Share News

Chilukuri Rama Umamaheswara Sharma: నన్ను నిలదీస్తున్న కొన్ని అలలే ఈ కథలు

ABN , Publish Date - May 12 , 2025 | 04:11 AM

చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ తొలి కథా సంపుటి ‘A’ లో లైంగిక స్వేచ్ఛ, నైతిక విలువలు, అణచివేయబడిన జీవితాల అనుభవాల్ని గాఢంగా ప్రతిబింబించాయి. రచయిత అనుభవంతో కూడిన లోతైన పరిశీలన, భాషా శైలితో కథల ద్వారా సమాజాన్ని ఆవిష్కరించారు.

Chilukuri Rama Umamaheswara Sharma: నన్ను నిలదీస్తున్న కొన్ని అలలే ఈ కథలు

చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ కథా సంపుటి ‘A’ లోని కథల్లో అణచివేయబడిన జీవితాలు, వాటి గుండె చప్పుడు వినిపిస్తుంది. రచయిత భాషా ప్రయోగం పాఠకుడి మేధకు పదును పెడుతునే శిల్ప శైలీ సౌందర్యానికి అబ్బురపడేలా చేస్తుంది. ఈ కాలపు మనిషి లైంగిక నైతికత, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి సంక్లిష్ట అంశాలపై ఈ తొలి కథాసంపుటిలోనే లోతైన దృక్పథంతో ధైర్యంగా చర్చించారు రచయిత. ఈ కథలన్నీ కలిపి చెప్పాలనుకునే ‘‘అసలు మాట’’ ఏమిటి అన్నదే ఈ మా సంభాషణ వెనుక ఉన్న ఉత్సుకత.


మీ గురించి క్లుప్తంగా చెప్పండి?

పుట్టుక భద్రాచలం రాములవారి సత్రంలో. కలివేరులో అడవి పక్కనే మా ఇల్లు. కోయ, సుంకర పిల్లలతోనే ఆట పాటలు. వాళ్ళదే భాష. ఆ ఏజెన్సీలో కూడా ఉత్తమ ఉపాధ్యాయుల విద్యే నాకు భిక్ష. ‘ఇదిలా చెయ్యి,’ అని ఎప్పుడు చెప్పని నాన్న, కథలతో నిద్రపుచ్చుతూ అమ్మ. ఇరవై ఏళ్ల వరకు సంవత్సరానికి పది నెలలు దండకారణ్యంలో, ఓ రెండు నెలలు కోనసీమ అగ్రహారాల్లో. మూడున్నర దశాబ్దాల పోలీసు ఉద్యోగం. ‘నేనూ, శాంత కూడా’ అనే ఆత్మకథని 2021 లో వెలువరించాను. రిటైరయ్యాక నన్ను అడపాదడపా నిలదీస్తున్న కొన్ని అలలే ఈ కథలు.


ఒక విశ్రాంత పోలిస్ ఉన్నతాధికారిగా మీ అనుభవాలు మీ పరిశీలనాశక్తికీ, ఊహాశక్తికీ అందించిన వాస్తవాలకు కల్పనాత్మక చిత్రణే మీ ఈ తొలి కథా సంపుటి లోని కథలు అనిపిస్తుంది. మీరేమంటారు?

పోలీసులు మనుషులే. సమాజాన్ని అతి దగ్గరగా చూడగలిగే అదృష్టమో మరొకటో వారిది. ఉద్యోగంలో వ్యక్తుల్ని, ఒక ట్రాన్స్‌జెండర్‌ని కానీ, ఒక సెక్స్ వర్కర్‌ని కానీ, ఓ చిరుద్యోగిని కానీ చట్టం కళ్ళతోనే చూడాల్సి వస్తుంది. చూస్తాము. ఇప్పుడు మనమంతా, వాళ్ళతో సహా, ఏదో ఓ గుప్పెట్లో కలసి పాకే చలిచీమలం. అంటే, ఒకప్పటి సానుభూతి ఇప్పటి సహానుభూతి. సంఘర్షణ ఎప్పుడూ ఉన్నదే. అప్పటి స్పందనకి ఏదో ఓ హద్దుండేది. ఇప్పుడది ఓ కథ. ఉదాహరణకి ట్రాన్స్‌జెండర్స్‌ని అప్పుడు చూసాం ఇప్పుడూ చూస్తున్నాం. ఓ రోజు ఓ రైల్వే క్రాసింగ్ దగ్గర కారు అద్దం దింపి చూసినప్పుడు పుట్టిందే ‘తాలీ’ కథ.


మీ కథల్లో ప్రేమ, వివాహం, శారీరక సంబంధాలు, సామాజిక నైతిక విలువలు వంటి సున్నితమైన అంశాలను చర్చించేటప్పుడు రచయితగా మీలో నైతిక సంకోచాలు ఏమైనా తలెత్తాయా?

నమంతా ఎంతో కొంత లగేజీ‌ని మోసుకుని తిరుగుతూనే వుంటాం, ఔనన్నా కాదన్నా! దాన్ని వీలున్నంత దింపుకునే క్రమంలో పెల్లుబికిన కథలివి. మనం చాలా వరకు నిజాలనుకుంటున్న వాటి గురించి రాసుకుంటున్నప్పుడు సంకోచమన్న ప్రశ్న ఉదయించదు కదా. అలాగే సంఘర్షణ– అంతర్గతమో, బాహ్యమో లేకుండా ఏ కథా, ఏ కళా రూపం బయల్పడదు. నైతికపరమైన విషయాల్లో మీరన్నట్లు చర్చను లేవనెత్తడమే నా ఉద్దేశం, ఏ పక్షానికో కొమ్ము కాయడం కాదు.


‘‘రంకు పదాన్నైతే నీ భాష నించి తీసేస్తావేమోగాని రంకుని తీసెయ్యగలవుట్రా! అది ఒక దప్పిక పొలికేక’’ అని మీ కథలో బామ్మ చేత అనిపించారు. ఇంతటి నిష్కర్షగా, లోతైన అర్థంతో కూడిన ఈ మాటలను ఒక సంప్రదాయ బ్రాహ్మణ వితంతువు పాత్ర ద్వారా చెప్పించారు. ఎందుకని?

ఆ కథలో అరుంధతమ్మ, వీరేశలింగం గారి మాటల్లో, ‘‘ఇంచుక విద్యాగంధం గల వితంతువు’’. కొంత బామ్మకి స్వానుభవం, మనమరాలి మీద మరింత సానుభూతి. ఇక ఆమెని ఆపగలిగేదెవరు? దాపరికానికి, పొలికేకకి మధ్య గీతని తాను చెరిపేసికొని, మనవరాలికి దారి చూపడంలో, ఆ మాటకొస్తే ఏ బామ్మైనా చేసేది అదే కదా. అప్పటి వితంతు పునర్వివాహాల్లో కొంతమంది బామ్మలు మనవరాళ్ల తరఫున గుంభనంగా పని చక్కపెట్టే విషయం తెలిసిందే. అందుకే మన అరుంధతమ్మ బామ్మలందరి స్పోక్స్‌పర్సన్.


‘బావరి’ అనే కథలో సంస్కృతంతో పాటు పాళీ భాషల మేళవింపు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోంది. ‘బావరి’ ద్వారా మీరు పాఠకులకు అందించాలనుకున్న అంతర్లీన సందేశం ఏదైనా వుందా?

‘పాళి’ భాషను బుద్ధవచనం అంటారు. బౌద్ధం తొలిరోజులలో అది థేరవాదుల భాష. తరవాతి కాలంలో మహాయాన బౌద్ధులు సంస్కృతాన్నీ ఎక్కువగా వాడేవారు. ‘బావరి’ కథలో తెలుగు ఇప్పటిది. ఎంతో కొంత చదివి రాస్తున్నప్పుడు పదాలు, ఏ భాషవైనా వాటికవే వచ్చిపడ్డాయి. తరువాత చూసుకొంటే ఆ మూడు భాషల కలగలుపు కథని కాలం, దేశం, సమూహాల హద్దుల్ని దాటించిందేమో అనిపించింది. ఏది విద్య, ఏది అవిద్య, మూలలెక్కడ, ఆవలి ఒడ్డుకి దారి చూపే సిసలైన వెలుగేది– ఈ ప్రశ్నలు అప్పుడూ ఇప్పుడూ ఉన్నవే. ఎప్పటికీ ఉండబోయయ్యేవే. తెలియని దాన్ని ఒప్పుకోవడం, కొంగొత్త వెలుగులని, ఏ వైపువైనా... ఆహ్వానించడం, పరిశీలించడం, అనుభూతించడం, ఆమోదించడం, పంచుకోవడం– ఇంతకంటే వేరే సందేశమేముంటుంది

ఇంటర్వ్యూ

-అట్లూరి అనిల్

81426 42638

Updated Date - May 12 , 2025 | 04:14 AM