Chalam Literature Analysis: పురుషాధిక్యతపై యుద్ధారావం
ABN , Publish Date - May 18 , 2025 | 12:42 AM
స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం కోసం చలం చేసిన రచనాత్మక ఉద్యమం సమకాలిక సమాజానికీ మార్గదర్శిగా నిలుస్తోంది. ఆయన ‘స్త్రీ’ రచన మనిషి విలువలపై తీవ్రమైన సందేశాన్ని సృష్టించింది.
స్త్రీ పురుష సమానత్వం కోసం చలం చేసిన అసాధారణ కృషి అవిస్మరణీయమైనది. సాహిత్యంలో పురుషాధిక్య ధోరణిని చీల్చిచెండాడిన భావ యోధుడు చలం. తెలుగు సమాజంలో ఛాందసత్వాన్ని కూకటివేళ్ళతో పెకలించడానికి పూనుకున్న సాంఘిక విప్లవకారుడు. నిత్యం సగటు మనిషిని పీల్చి పిప్పి చేస్తున్న అనేక దురాచారాలను నిష్కర్షగా నిలబెట్టి తన అక్షర జ్వాలలతో నిలువునా తగలబెట్టిన దార్శనికుడు చలం. ‘జీవితాన్ని జీవితంగా మొట్టమొదట తెలుగువాళ్ళకి చూపించిన తెలుగు కథకుడు చలం’ అని పురాణం సుబ్రహ్మణ్యశర్మ అన్నారు. ‘తెల్లారి లేస్తే పప్పు, పిడకలు, మళ్ళు, చీదరలు, అలుకులు, అధికారాలు, మూలుగులు, మురుకులు, ఇవన్నీ వొదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే మనోవ్యవధి, సంతోషం, ఉత్సాహం ఎప్పుడు కలుగుతుంది మానవులకు?’... ఇలా ఒక జీవితకాలం ప్రశ్నని వేయగల రచయిత నాటికి నేటికీ చలం ఒక్కడే. 1925లో చలం ‘Man and Woman‘ (Excluding The Aspect of Love)’ అనే విశిష్ట రచననొకదాన్ని చేశారు. దీన్నే ఆ తర్వాత ఆయన ‘స్త్రీ’గా విస్తరించి తెలుగు సమాజంలో ఒక విప్లవాత్మక భావ సంచలనం సృష్టించారు. చలం ‘స్త్రీ’ కేవలం స్త్రీలకి మాత్రమే పరిమితం చేసిన రచన కాదు.
సాంఘిక, ఆర్థిక, రాజకీయ, లైంగిక, ఆరోగ్య, సాంస్కృతిక అంశాల విశ్లేషణాత్మక శోధన. ఈ నాటికి చలం ‘స్త్రీ’లోని విషయాలు ఎంతో అపురూపమైనవిగా అనిపిస్తాయి. ఒక ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించాలి. 1925లో ప్రపంచ మేధావి బెర్ట్రాండ్ రస్సెల్ ‘వాట్ ఐ బిలీవ్?’ అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించాడు. స్త్రీ పురుష సంబంధాలు మొదలుకుని మనిషి నైతిక ప్రమాణాలు, సాంఘిక కార్యాచరణ మరెన్నో విషయాల్ని అందులో ఆయన చర్చించాడు. రస్సెల్ రచనకి విశేష ఆదరణ లభించింది. అదే ఏడాది చలం సూటిగా స్పష్టంగా రాసిన ‘స్త్రీ’ సంగతి మాత్రం కొద్దో గొప్పో చలం సాహిత్యంతో పరిచయం ఉన్న వారికి మినహా వేరేవరికి సరిగా తెలియను కూడా తెలియదు కదా. ‘స్త్రీ’ రచనకి మూలమైన, చలం ఏకైక ఆంగ్ల రచన ‘Man and Woman’ను ‘పురుషుడు–స్త్రీ’ గా 2014లో పిఠాపురానికి చెందిన ‘ప్రకృతి ప్రచురణలు’ తెలుగులోకి తీసుకువచ్చేంత వరకు అసలు అలాటి రచనొకదాన్ని చలం చేశారని చాలా మందికి తెలియదు. పాఠ్యాంశాల్లో భాగం కావాల్సిన చలం రచనలు ఇప్పటికీ చాలా మందికి నిషిద్ధాలుగా ఉన్నాయి. అటు సంప్రదాయవాదులు, ఇటు ఆధునికులు, ఒకవైపు పాలకులు, మరోవైపు మేధావులు కలిసికట్టుగా మౌనం పాటించినా, చలం సాహిత్యాన్ని సమాజం ఆదరిస్తూనే ఉన్నది. ఎందుకంటే, లోకంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు ఎన్నింటికో సమాధానాలు, పరిష్కారాలు చలమే చెప్పగలడు, చూపగలడు కాబట్టి. వంద సంవత్సరాల క్రితం వెలుగుచూసిన ‘స్త్రీ’ చలం సాహిత్య సారాన్ని విశదం చేసే విశిష్ట రచన.
మరి తెలుగు సమాజంలోని ప్రగతిశీల ఆలోచనాపరులు ఈ పుస్తకాన్ని ఒక చారిత్రక దార్శనిక పత్రంగా గుర్తించడంలో ఎందుకు విఫల మయ్యారు? వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ఎన్నడూ భాగం కాని స్త్రీ స్వేచ్ఛని, స్త్రీ పురుష సమానతని, జీవన సౌందర్యాన్ని, ప్రకృతి పారవశ్యాన్ని అన్నిటికీ మించిన మహోన్నత మానవతావాదాన్ని తన మార్గంగా అమలు చేసిన చలాన్ని కనీసం అర్థం చేసుకోవడంలో కూడా అన్యాయమైన వైఖరిని అవలంబించడం దారుణం. ప్రతీ భారతీయ భాషలోకి తర్జుమా చేయాల్సిన చలం ‘స్త్రీ’ ఈనాటికీ ఎవరో కొద్దిమందికి మినహా తెలుగువారికే తెలియకపోవడం మన వెనుకబాటు తనానికి నిదర్శనం. కులమతాల కుళ్ళుని, వాదాల గోడలను పూర్తిగా నిరాకరించిన చలం చివరికి ఎవరివాడూ కాకుండా మిగిలిపోయాడు. చలాన్ని మరచిపోతే అది సమాజానికి నష్టం కానీ చలానికి కాదు. ఎందుకంటే తెలుగులో చలం పురోగామి చైతన్యానికి చిహ్నం. ఆ చైతన్యం లోపించిన ఏ సమాజంలో అయినా పురోగతి శూన్యం. కవిగా, రచయితగా, అనువాదకుడిగా, సామాజిక ఆలోచనపరుడిగా, సంఘసంస్కర్తగా, వ్యంగ్య వ్యాఖ్యాతగా, మహిళా పక్షపాతిగా, తిరుగులేని అధ్యయనవేత్తగా, సమానతా ఉద్యమ నిర్మాతగా అన్నింటికి మించి కళాత్మకత కలిగిన రసైకజీవిగా, గుణాత్మకత రగిలిన స్వాప్నికుడిగా, నిత్య సత్యాన్వేషణా పథంలో పయనించిన మానవీయ సౌందర్యారాధకుడిగా, ప్రకృతి ప్రేమికుడిగా, సౌహార్థిక చింతనశీలిగానే చలాన్ని గుర్తించడం సబబు. అలా, తెలుగులో ఎవరూ గుర్తించని మొదటి కళాత్మక అనార్కిస్టు చలమే. మనిషి జీవితంలో లైంగికత ఒక దైనందిన వాస్తవం. సెక్స్ గురించిన సరైన అవగాహన లేకపోవడమే మానసిక, శారీరక సమస్యలకు ప్రధాన కారణం.
ఈ సత్యాన్ని తెలుగు సమాజంలో గుర్తించిన మొదటి మేధావి చలం. మానవ జీవితంలోని కృత్రిమత్వాన్ని ఎండగట్టి, ఉద్యమ స్థాయిలో స్త్రీ స్వేచ్ఛ కోసం గొంతెత్తిన చలం లాంటి రచయితలు దేశంలోనే అరుదు. ఏ రాజకీయ సామాజిక సిద్ధాంతం జోలికి పోకుండానే ప్రజాస్వామిక విధానాన్ని తనదైన శైలిలో ప్రచారోద్యమంగా తెలుగులో నిర్మించిన ఘనత చలానిదే. మబ్బుల మాటున దాగిన నింగిలో నిబిడీకృతమైన ఎన్నెన్ని అరుదైన రంగురంగుల ఇంద్రధనుస్సుల్ని వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేశాడు? చలం లేని లోకం ఎన్నటికైనా స్వేచ్ఛాగీతాన్ని వినగలిగేదా? సప్తవర్ణాల్ని చూడగలిగేదా? మహిళల్ని, మల్లెపూలను, పిల్లల్ని, పిల్లగాలులను, సూర్యోదయాన్ని, సూక్ష్మమైన జీవిత సారాలను అర్థం చేసుకోగలిగేదా? అందుకనే, చలం వంటి జీవన ఋషి మరెక్కడా కానరాడు. అలాటి చలం, ఆయన రచనలు, జీవితం, చేసిన సుదీర్ఘ పయనం, తప్పొప్పులు అన్నీ తెలుగు జాతి విశిష్ట సంపద. వాటి వెలుగులో అసమానతల గోడల్ని కూలుస్తూ, సమతా మమతల సమాజాన్ని నిర్మించుకోవడమే చలానికి, ఆయన ‘స్త్రీ’కి, మన తరం ఇవ్వాల్సిన నివాళి.
-గౌరవ్
(నేడు చలం జయంతి. ఈ ఏడాది ఆయన ‘స్త్రీ’కి శత వసంతం)