Share News

Kanshi Ram: బహుజన హితమే కాన్షీరామ్ అభిమతం

ABN , Publish Date - Oct 09 , 2025 | 03:50 AM

కులాల కుంపట్లతో దేశ వ్యవస్థలు, రాజకీయాలు మలినమవుతున్న తరుణంలో బహుజనుల బతుకులు మార్చడానికి భారత రాజకీయ యవనికపైకి వచ్చిందో ధ్రువతార. ఆయనే మాన్యశ్రీ కాన్షీరామ్....

Kanshi Ram: బహుజన హితమే కాన్షీరామ్ అభిమతం

కులాల కుంపట్లతో దేశ వ్యవస్థలు, రాజకీయాలు మలినమవుతున్న తరుణంలో బహుజనుల బతుకులు మార్చడానికి భారత రాజకీయ యవనికపైకి వచ్చిందో ధ్రువతార. ఆయనే మాన్యశ్రీ కాన్షీరామ్. పూణేలోని ఓ లేబొరేటరీలో సైటింస్టుగా పనిచేస్తున్నప్పుడు అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు ఆయన జీవితాన్ని మలుపుతిప్పాయి. అప్పుడే తన జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అటువైపుగా పయనించాలని బలంగా సంకల్పించుకున్నారు కాన్షీరామ్‌. అంబేడ్కర్ రచించిన ‘కులనిర్మూలన పుస్తకం’ ఆయన్ను మరింతగా ప్రభావితం చేసింది. 1971లో ‘దళిత్ శోషిత్ సమాజ్ సంఘర్ష్ సమితి’ని ఏర్పాటు చేశారు. అనంతర కాలంలో అది ‘ఆలిండియా బ్యాక్‌వర్డ్స్, మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్’గా మారింది. ఈ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఉద్యోగులను సమీకరించి అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలపై పోరాటం సాగించారు. బుద్ధుడు, పూలే, పెరియార్, నారాయణగురు, అంబేడ్కర్‌లను తన గురువులుగా ప్రకటించుకున్నారు. దేశంలోని అగ్రకుల వ్యవస్థీకృత రాజకీయాలను ప్రక్షాళన చేయడం కోసం నడుం బిగించారు. ‘ఓట్లు మావి, సీట్లు మీవా?’ అని నినదించారు. 1984 ఏప్రిల్ 14 (అంబేడ్కర్‌ జయంతి)న బీఎస్పీని స్థాపించారు. బహుజనులను కూడగట్టి వారిలో రాజ్యాధికార కాంక్షను రగిలించారు. బీఎస్పీని దేశంలో అతిపెద్ద మూడవ జాతీయ పార్టీగా తీర్చిదిద్దారు. రాజకీయ దర్పానికి, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ తను నమ్మిన సిద్ధాంతం కోసం నిష్కళంకంగా, నిర్విరామంగా పనిచేసిన కాన్షీరామ్ ఈ దేశ బహుజనులకు ఆదర్శప్రాయుడు.

– ధీరన్ కొడారి (నేడు కాన్షీరామ్‌ వర్ధంతి)

Updated Date - Oct 09 , 2025 | 03:50 AM