Share News

Global Threat: కలహశీల కల్లోల ప్రపంచం

ABN , Publish Date - Jul 04 , 2025 | 01:01 AM

మనం ఇప్పుడు ఒక కొత్త ప్రపంచంలో ఉన్నాం. తార్కిక క్రమం లోపించిన సంఘటనలు సంభవిస్తున్నాయి. ఏదీ అర్థవంతమైనదిగా కనిపించడం లేదు.

Global Threat: కలహశీల కల్లోల ప్రపంచం

సార్వభౌమిక దేశాలు ఉమ్మడిగా నిర్దేశించుకున్న నియమ నిబంధనలు ఆధారంగా పనిచేసే ప్రపంచ వ్యవస్థ అస్తవ్యస్తమవుతున్న పరిస్థితుల్లో వాతావరణ మార్పు లాంటి మహా సంక్షోభానికి పరిష్కారాన్ని కనుగొనడం ఎలా సాధ్యం? పురుషహంకార, యుద్ధ నిమగ్న కల్లోల ప్రపంచం మనిషికి శాంతినిస్తుందా? ధరిత్రిని ధ్వంస రచన నుంచి కాపాడుతుందా?

నం ఇప్పుడు ఒక కొత్త ప్రపంచంలో ఉన్నాం. తార్కిక క్రమం లోపించిన సంఘటనలు సంభవిస్తున్నాయి. ఏదీ అర్థవంతమైనదిగా కనిపించడం లేదు. వలసపాలన ముగిసిపోయిన కాలంలో పుట్టి పెరిగిన నాలాంటి వారు అర్ధ శతాబ్ది కాలంగా ఒక నియమబద్ధమైన ప్రపంచ వ్యవస్థను చూస్తూ వచ్చారు. సందేహం లేదు, అది అసమానతల లోకమే. అయితే సంస్కరణలకు మార్పులకు ఆస్కారమున్న ప్రపంచమది. బహుశా, అది ఒక అమాయక కాలం కావచ్చు. దృశ్యమానమవుతున్న యథార్థాల మాటున కఠోర వాస్తవాలు ఉండి ఉండవచ్చు. అయితే ప్రపంచ వ్యవస్థకు ఆర్థికంగా, సైనికంగా శక్తిమంతమైన రాజ్యాలే సారథ్యం వహిస్తున్నప్పటికీ అది సకల దేశాలకు న్యాయం చేయగలదనే నమ్మకం మాకు ఉండేది. వివేకవంతమైన వాదాలు, దార్శనిక దృక్పథాలకు ఆమోదం లభించి సహేతుకమైన నిర్ణయాలకు దోహదం జరగగలదనే నిండు నమ్మకం మాకు ఉండేది.


ఇప్పుడు నేను ఇది రాస్తున్న సమయంలో కాళ్లకింద భూమి కుంగిపోతున్న భావన కలుగుతోంది. మనం దారి తప్పిపోయామా? కచ్చితంగా. ప్రస్తుత ప్రపంచ వ్యవస్థను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. కొన్ని దేశాలు ఇరుగుపొరుగు, సుదూర దేశాలపై మారణాయుధాలతో దాడులు జరుపుతున్నాయి. ఈ దాడుల్లో కొన్ని ఎటువంటి కవ్వింపుచర్యలు లేకుండానే భావించడం దారుణం. ఏకపక్ష నిర్ణయాలతో బాంబు దాడులు చేస్తున్నాయి. జనసంహారానికి పాల్పడుతున్నాయి. ప్రపంచం నిస్సహాయంగా, మౌనంగా చూస్తూ మిన్నకుండిపోతోంది! పరాయి దేశంలో పాలన మార్పు గురించిన ప్రకటనలు వింటున్నాం. ఇదొక సాధారణ విషయమని సరిపెట్టుకుంటున్నాం; పొరుగు దేశంపై దాడి చేయడమే కాకుండా అక్కడి ప్రజలను ఆకలి దప్పులతో మరణించేలా చేస్తున్నాం. జాతి సంహారం సైతం యథేచ్ఛగా కొనసాగుతోంది ఈ దారుణాలను ఉపేక్షిస్తున్నాం. వాటిని భరించలేము. ఏమి చేయగలం? మనం పరిపూర్ణ నిస్సహాయులం.


ఇరాన్‌పై దాడి ఇజ్రాయెల్‌, అమెరికా చర్యల నైతికతకు మాత్రమే పరిమితమైన అంశం కాదు. సార్వభౌమిక దేశాలు ఉమ్మడిగా చర్చించి నిర్ణయించిన న్యాయసూత్రాల ప్రాతిపదికన నిర్మించిన ప్రపంచ వ్యవస్థ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్నను ఆ సందర్భం తీక్షణంగా లేవనెత్తుతోంది. అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)లో ఇరాన్‌ భాగస్వామిగా ఉన్నది. అణ్వాయుధాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన అంతర్జాతీయ ఒడంబడిక అది. 1970లో అమలులోకి వచ్చిన ఆ ఒప్పందాన్ని 191 దేశాలు అంగీకరించి ధ్రువీకరించాయి. ఇరాన్‌తో సహా భాగస్వామ్య దేశాలు అన్నీ ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండేలా చేసేందుకు వియన్నాలోని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)కు అధికారాలు కల్పించారు. అణ్వస్త్ర రాజ్యాలుగా గుర్తింపు పొందిన దేశాలు ఐదు ఉన్నాయి: అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా. ఈ ఐదు దేశాలూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీటో అధికారమున్న శాశ్వత సభ్య దేశాలు. తమకు అణ్వస్త్ర సామర్థ్యమున్నదని భారత్‌, పాకిస్థాన్‌లు ప్రకటించాయి. ఎన్‌పీటీపై సంతకం చేయలేదు. ఎన్‌పీటీపై సంతకం చేసిన ఇరాన్‌ అణ్వస్త్రాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని, అణ్వాయుధ ఇరాన్‌ తన మనుగడకే ప్రమాదకరమని ఇజ్రాయెల్‌ అభ్యంతరం తెలిపింది. ఈ దేశం ఎన్‌పీటీపై సంతకం చేయలేదు. అంతేకాదు, ఇజ్రాయెల్‌ రహస్యంగా అణ్వస్త్రాలను అభివృద్ధిపరుచుకోవడానికి పూనుకున్నదని చాలా దేశాలు అంగీకరిస్తున్నాయి. అంతర్జాతీయ నియమాలకు కట్టుబడి ఉన్న ఒక దేశంపై ఆ నియమాలకు లోబడి వ్యవహరించని మరొక దేశం దాడి చేసింది. ఈ పరిస్థితి ప్రపంచ వ్యవస్థ సవ్యంగా పనిచేసేందుకు దోహదం చేస్తుందా?


ఇరాన్‌ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పెంచుకుంటుందని మే 2025లో ఐఏఈఏ నివేదిక ఒకటి వెల్లడించింది. అయితే ఇరాన్‌ ఆయుధాగారంలో అణ్వాయుధాలు ఉన్నాయనేందుకు ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ భద్రతా మండలి దృష్టికి తీసుకువెళ్లి ఉండవల్సింది. అయితే అలా చేయకుండా ఇరాన్‌పై బాంబుదాడులకు పాల్పడింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడులు జరిపింది. దీనివల్ల ఆ కేంద్రాల నుంచి అణు ధార్మికత వెలువడి మహావిపత్తు సంభవించేందుకు అస్కారం కలిగించేలా ఇజ్రాయెల్‌ వ్యవహరించింది. ఇదెలా న్యాయబద్ధం? ఇజ్రాయెల్‌ చర్య వల్ల ఐఏఈఏ విశ్వసనీయత దెబ్బతినలేదా? ఎన్‌పీటీపై సంతకాలు చేసిన దేశాలన్నీ ఆ నియమాలకు కట్టుబడి ఉండేలా చేసే బాధ్యతలను ఆ సంస్థ ఎలా నిర్వర్తించగలుగుతుంది? మరో దేశంపై బాంబుదాడులు జరిపేందుకు ఒక దేశం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని నిరాటంకంగా అమలుపరిస్తే మిగతా దేశాలు అంతర్జాతీయ ఒప్పందాల మర్యాదలను ఎందుకు పాటించాలి? ఈ మొత్తం వ్యవహారంలో ఐక్యరాజ్యసమితి, దాని ప్రధాన కార్యదర్శి పాత్ర ప్రకటనలు జారీ చేసేందుకే పరిమితమైపోయింది. సంయమనంతో వ్యవహరించాలన్న సలహాను ఎవరూ వినలేదు. ఐఏఈఏ, ఇతర అంతర్జాతీయ సంస్థలు తమ కర్తవ్యాలను ఎందుకు నిర్వర్తించలేదు? శక్తిమంతమైన దేశాల దౌర్జన్యశీల తీరుతెన్నులను ఎందుకు నియంత్రించలేదు? పరస్పరాధారిత ప్రపంచ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ఇదెలా తోడ్పడుతుంది?


అంతేకాదు, ఈ విపత్కర పరిస్థితిలో మరింత ఎక్కువ ప్రమాదమున్నది. వాతావరణ మార్పు ఒక యథార్థమని మనకు తెలుసు. ఆ వైపరీత్యంతో వాటిల్లుతున్న ముప్పు చాలా తీవ్రమైనది. దానిని ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవలసిన అవసరమున్నది. అయితే అది సులభంగా పరిష్కారం కాని సమస్య. వాతావరణ మార్పుతో ధ్వంసమవుతోన్న పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు సకల సమాజాలూ ఏకాభిప్రాయంతో పరస్పర విశ్వాసంతో సమష్టిచర్యలు చేపట్టాలి. ఏ ఒక్క దేశమూ కలిసిరాకపోయినా సమస్య సశేషంగానే ఉండిపోతుంది. మరి ఉమ్మడిగా నిర్దేశించుకున్న నియమ నిబంధనలు ఆధారంగా పని చేసే ప్రపంచ వ్యవస్థ అస్తవ్యస్తమవుతూ అంతర్జాతీయ సంస్థల ప్రతిష్ఠ దిగజారిపోతున్న పరిస్థితుల్లో వాతావరణ మార్పు లాంటి మహా సంక్షోభానికి పరిష్కారాన్ని కనుగొనడం ఎలా సాధ్యం? బలవంతుడి న్యాయమే రాజ్యం చేస్తోంది కదా. పురుషహంకార, యుద్ధ నిమగ్న కల్లోల ప్రపంచం మనిషికి శాంతినిస్తుందా? ధరిత్రిని ధ్వంస రచన నుంచి కాపాడుతుందా?

-(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌

’ డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - Jul 04 , 2025 | 01:02 AM