A Path to Sustainable Development: వాణిజ్య పంటలతో గిరిజనులకు ఆదాయం
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:36 AM
ఏజెన్సీ ప్రాంతాల్లో వాణిజ్య పంటల సాగు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి, అలాగే గిరిజన రైతుల జీవన ప్రమాణాల పెంపునకు కీలకపాత్ర పోషించనుంది...
ఏజెన్సీ ప్రాంతాల్లో వాణిజ్య పంటల సాగు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి, అలాగే గిరిజన రైతుల జీవన ప్రమాణాల పెంపునకు కీలకపాత్ర పోషించనుంది. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పాడేరు, పార్వతీపురం వంటి ప్రాంతాల్లో రబ్బర్, జీడిపప్పు, కాఫీ, పసుపు, మిరియాలు వంటి పంటల సాగుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పంటలు వర్షాధారం, కొండ ప్రాంత వాతావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు, తక్కువ వ్యయంతో గిరిజనులకు దీర్ఘకాలిక ఆదాయం అందిస్తాయి. పంటల విలువ ఆధారిత ప్రాసెసింగ్, బ్రాండింగ్, ఎగుమతుల ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తరించి, స్థిరమైన ఆర్థికాభివృద్ధికి మార్గం సుగమం చేస్తాయి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో వాణిజ్య పంటల సాగు అవకాశాలపై మరింత దృష్టి పెట్టింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల ఆదాయ మార్గాలను గణనీయంగా విస్తృతపరిచే అవకాశం ఉన్న వాణిజ్య పంటల సాగు, అవకాశాలు, సవాళ్లను ఓసారి పరిశీలిద్దాం.
పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ సాగు ప్రస్తుతం 2,68,407 ఎకరాల్లో సాగవుతున్నా, అందులో 2,10,395 ఎకరాలు మాత్రమే ఉత్పత్తి ఇస్తున్నాయి. రాష్ట్రంలో వార్షిక ఉత్పత్తి సుమారు 25,000 మెట్రిక్ టన్నులు ఉన్నా, ఎకరాకు సగటు దిగుబడి 120 కిలోలే. ఇది జాతీయ సగటు 480 కిలోల కంటే నాలుగు రెట్లు తక్కువ. ప్రభుత్వం 2023–26 మధ్యలో 32,815 ఎకరాలను పునరుద్ధరించే లక్ష్యంతోపాటు, 2026–31 మధ్య మరో లక్ష ఎకరాలకు విస్తరించాలనే ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం కాఫీ ఉత్పత్తిలో 60శాతం ‘డ్రై చెర్రీ’ రూపంలోనే అమ్మటం కూడా పెద్ద సమస్యగా ఉంది. దీని వల్ల రైతులకు సరైన ధర లేక ఆదాయం కోల్పోతున్నారు. దీన్ని అధిగమించడానికి 10,000 చిన్న పల్పర్లు, 30 కమ్యూనిటీ ఎకో పల్పర్లు, 50 సోలార్ హైబ్రిడ్ డ్రైయర్లు, కాంక్రీట్ డ్రైయింగ్ యార్డులు, కాఫీ క్యూయరింగ్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో రబ్బర్ సాగు ప్రస్తుతం కేవలం వెయ్యి హెక్టార్లలో మాత్రమే సాగవుతుండగా, 30 వేల హెక్టార్లకు పైగా అనువైన భూమి వాడుకలో లేదు. ఆంధ్రప్రదేశ్‌లో సగటు దిగుబడి హెక్టారుకు 1,000 కిలోలు ఉంది. ఇది జాతీయ సగటు 1,400–1,500 కిలోలు కంటే తక్కువ. కాబట్టి శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక సహాయం చాలా అవసరం ఉంది. ప్రారంభ సంవత్సరాల్లో పైనాపిల్, అల్లం, అరటి, పసుపు వంటి పంటలతో అంతర సాగు చేసి రైతుల ఆదాయం పెంచవచ్చు. ప్రభుత్వం 100శాతం సబ్సిడీతో నాట్లు, 5 ఏళ్లపాటు నిర్వహణ గ్రాంట్, రబ్బర్ బోర్డు అనుసంధానం వంటి విధానాలను అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. గిరిజన ప్రాంతాల్లో జీడిపప్పు 60 వేల హెక్టార్లలో సాగవుతోంది. దేశీయ, ఎగుమతి డిమాండ్ అధికంగా ఉండడంతో, రాష్ట్రంలో సాగు పెంచితే దిగుమతులు తగ్గించి, ఎగుమతులు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర సగటు దిగుబడి హెక్టారుకు 650 కిలోలు. వియత్నాం ఉత్పత్తి (1,200 కిలోలు) కంటే తక్కువ. నాలుగేళ్లలో సారవంతమైన నాట్లు, నీటిపారుదల వసతులు అందించి దిగుబడి రెండింతలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఆదివాసీ ప్రాంతాల్లో పసుపు పంట 21,987 ఎకరాల్లో సాగవుతున్నది. ప్రస్తుతం ఎకరాకు 1–1.2 టన్నుల దిగుబడి వస్తుండగా, జాతీయ సగటు 1.4 టన్నులు. దిగుబడి పెంపునకు రోమా, ప్రగతి వంటి అధిక దిగుబడి రకాల విత్తనాలు, వ్యాధి–కీటక రహిత నాట్లు, శాస్త్రీయ సాగు పద్ధతులు, జీవ ఎరువుల వాడకం కీలకం. ఏజెన్సీ ప్రాంతంలో పసుపు ప్రాథమిక ప్రాసెసింగ్‌లో పెద్ద లోటు ఉంది. క్లస్టర్ స్థాయి మౌలిక వసతుల కొరత, యాంత్రీకరణ లోపం, నిల్వ సదుపాయాల కొరత, మార్కెట్ అనుసంధానం లేకపోవడం వల్ల రైతులు తగిన ధర పొందడం లేదు. ఈ సమస్యలను అధిగమించడానికి మినీ ప్రాసెసింగ్ యూనిట్లు, పాలిషర్లు, బాయిలర్లు, డ్రైయింగ్ ప్లాట్‌ఫార్మ్‌లు, శిక్షణా కార్యక్రమాలు, ఆర్థిక మద్దతు, సబ్సిడీలు, బలమైన మార్కెట్ చానెల్స్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మిరియాల సాగు 1,68,000 ఎకరాల్లో జరుగుతున్నది. ప్రస్తుత దిగుబడి ఎకరాకు 150 కిలోలు, ఇంచుమించు జాతీయ సగటు 160 కిలోలకు దగ్గరగా ఉంది. అయితే క్లస్టర్ స్థాయిలో లాడర్లు, సోలార్ డ్రైయర్లు, డ్రైయింగ్ ప్లాట్‌ఫార్మ్‌లు, త్రెషర్లు వంటి పరికరాల కొరత, పచ్చి దశలోనే కోత కారణంగా నాణ్యత తగ్గడం, గ్రేడింగ్ ప్రమాణాలు పాటించకపోవడం, నిల్వ, మార్కెటింగ్ లోటు వంటి సమస్యలు ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేయడానికి మినీ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆధునిక పరికరాలు, శిక్షణా కార్యక్రమాలు, రుణ సదుపాయాలు, సబ్సిడీలు, మార్కెట్ అనుసంధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ వాణిజ్య పంటల సాగుతో పాటు చెర్రీ, మామిడి, పనస, కుంకుమ వంటి పంటలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. 2024–25లో 10,818 ఎకరాల్లో వికల్ప పంటల సాగు సైతం ప్రోత్సహించగా, రూ.6 కోట్లతో ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెటింగ్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) ఉత్పత్తులను రాష్ట్రవ్యాప్తంగా విక్రయించే చర్యలతో గిరిజన రైతు కుటుంబాలకు రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు అదనపు ఆదాయం సాధించే దిశగా ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వాణిజ్య పంటల సాగుతో గిరిజన ప్రాంతాల ఆర్థిక, సామాజిక, పర్యావరణ స్థితిని గణనీయంగా మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ పంటల విస్తరణకు ప్రత్యేక ప్రణాళికలు, సబ్సిడీలు, మౌలిక వసతులు, మార్కెట్ అనుసంధానం, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది.
-కిడారి శ్రావణ్ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్