Chodagiri Chandrarao: అంబేడ్కరిస్టు సాహిత్యానికి దారిదీపం
ABN , Publish Date - Jul 20 , 2025 | 12:47 AM
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రతిపాదించిన సాంఘీక ప్రజాస్వామ్యం, ఆర్థిక సమానత్వం..
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రతిపాదించిన సాంఘీక ప్రజాస్వామ్యం, ఆర్థిక సమానత్వం, అణగారిన వర్గాలకు రాజ్యాధికారం, ప్రత్యామ్నాయ సంస్కృతి, రాజ్యాంగ నైతికత తదితర అంశాల గురించి నేడు విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అంబేడ్కర్ ఆలోచనా విధానం, జై భీమ్ నినాదం వర్తమాన కాలానికి నూతన కర్తవ్యాన్ని ప్రబోధిస్తున్నాయి. ఆధునిక తెలుగు కవిత్వంలో ఈ విధమైన దృష్టికి మార్గదర్శకంగా నిలిచిన కవి చోడగిరి చంద్రరావు. ఆరున్నర దశాబ్దాల క్రితమే అంబేడ్కర్ బహుముఖీన ఔన్నత్యాన్ని, మూర్తిమత్వాన్ని స్ఫూర్తిదాయకంగా కవిత్వంలో చాటి చెప్పిన కవి చంద్రరావు. డెబ్బయ్యో దశకంలో అరుణారుణ సృజన ప్రభంజనానికి ఎదురొడ్డినిలిచి, తన అస్తిత్వ చైతన్యంతో ‘భీమైక’ ఎరుకతో ప్రభావశీలమైన పద్య కవిత్వం రాసిన చంద్రరావు గురించి సాహిత్యంలో పెద్దగా చర్చ జరగలేదు.
‘మధురకవి’ చోడగిరి చంద్రరావు గోదావరి తీరంలో కోరుమిల్లి గ్రామంలో నిరుపేద మాల కుటుంబంలో 1932, జూలై 15న జన్మించాడు. రామచంద్రపురం జాతీయ ఉన్నత పాఠశాల, కాకినాడ పి.ఆర్. కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి, మైసూర్ శాండిల్ కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేసి, ఆ తరువాత రైల్వే శాఖలో సూపర్ వైజర్‌గా పదవీ విరమణ చేశాడు. హృదయవీణ (1968), భీమశతకం(1972), చంద్రరావు గీతాలు (1974), చంద్రరావు కవిత (1977), అన్వేషణ (1981), భీమ శతకం రెండవభాగం (1989) వంటి కృతులు వెలువరించాడు. శతకం, ఖండకావ్యం, వచన కవిత, పాట తదితర సాహిత్య ప్రక్రియల్లో విలువైన రచనలు చేసిన చంద్రరావు, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, జ్ఞానానంద కవి, సి. నారాయణరెడ్డి వంటి కవుల మన్ననలు పొందాడు. తన గురువు, సుప్రసిద్ధ పద్యకవి వేదుల సత్యనారాయణశాస్త్రి ప్రోత్సాహంతో విద్యార్థిగా ఉన్నప్పుడే చంద్రరావు కవిత్వరచన ప్రారంభించాడు. ‘వేకువ’ (1950) పద్యసంపుటిని వేదులకు అంకితమిచ్చాడు. వేదుల సత్యనారాయణశాస్త్రి చంద్రరావును గుండెలకు హత్తుకొని ఆదరించాడు. ‘అంటరానివాడిని ఎందుకు ఇంటికి తీసుకొస్తావు’ అని బంధువులు మందలించినా లెక్కచేయకుండా తుదిశ్వాస విడిచేవరకు చంద్రరావును ప్రాణప్రదంగా ప్రేమించాడు. వేమన, వేదుల సత్యనారాయణశాస్త్రి, జాషువ, బోయి భీమన్నలను చంద్రరావు తన సాహిత్య గురువులుగా భావించాడు. ఈ నలుగురు కవనమూర్తుల ఉమ్మడి ప్రభావం వీరి కవిత్వంలో కనిపిస్తుంది.
కవిత్వంపట్ల, కవిత్వప్రయోజనం పట్ల చంద్రరావు స్పష్టమైన అభిప్రాయాలను ప్రకటించాడు. పీడితుల దుఃఖ విముక్తికి దోహదపడేదే ఉత్తమ కవిత్వమని సూత్రీకరించాడు. ప్రారంభ దశలో ఈ కవి ‘నన్ను కన్నభూమి, నా అన్నదమ్ములన్/ చిత్రహింస జేసి చితుల ద్రోయ/ ప్రేమ కవిత నేను ఏ మొగమ్మున వ్రాతు?’ అని ఆత్మవిమర్శ చేసుకొని తన జాతిజనుల బతుకువెతలను ఆర్ద్రంగా కవిత్వీకరించాడు. ఆకలి తెలిసిన, లోకం తెలిసిన సామాన్యుడే సర్వజ్ఞుడు అని నిర్ధారించాడు. సామాన్యుడు సుఖపడితే అది స్వర్గమని, దుఃఖపడితే అది నరకమని సగటు మనిషి కేంద్రంగా స్వర్గనరకాలను పునర్నిర్వచించాడు. కవితా రచన చేయడానికి స్పష్టమైన తాత్త్విక మార్గం అవసరం. 1944లో ఆంధ్రా పర్యటనలో భాగంగా అంబేడ్కర్ కాకినాడ వచ్చినపుడు చంద్రరావు ఆయనను చూసి భావోద్వేగబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రముఖ అంబేడ్కరిస్టు, బౌద్ధ ఉపాసకులు శ్రీరాములు, మారెళ్ల కేశవరావులతో కలిసి కాకినాడలో చంద్రరావు అంబేడ్కర్ జయంతి సభలు, సాహిత్య సభలు నిర్వహించేవాడు. కుసుమ ధర్మన్న, రావూరి ఏకాంబరం ప్రేరణతో అంబేడ్కర్ భావాలను, ఆశయాలను అందిపుచ్చుకున్నాడు. అంబేడ్కర్ గురించి తెలుగులో తొలి స్మృతిగీతం (1956) రాసింది కూడా చంద్రరావే. ‘నీ జీవితమును ఆదర్శముగ నిడుకొని బ్రతికెదమయ్య/ నీ ఆశయములు నెరవేరగ నిరతము పోరెదమయ్య/ నీ నవయానమును మేలగు పథముగ నెంచి/ నీవు నడిచిన పథమును విడువగా లేము’ అంటూ అంబేడ్కర్‌కు అక్షర జోహారులు ప్రకటించాడు. హార్మోనియం వాయిస్తూ చంద్రరావు స్వయంగా స్వరపరిచిన ఈ పాట పాడుతుంటే గోదావరి జిల్లాల్లో ప్రజలు కన్నీటి పర్యంతమయ్యేవారు. దేశంలో మార్క్సిస్టు సాహిత్యం వెల్లువెత్తుతున్న దశలో 1960ల ప్రాంతంలో మరాఠీలో కూడా ‘భీమ్ సాహిత్యం’ అనే పేరు లేనప్పుడు ఎంతో దార్శనిక దృష్టితో చంద్రరావు కాకినాడలో ‘భీమ్ సాహితీ స్రవంతి’ అనే సంస్థను స్థాపించి అంబేడ్కర్ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు. ‘భీమ కవిని’ నేను అని సగర్వంగా చెప్పుకున్నాడు. ‘ఏమి సెప్పనయ్య! భీమ రాయ!’ అనే మకుటంతో రెండు భాగాలుగా భీమశతకం రచించాడు. చంద్రరావు రచనల్లో భీమ శతకం అత్యంత విశిష్టమైనది. ఈ శతకం ఆధునిక సాహిత్యంలో అంబేడ్కర్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగులో అంబేడ్కరిస్టు సాహిత్యానికి చంద్ర రావు దారిదీపంలా కనబడతాడు. ‘కవిత నీవు, నాకు కావ్య వస్తువు నీవు/ కంఠ మందు నీవు, కనుల నీవు/ నీవు లేని నేను నిర్జీవ ప్రతిమనే/ ఏమి సెప్పనయ్య భీమరాయ’ అంటూ చంద్రరావు అసామాన్యమైన అంబేడ్కర్ స్ఫూర్తిని ఆవాహన చేసుకొని, ఆయన రాజకీయ, సామాజిక లక్ష్యాలను సుబోధకంగా పద్యీకరించాడు. మనువాదాన్ని, సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలను చంద్రరావు తన కవిత్వం ద్వారా ఖండించాడు. ‘అంటరానితనము అంతరించని యెడ/ భరత జాతిచరిత భ్రష్టమగును’ అని కులనిర్మూలనాతత్త్వాన్ని ప్రబోధించాడు. ‘భీమకవి’గా కోనసీమ ప్రజల నీరజనాలందుకున్న ఈ కవి 1997 అక్టోబర్ 8న మరణించాడు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గురించి విశ్వవ్యాప్తంగా సమాలోచనలు జరుగుతున్న సందర్భంలో భీమ దృక్పథాన్ని సమర్థవంతంగా చాటిచెప్పిన చోడగిరి చంద్రరావు కవిత్వంపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరాగాలి. సమున్నత మానవీయ విలువలకు, రాజ్యాంగ నైతికతకు ఆలవాలమైన వీరి కవితలను పాఠ్యాంశాలుగా ఎంపిక చేయాలి.
-డాక్టర్ కోయి కోటేశ్వరరావు
(నేడు కాకినాడలో చోడగిరి చంద్రరావు సమగ్ర కవిత్వం ఆవిష్కరణ)