ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పరాజయం పాలయ్యాయి. మరి కర్ణాటకలో ఇప్పుడు ఆ పద్ధతి ఎందుకు పనిచేస్తుంది?
సమస్యేమిటంటే కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ బాగుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి పార్టీ ‘హై కమాండ్’ సుముఖంగా లేదు. కఠిన నిర్ణయాలు తీసుకోగల తెగువ, సత్తా దానికి లేదని చెప్పడమే సత్యమవుతుంది. 2024 సార్వత్రక ఎన్నికలలో కాంగ్రెస్ ‘పునరుద్ధరణ’ లేదూ, మరింత కచ్చితంగా చెప్పాలంటే బతికి బట్టకట్టిన పరిస్థితి కారణంగా రాహుల్‌గాంధీ నాయకత్వం పట్ల సద్భావం పెరిగింది. ముఖ్యంగా సొంత పార్టీ నేతల నుంచి గౌరవాదరాలను ఆయన తిరుగులేకుండా సముపార్జించుకున్నారు. భారత రాజ్యాంగ ప్రతిని ఎత్తిచూపుతూ జాతి నిర్మాణానికి అది నిర్దేశించిన విధివిధానాలను వివరిస్తూ బీజేపీ మహాశక్తిని ఆయన సమర్థంగా ఎదుర్కొన్నారు. ప్రత్యర్థులు పరిహసించినప్పటికీ కాంగ్రెస్‌లో ఆయన స్థానం మరింత సుదృఢమయింది. సంఘ్ పరివార్‌పై రాజీలేని పోరాటం చేసిన కారణంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయన నాయకత్వాన్ని ఎటువంటి ఆక్షేపణలు లేకుండా అంగీకరించాయి. కాంగ్రెస్‌కు తిరుగులేని నాయకుడుగా ఆయన ఆవిర్భవించారు. మరి పార్టీపై మరింత పట్టు సాధించేందుకు ఆయన పూనుకున్నారా? పార్టీ కార్యకలాపాలు అన్నిటినీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారా? పార్టీ సమస్త వ్యవహారాలనూ స్వయంగా చక్కబెడుతున్నారా? లేదు. అదే సమస్య. పార్టీ సంస్థాగత వ్యవహారాలను చాలావరకు తన విధేయులకు, మరీ ముఖ్యంగా కేసీ వేణుగోపాల్‌కు అప్పగించారు. వేణుగోపాల్ ఇప్పుడు కాంగ్రెస్ ‘వ్యవస్థ’లో రెండో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి.
మరి పార్టీ కూడా పునశ్శక్తిమంతమయిందా? 2024లో సమకూరిన చెప్పుకోదగ్గ విజయాలు వ్యర్థమయ్యాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ చతికిలపడింది.. మహారాష్ట్రలో మహిళలకు నగదు బదిలీల ద్వారా భారతీయ జనతా పార్టీ జయపతాక ఎగురవేసింది. ఢిల్లీ, బిహార్‌లలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ప్రయత్నాలు ఎల్లప్పుడూ ప్రారంభం కానివే సుమా! పరాజయం తరువాత పరాజయం పాలవుతూ కూడా కఠినమైన, వివేకవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ మరింతగా సంకోచిస్తోంది. ‘రాజకీయాలలో కొన్నిసార్లు, ఏ నిర్ణయాన్నీ తీసుకోకపోవడమే అత్యుత్తమ నిర్ణయం’ అన్న పీవీ నరసింహారావు సుభాషితాన్ని ఔదలదాల్చింది కాబోలు!
కాంగ్రెస్ హై కమాండ్‌కు గతంలో ఒక వ్యవస్థగా లేదా ఒక వ్యక్తిగా గుర్తింపు ఉండేది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కాంగ్రెస్ వ్యవహారాలలో హై కమాండ్ అనే పదానికి కాలం చెల్లిపోయినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీ వ్యవహారాలను సమర్థంగా నిర్దేశించగల ‘అత్యున్నత’ నేత ఎవరో తెలియదు; నియంత్రించగల వ్యవస్థ ఉనికిలో లేదన్నది స్పష్టం. మరి కాంగ్రెస్ ‘హై కమాండ్’ ఎవరు? సోనియాగాంధీ ఇంకెంత మాత్రం కాదు. ఆమె ఆ అత్యున్నత బాధ్యతల నుంచి దాదాపుగా వైదొలిగారు; పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం కాదు. సహచరులకు సమస్యలు సృష్టించడానికి ఆయన ఇష్టపడరు. అంతేగాక మార్పులకు చొరవ చూపే నేత కూడా కాదు; ప్రియాంకగాంధీ వాద్రా అంతకంటే కాదు. పార్టీలో ఏ నిర్దిష్ట బాధ్యతనూ ఆమెకు అప్పగించలేదు కదా. ఇక రాహుల్. కీలకమైన నిర్ణయాలు తీసుకోగల అధికారమున్న ఏకైక కాంగ్రెస్ నాయకుడు ఆయన మాత్రమే. కాంగ్రెస్ భావజాల యోధుడుగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలలో కార్యదక్షుడుగా ఆయనను ఎవరూ భావించడం లేదు. మరి కాంగ్రెస్‌కు ఇప్పుడు అత్యవసరమైనది ఘటనాఘటన సమర్థుడైన నేత కాదూ?
కర్ణాటకలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యకు మళ్లీ వద్దాం. సులువైన, సరళమైన పరిష్కారాలు ఏవీ ఇక్కడ లేవు. సిద్ధరామయ్యకు మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉన్నది. పైగా ఆయన ఓబీసీ నాయకుడు. మరి వెనుకబడిన వర్గాల సాధికారతకై, వారి జనసంఖ్యకు సమస్థాయిలో అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని హామీపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఓబీసీ ముఖ్యమంత్రి చాలా ప్రతిష్ఠాత్మకమైన బలం, సందేహం లేదు. శివకుమార్ వయసు 63 సంవత్సరాలు. సిద్ధరామయ్య కంటే 14 సంవత్సరాలు చిన్నవాడు. ప్రత్యర్థి కంటే అమితంగా శక్తి సామర్థ్యాలు ఉన్న నేత. సిద్ధరామయ్య వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కర్ణాటకలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా అద్వితీయ ప్రతిష్ఠా సంపన్నుడు అవనున్నారు. సిద్ధరామయ్య స్థానంలో శివకుమార్ ముఖ్యమంత్రి అయితే అది ఒక విధంగా పార్టీ నాయకత్వంలో తరం మార్పు అవుతుంది. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ నాయకత్వాల్లో తరం మార్పు భావనకు లభించిన అవకాశాన్ని కాంగ్రెస్ జారవిడుచుకున్నది. ఫలితంగా ప్రజల తిరస్కరణకు గురయింది. కర్ణాటకలో మరొకసారి అటువంటి అవకాశం వచ్చింది. సిద్ధరామయ్య తేలిగ్గా ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగి వెళ్లిపోయే వ్యక్తి కాదు. ఎట్టి పరిస్థితులలోనూ అధికారాన్ని నిలుపుకునేందుకే ఆయన తప్పక ప్రయత్నిస్తారు.
2027లో సిద్ధరామయ్య ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా అధికారాన్ని శివకుమార్‌కు అప్పగిస్తారనే ఊహాగానాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ తాత్కాలిక సంధి ఎంతకాలం నిలుస్తుంది? గుజరాత్‌లో మంత్రులు అందరినీ రాత్రికి రాత్రే రాజీనామా చేయాలని ఆదేశించి, వెన్వెంటనే కొత్త మంత్రివర్గాన్ని తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ సఫలమయింది. ఇదెలా సాధ్యమయింది? భారత రాజకీయాలలో నిజమైన ‘హై కమాండ్’ 7 లోక్ కల్యాణ్ మార్గ్, 6ఎ కృష్ణ మీనన్ మార్గ్‌లో ఉన్నది. బీజేపీలో ప్రధాన నిర్ణయాలు అన్నిటినీ ఆ రెండు నెలవులలో తీసుకోవడం జరుగుతోంది. బీజేపీ అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలలో కూడా అధికారం కోసం వెంపర్లాటలు, గుంజాటనలూ ఉన్నాయి. గోవాలో అవి మరీ ఎక్కువగా ఉన్నాయి. అయినా ఏ ఒక్క నాయకుడూ బహిరంగంగా ప్రభుత్వం మార్పు గురించి మాట్లాడడానికి సాహసించలేడు. సాహసిస్తే సంభవించేదేమిటో అందరికీ బాగా తెలుసు. కాంగ్రెస్‌లో పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. అధికారాన్ని ఆకాంక్షిస్తున్న వ్యక్తులు, వర్గాలు ప్రత్యర్థులతో బహిరంగంగా వాద ప్రతివాదాలు చేస్తారు. జాతీయ నాయకత్వం తమపై చర్య తీసుకోగలదనే సంకోచం ఏ ఒక్కరికీ ఉండదు గాక ఉండదు. హై కమాండ్ ప్రాబల్యం లోపించినా లేదా బలహీనపడినా జరిగేదేమిటో కర్ణాటకలో కాంగ్రెస్ వ్యవహారాలు స్పష్టం చేస్తున్నాయి. అక్కడ నాయకులు అందరూ తమ స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. అధికారాన్ని స్వాయత్తం చేసుకునేందుకే ఆరాటపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బలవంతుడు మాత్రమే నెగ్గుతాడు.
-రాజ్‌దీప్ సర్దేశాయి