China Airport Harassment: స్నేహానికి హద్దులు
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:50 AM
చైనాతో మరీ చెడిపోలేదని అనుకోగానే ఏదో ఒక చిచ్చుపెట్టడం ఆ దేశానికి అలవాటు. సంబంధాలు మళ్ళీ అతుకుపడుతున్నాయని అనిపించిన వెంటనే మంటలు రేగుతాయి...
చైనాతో మరీ చెడిపోలేదని అనుకోగానే ఏదో ఒక చిచ్చుపెట్టడం ఆ దేశానికి అలవాటు. సంబంధాలు మళ్ళీ అతుకుపడుతున్నాయని అనిపించిన వెంటనే మంటలు రేగుతాయి. షాంఘై విమానాశ్రయంలో భారతమహిళకు ఎదురైన వేధింపులు, అవమానాలు అత్యంత హేయమైనవి. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన పేమా వాంగ్‌జోమ్ థాంగ్‌డోక్ లండన్‌నుంచి జపాన్ వెడుతూ మార్గమధ్యంలో షాంఘైలో ఆగారు తప్ప, భారత్ పాస్‌పోర్టుతో చైనాలో కాలూనేందుకు ఏమీ పోలేదు. గతంలో కూడా ఆమె షాంఘై ట్రాన్సిట్ ప్రయాణాలు చేశారు. ఇప్పటివరకూ ఎవరూ ఈ తరహా ప్రయాణాలు చేయలేదని అధికారులు కూడా అనలేరు. కొందరు అతిగా వ్యవహరించి, ఉద్దేశపూర్వకంగా ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించిన విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మరో మూడుగంటల్లో జపాన్ విమానం ఎక్కి వెళ్ళిపోవాల్సిన ఆమెను నిర్బంధించి, అరుణాచల్ భారత్‌లో లేదు, మీ వీసా పనికిరాదు, పాస్‌పోర్టు చెల్లదు అంటూ చైనీస్ పాస్‌పోర్టుకోసం దరఖాస్తుచేసుకోమని కూడా ఎగతాళిగా మాట్లాడటం, మిగతా వారంతా నవ్వడం వంటివి అత్యంత అవమానకరమైన ఘట్టాలు. అనేకగంటలపాటు ఏమీ తేల్చకుండా, అన్నపానీయాలు లేకుండా తనను వేధించారని, చివరకు బీజింగ్‌లోని భారత రాయబారకార్యాలయం సహాయంతో బయటపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. చైనా విదేశాంగమంత్రిత్వశాఖ ప్రతినిధి ఇందుకు పూర్తిభిన్నమైన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చట్టాలు, పౌరవిమానయాన సంప్రదాయాలను ఉల్లంఘించిన ఘటన కనుక, జరిగింది పొరపాటని ఓ మాట అనివుంటే ఈ వివాదం వెంటనే సమసిపోయివుండేది. కానీ, అరుణాచల్ విషయంలో తమవాదన బలహీనపడుతుందన్న భయంతో తమ అధికారుల చర్యలను ఆమె సమర్థించుకురావడం మరింత చిరాకు కలిగిస్తోంది. బలవంతపు చర్యలు తీసుకోలేదు, నిర్బంధాలు, వేధింపులు లేనే లేవు అంటూనే, చైనా తన అరుణాచల్ వాదనను సమర్థించుకొనే పనిలో పడింది. రెండు దేశాల మధ్యా ప్రశాంతత, పరస్పర విశ్వాసం సమీపకాలంలో నెలకొనడం అసాధ్యమని ఈ ఘటన గుర్తుచేస్తోంది.
అరుణాచల్ తమభూభాగమని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. దక్షిణటిబెట్, జంగ్నాన్ అంటూ మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, గ్రామాలు, చివరకు కొండలకు కూడా తన మాండరిన్‌లో పేర్లు పెట్టుకుంటోంది. రెండుదేశాల మధ్యా ఉన్న మూడున్నరవేల కిలోమీటర్ల సరిహద్దులో అనేక ప్రాంతాలను వివాదంలోకి లాగి, ఉద్రిక్తతలను రేపడం చైనా ఒక విధానంగా పెట్టుకుంది. దాదాపు వందేళ్ళుగా సాగుతున్న వివాదాలను ఉభయదేశాలు పరిష్కరించుకోలేకపోవడం అటుంచి, సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతలను కాపాడుకొనేందుకు ఉద్దేశించిన 1993నాటి ఒప్పందాన్ని కూడా చైనా ఉల్లంఘించడం ఆరంభించింది. అమెరికాతో మన స్నేహం హెచ్చుగా ఉన్నప్పుడూ, ట్రంప్–మోదీ చేయీచేయీ కలిపి కదులుతున్నప్పుడూ చైనా చిచ్చుపెడుతుంది. ఇటీవల ట్రంప్ మోదీ మీద అలిగి, భారత్‌మీద సుంకాల భారం వేసినప్పుడు చైనా ఎక్కడలేని ఆప్యాయతనూ కనబరిచిన విషయం తెలిసిందే. పలురకాల దిగుమతులకు అనుమతించడమే కాక, మార్కెట్‌ను కూడా తెరిచింది. ఏడేళ్ళ తరువాత, ఈ ఏడాది సెప్టెంబర్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సివో) సమావేశానికి మోదీ వెళ్ళడంతో ఉభయదేశాల సంబంధాలు మెరుగుపడుతున్న ఆశ కలిగింది. రెండుదేశాల మధ్యా విమానాల రాకపోకలు నేరుగా మొదలవడంతో, వాణిజ్య వ్యాపారాలతో పాటు పర్యాటకమూ, ప్రజల మధ్య బంధాలూ బలపడతాయన్న భరోసా కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో, ఒక చిన్న ఉదంతం ఉభయదేశాల సంబంధాలను ప్రభావితం చేయడం సరికాదు. జరిగినఘటనతో పాటు, దానిమీద ఇచ్చిన వివరణలూ సమర్థనలూ మరింత దూరం పెంచేట్టుగా ఉండటం విచారకరం. పరిష్కరించుకోనంత వరకూ సరిహద్దువివాదాలు అలాగే ఉంటాయి. వాటిని పక్కనబెట్టి మిగతా విషయాల్లో కలిసిసాగుదామని ఓ పక్కన అంటూనే, ఇలా అమాయకపౌరుల మీద కక్షసాధించడం సరికాదు. తియాంజెన్ సమావేశంలో మోదీ, జిన్‌పింగ్ కలిసికట్టుగా అద్భుతమైన సంకల్పాలు చెప్పుకున్నారు. సరిహద్దు సమస్య మనబంధానికి అడ్డురావద్దనీ, ప్రత్యర్థుల్లా కాక, భాగస్వాములుగా వాణిజ్యం పెంచుకొని బాగుపడదామనీ అనుకున్నారు. డ్రాగన్, ఏనుగు కలిసి డాన్స్ చేయాలన్నారు జిన్‌పింగ్. సమస్యలను సహేతుకంగా పరిష్కరించుకుంటూ, సరిహద్దుల్లేని స్నేహంతో సాగిపోదామని అంటూనే ఉన్నతంగా వ్యవహరించకపోవడం, చిన్నచిన్న ఉదంతాలను సైతం ఉద్రిక్తతలుగా మార్చడం బాగోలేదు.