Share News

Sunita Narain: వార్షిక వాతావరణ ప్రహసనాలు

ABN , Publish Date - Nov 14 , 2025 | 04:20 AM

శీతవేళ ఆగమిస్తోంది. ఏటా ఈ తరుణంలో ప్రభుత్వాల ప్రతినిధులు, పౌర సమాజ క్రియాశీలురు, పర్యావరణ వైజ్ఞానికులు, పారిశ్రామిక, వ్యాపార సంస్థల సీఈఓలు వాతావరణ మార్పుపై చర్చలకు సమావేశమవుతారు.

Sunita Narain: వార్షిక వాతావరణ ప్రహసనాలు

శీతవేళ ఆగమిస్తోంది. ఏటా ఈ తరుణంలో ప్రభుత్వాల ప్రతినిధులు, పౌర సమాజ క్రియాశీలురు, పర్యావరణ వైజ్ఞానికులు, పారిశ్రామిక, వ్యాపార సంస్థల సీఈఓలు వాతావరణ మార్పుపై చర్చలకు సమావేశమవుతారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశం ఈ ఏడాది బెలెమ్‌ (అమెజాన్‌ వర్షారణ్యం అంచున ఉన్న బ్రెజీలియన్‌ నగరం)లో జరుగుతోంది. సరిగ్గా ఇదే రోజులలో ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో గాలి ధూళి దూసరమయిపోతుంది. ఊపిరి పీల్చుకోవడం ఢిల్లీ వాసులకు మహాకష్టంగా ఉంటుంది. ఈ ఏడాది వాతావరణ మార్పు సంబంధిత మార్పులు ఎప్పటిలానే మహా ఆందోళనకరంగా ఉన్నాయి. మనిషిపై ప్రకృతి పగ సాధిస్తున్నట్టుగా వాతావరణ పోకడలు ఉంటున్నాయి. హరిత గృహ వాయు ఉద్గారాలు ఘోరంగా పెరిగిపోతున్నాయి. వచ్చే దశకం (2030లు) తొలి సంవత్సరాలలోనే భూతాపం పెరుగుదల పరిమితి 1.5 డిగ్రీల సెల్సియస్‌ను ప్రపంచం ఖాయంగా ఉల్లంఘించనున్నదని రోజురోజుకీ మరింతగా విదితమవుతోంది. ఇది వినాశనకరమైన పరిణామం, సందేహం లేదు. భూ ఉష్ణోగ్రతలు 1.2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితేనే ఈ విశాల అవని ఎల్లెడలా భయంకరమైన ప్రాకృతిక విపత్తులకు లోనవుతుంది కదా. వాతావరణ మార్పు వైపరీత్యాల తాకిడి మన దైనందిన జీవితాలపై ఎంత తీవ్రంగా ఉంటుందో మరి చెప్పనవసరం లేదు. వాతావరణ మార్పును నివారించే, లేదూ నియంత్రించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తోన్న వార్షిక శిఖరాగ్ర సదస్సులు ముంచుకొస్తోన్న వాతావరణ ముప్పునకు ప్రభుత్వాలను జవాబుదారీగా చేయడంలో విఫలమవుతున్నాయి. చర్చలు నిరర్ధకమవుతున్నాయి. శీత రుతువు రాకడతో ఉత్తర భారతావనిలో గాలివేగం తగ్గుతుంది. చల్లని గాలులు దట్టంగా వీస్తూ భూమిని అదే పనిగా స్పృశిస్తుంటాయి. కాలుష్యం మన కళ్ల ఎదుట కరాళ నృత్యం చేస్తుంది. మన నయనేంద్రియాలు ఎర్రబారుతాయి.


మన ఊపిరితిత్తులు ఊపిరి పీల్చుకోలేకపోతాయి. కొద్ది నెలల పాటు కాలుష్యం, కాలుష్య కారక ఘటనలు మీడియా పతాక శీర్షికలవుతాయి. ప్రజలకు దాపురించిన వాతావరణ వెతలకు రాజకీయవేత్తలు పరస్పరం నిందించుకుంటారు. సమస్య నిమ్మళిస్తుందా? లేదు. శాసన నిర్మాతలు శ్రద్ధ చూపుతారా? లేనే లేదు. అయినా రాజకీయ పక్షాలు వాతావరణ వైపరీత్యాలపై వాదోపవాదాలు చేస్తుంటాయి. తమ శ్రేయస్సుకు మేలు చేయని ఈ వ్యర్థ ప్రలాపాలను సగటు పౌరులు జుగుప్సా భావంతో వింటూంటారు. శీతాకాలంతో పాటు కాలుష్యమూ వీడిపోతుందా? పోదు. అది మరింతగా తీవ్రమవుతుంది. ఏటేటా ఇదే కథ. ఈ ఏడాది ఈ పాత కథకు ముగింపు పలకాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఎలా? కృత్రిమ వర్షాలు కురిపించడం ద్వారా! అందరూ అబ్బురపడుతూ ఆకాశం వర్షించబోయే అమృత ధారల కోసం ఆశావహ దృక్కులతో ఎదురుచూశారు. అయితే ఢిల్లీ సర్కార్‌కు దైవశక్తులు లేవని అంతిమంగా ప్రతి ఒక్కరికీ విదితమయింది. అయితేనేం, ఆ అట్టహాస వైఫల్యం, ఢిల్లీ సర్కార్‌ ప్రజల బాధలను ఉపేక్షించలేదని చెప్పేందుకు పనికివచ్చింది మరి. బెలెమ్‌లో ఐక్యరాజ్యసమితి వార్షిక వాతావరణ సదస్సూ, ఢిల్లీలో వార్షిక వాయు కాలుష్య బెడదను నివారించేందుకు ‘కృత్రిమ వర్ష’ ప్రయోగం రెండూ సమస్యను పరిష్కరించేందుకు సరిపోని, నిబద్ధత లేని చర్యలను ప్రదర్శించేందుకు మాత్రమే తోడ్పడుతున్నాయి. ఈ ప్రహసనప్రాయ కార్యాచరణల గురించే నేను నిజంగా ఆందోళన చెందుతున్నాను. ఐక్యరాజ్యసమితి ఏటా నిర్వహిస్తున్న కాప్‌ (కాన్ఫరెన్స్‌ ఆప్‌ పార్టీస్‌) శిఖరాగ్ర సదస్సులో దేశ దేశాల ప్రతినిధులు, నిపుణులు వాతావరణ మార్పును నిరోధించే చర్యల పురోగతి ఏ స్థాయిలో ఉన్నదీ సమీక్షించి, తీసుకోవల్సిన తదుపరి చర్యల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.


సరే, స్థిరమైన అభివృద్ధికి దోహదపడే విధంగా వాతావరణ మార్పులకు అనుగుణంగా అన్ని దేశాల సామర్థ్యాన్ని పెంచడమనేది ప్రస్తుతం బెలెమ్‌లో జరుగుతున్న కాప్‌ 30 అజెండా ప్రధాన లక్ష్యంగా ఉన్నది. వాతావరణ మార్పుల నెదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందుతున్న ఆర్థిక సహాయం రుణాలు, ఈక్విటీల రూపేణా ఉంటోంది. అయితే ఇవి పేద దేశాల రుణ భారాన్ని మరింతగా పెంచడమే కాని అసలు లక్ష్య సాధనకు తోడ్పడడం లేదు. ఈ ఏడాది వాతావరణ మార్పు వైపరీత్యాలకు నష్టపోయిన అనేక దేశాలు అందుకున్న అంతర్జాతీయ ఆర్థిక సహాయం కంటే తమ రుణాలపై చెల్లించిన వడ్డీల మొత్తమూ అధికంగా ఉన్నది. అసలే వాతావరణ విపత్తులకు కుదేలయిపోయిన ఈ దేశాలు అభివృద్ధి సాధనకు అవసరమైన ఆర్థిక వనరులు కొరవడి అన్ని విధాల కృశించి పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో హరిత గృహ వాయు ఉద్గారాల తగ్గింపునకు తోడ్పడే వాతావరణ చర్య (క్లైమేట్‌ యాక్షన్‌)కు అవి సమర్థంగా ఎలా పూనుకోగలుగుతాయి? చెప్పవచ్చినదేమిటంటే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో చిత్తశుద్ధి కొరవడి, ప్రయోజనరహితంగా సాగుతున్న వార్షిక వాతావరణ సదస్సులకు స్వస్తి చెప్పాలి. ఢిల్లీలో ఏడాది పొడుగునా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఒక కార్యాచరణ పథకం ఉన్నది. అయితే దాన్ని అమలుపరచడం లేదు. మాటలే కాని, చేతలు లేనప్పుడు జరిగే మేలు ఏమిటి? ప్రభుత్వాల క్రియారాహిత్యాన్ని కప్పిపుచ్చేందుకు మాత్రమే చర్చలు, సమావేశాలు తోడ్పడుతున్నాయి. నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు దోహదం చేసే కార్యాచరణలకే తొలి, మలి, తుది, నిరంతర ప్రాధాన్యమివ్వాలి. అవును, మనం సదా లక్ష్య సాధక కార్యచరణలో ఉండాలి. అది మాత్రమే ముఖ్యం. అంతేగాని చేతలకు దిగకుండా మాటలకు పరిమితమైతే సమస్య నుంచి ఎలా బయటపడగలుగుతాము? అసలు సమస్య నుంచి బయటపడేందుకు మాట్లాడే అర్హతను సైతం కోల్పోతాము సుమా!

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - Nov 14 , 2025 | 04:25 AM