Share News

Andhra Jyothy Chief Editor: కులలెక్కలతో కొత్త ప్రయాణం గట్టెక్కేనా

ABN , Publish Date - May 01 , 2025 | 03:54 AM

కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ దృష్టితో చర్చించబడుతోంది. ఇది సామాజిక, ఆర్థిక పరిమాణాలలో సంక్లిష్టతలను సృష్టించగలదు, కాబట్టి అప్పుడు దీని ఫలితాలు సమర్థవంతంగా ఉండాలి.

Andhra Jyothy Chief Editor: కులలెక్కలతో కొత్త ప్రయాణం గట్టెక్కేనా

త్తులు పైఎత్తులతో అనూహ్య నిర్ణయాలు తీసుకోవటం రాజకీయాల్లో సహజం. కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇలాగే అర్థం చేసుకోవచ్చు. కానీ భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే దీన్ని అత్యంత అసాధారణ నిర్ణయంగా పరిగణించొచ్చు. సందర్భాన్ని బట్టే దేనికైనా సాధారణతనూ అసాధారణతనూ అపాదించవచ్చు. పహల్గాం సంఘటనకు ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో ప్రతిస్పందించే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్న తరుణంలో కులగణన నిర్ణయం ఏ రకంగానూ ఊహించింది కాదు. హిందూ సమాజ ఏకీకరణకు, హిందూ సంస్కృతిపై ఆధారపడే జాతీయవాదానికి కుల భావాలూ, మమకారాలూ అడ్డంకిగా ఉన్నాయన్నది సంఘ్‌పరివార్‌ సైద్ధాంతిక అవగాహనగా ఇప్పటివరకూ చలామణి అయింది. అందుకే కాంగ్రెస్‌ వైపు కులగణనకు సంబంధించి ఎన్ని సవాళ్లు ఎదురైనా బీజేపీ నుంచి గానీ, ఆరెస్సెస్‌ నుంచి గానీ తమ విధానం ఇదీ అంటూ స్పష్టమైన ప్రకటనలు రాలేదు. కులగణనకు నెహ్రూ వ్యతిరేకమంటూ బీజేపీ వైపునుంచి చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. రిజర్వేషన్లను రాజీవ్‌గాంధీ లోక్‌సభలోనే వ్యతిరేకించారంటూ విమర్శలు కురిపించారు. మండల్‌ కమిషన్‌ సిఫార్సులను ఇందిరాగాంధీయే తొక్కిపట్టారని ఆరోపణలూ ఎక్కుపెట్టారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కూడా సమయ, సందర్భాలను బట్టి అలాంటి ప్రకటనలు చేయలేదని చెప్పలేం.


విధానాల్లో, సైద్ధాంతిక సూత్రీకరణల్లో పూర్తిగా భిన్న దార్లు తొక్కటం కాంగ్రెస్‌ చరిత్ర నిండా కనపడుతుంది. ఒకప్పటి విధానాలకు భిన్నంగా కులగణనను ప్రధాన రాజకీయ అజెండాగా మలచుకుని నాలుగేళ్ల నుంచి పార్టీ కార్యాచరణనంతా దాని చుట్టూనే తిప్పుతోంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ఆధిక్యతను సాధించకుండా చేయటంలో కాంగ్రెస్‌ ప్రచారం బాగానే తోడ్పడింది. మోదీ కోరినట్లుగా 400 లోక్‌సభ స్థానాలను కట్టబెడితే రిజర్వేషన్లను బీజేపీ రద్దుచేస్తుందని కాంగ్రెస్‌ ముమ్మరంగా ప్రచారం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ ప్రచారానికి ఉధృతినీ, ఉరవడినీ తీసుకువచ్చారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా, ఎంతో పకడ్బందీగా తెలంగాణలో కులగణనను విజయవంతంగా పూర్తిచేశామనీ దాన్ని మోదీ విస్మరించలేరనీ రేవంత్‌రెడ్డి ఒకటికి పదిసార్లు చెప్పారు. ఒకరకంగా ఇప్పుడదే నిజమైంది. అయితే కాంగ్రెస్‌ ఎక్కుపెట్టిన కులగణన అస్త్రం భవిష్యత్తులో రాజకీయంగా మళ్లీ ఇబ్బంది పెట్టకుండా దాన్ని ఒడుపుగా అందుకుని తనకు ఉపకరించే రీతిలో ప్రయోగించుకోటానికి బీజేపీ సిద్ధమైంది. దీనిలో ఎంతవరకూ సఫలమవుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ కులగణనపై కాంగ్రెస్‌ అనుకున్న స్థాయిలో రాజకీయంగా మరింత విజృంభించకుండా బీజేపీ పావులు కదిపిందని అర్థం. వ్యూహప్రతివ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ కులజనాభాను ఎలా సేకరిస్తారన్న దానిపైనే భవిష్యత్తు ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కులంతో పాటు ఉద్యోగ, విద్య, ఆస్తుల వివరాలను పక్కాగా సేకరించి వాటిని బహిరంగపరిస్తే రాజకీయరంగమే చాలా ఒడిదుడుకులకు లోనుకావాల్సి వస్తుంది. కుల జనాభాను బట్టి ఉద్యోగాలు, పదవులు ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండు చేస్తోంది. అందుకోసం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని గట్టిగా కోరుతోంది. నిజానికి కాంగ్రెసే కాకుండా ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే డిమాండును ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి.


ఇందులో భాగంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతానికి మించి రిజర్వేషన్లను కల్పిస్తూ చేసిన చట్టాలను ఉన్నత న్యాయస్థానాలు కొట్టివేయటమో, నిలుపుదల చేయటమో చేశాయి. దేశవ్యాప్తంగా కులలెక్కలు అందుబాటులోకి వస్తే ఆ పరిమితి తొలగించాలనే ఒత్తిడి తీవ్రమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకూ, ప్రభుత్వ విద్యాసంస్థలకూ ఇది పరిమితం అయితే ఎదురయ్యే సవాళ్లు ఒకరకంగా ఉంటాయి. ప్రైవేటురంగానికి కూడా రిజర్వేషన్లను వర్తింపచేయాలనే డిమాండు ఉధృతమైతే ఉత్పన్నమయ్యే సవాళ్లు భిన్నంగా ఉంటాయి. ఎంతవరకూ రిజర్వేషన్లు ఉండాలన్న విషయంపై రాజకీయంగా ఇప్పటివరకూ ఏకాభిప్రాయం లేదు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లపై అది అసలే లేదు. సమర్థత, పోటీ ఆధారంగా నడిచే స్వేచ్ఛా మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యానికి చాలా పరిమితులు ఉంటాయి. ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టుకోటానికీ, ఉద్యోగుల అర్హతలు, సమర్థతలు నిర్ణయించుకోటానికీ ప్రైవేటురంగానికి దాదాపుగా పూర్తిస్వేచ్ఛను ఇవ్వటం అనేది ఇప్పటివరకూ అడ్డంకులు లేకుండా సాగుతోంది. ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టిన నాటి నుంచి అట్లాంటి స్వేచ్ఛను కల్పిస్తున్నామని జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలూ ఘనంగా చెప్పుకుంటున్నాయి. చెప్పుకోవటమే కాదు పోటీలుపడి మరీ స్వదేశీ–విదేశీ పెట్టుబడుల కోసం ప్రోత్సాహాలను ప్రకటిస్తున్నాయి. పెట్టుబడులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా విధానాలనూ రూపొందిస్తున్నాయి. కులజనాభాను బట్టి వాటాలు నిర్ణయం అవ్వాలనే సూత్రమే గీటురాయి అయితే ప్రైవేటురంగం కూడా పెనుమార్పులకు లోనుకావాల్సి వస్తుంది. వాటాల జోలికి పోకుండా కేవలం కులాల లెక్కలు సేకరించి అదీ కూడా ఆర్థికస్థితిగతులను పక్కాగా తేల్చకుండా యథాతథంగా ప్రస్తుత విధానాలను కొనసాగిస్తే ఆశించిన మార్పులు వచ్చే అవకాశం లేదు. రాజకీయ రంగంలో మాత్రం కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. అవి కూడా తీవ్ర ప్రభావం కలగచేసేవిలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేం. అధికారికంగా కులలెక్కలు లేకపోవచ్చు గానీ గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా నిజమైన కులలెక్కలు రాజకీయ పార్టీల దగ్గర పుష్కలంగా ఉన్నాయి.


వాటి ఆధారంగానే టిక్కెట్లను ఇస్తున్నాయి, పదవులను కట్టబెడుతున్నాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞానం వాడకం విస్తృతమైన తర్వాత కులాలవారీ లెక్కలను క్రోడీకరించటం రాజకీయ పార్టీల వ్యూహకర్తలకు తేలికైపోయింది. తెలిసిన లెక్కలను తెలియదన్నట్లు వ్యవహరించటం మన రాజకీయాల్లో మామూలే! జనాభా సేకరణలో కులలెక్కలు ఒకసారి అధికారికమైన తర్వాత వాటిని భవిష్యత్తులోనూ కొనసాగించాల్సి వస్తుంది. కుల గణాంకాలపై ఏకాభిప్రాయం సాధించటమూ అంతతేలిక కాదు. తక్కువా, ఎక్కువా చేశారనే ఆరోపణలూ వస్తాయి. తెలంగాణలోనూ అవి వచ్చాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో పదేళ్లక్రితం వందకోట్లకు పైగా ఖర్చుపెట్టి చేసిన కులగణనపై ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. ఇప్పటికీ ఆ కుల నివేదికను బయటపెట్టలేకపోతున్నారు. కర్ణాటకలో రెండు ప్రధాన కులాలైన వక్కలిగలు, లింగాయతులు తమ జనాభాను తక్కువగా చూపించారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ రెండు కులాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కులగణన లెక్కలను తప్పుపడుతున్నారు. ఇదే పరిస్థితి పలు రాష్ట్రాల్లో తలెత్తదని చెప్పలేం. జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఏ సమస్యపైనా ఒక అంగీకారానికి రావటం అసాధ్యంగానే పరిణమిస్తోంది. కొన్నిచోట్ల ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలు చేపట్టిన కులాల గణనను రాజకీయ లబ్ధికోసమే నిర్వహించారని కేంద్ర ప్రభుత్వం బుధవారం విమర్శించింది. పారదర్శకత లేకుండా వాటిని జరిపారనీ సమాజంలో సందేహాలను కలగచేశారనీ దుయ్యబట్టింది. జనాభా సేకరణ కేంద్ర ప్రభుత్వ జాబితాలోని అంశమనీ, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు కులజనాభా లెక్కలను సేకరించే అధికారం లేదని కూడా స్పష్టంచేసింది. రాజకీయ దృష్టితో చేసే కులగణన వల్ల సమాజంలో సంబంధాలు దెబ్బతింటున్నాయనీ తాము పారదర్శకంగా చేపట్టే కులలెక్కలతో అటువంటి ప్రమాదం ఉండదనీ సమర్థించుకుంది.


కులగణన నిర్ణయం వెల్లడే ఇట్లాంటి విమర్శలతో మొదలైంది. 2011లో ఆనాటి కాంగ్రెస్‌ నేతృత్వంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, కులగణన (ఎస్‌ఈసీసీ) అసంపూర్ణమైందని కూడా కేంద్రం విమర్శించింది. రాజకీయాలకు ఏదీ అతీతం కాదు కాబట్టి కులగణనపై కేంద్రం వేసే అడుగులు శాస్త్రీయంగా, పటిష్ఠంగా ఉండకపోతే విమర్శలు అనివార్యంగా వస్తాయి. 2011 నాటి సర్వేకు 5000 కోట్లకు పైగా ఖర్చుపెట్టి కులలెక్కలపై చివరకు చేతులేత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు సేకరించిన కులాల జనాభా ఎందుకూ పనికిరాదని కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు తెలియచేసింది. కాంగ్రెస్‌ నాయకత్వం దీన్ని ఇంతవరకూ ప్రశ్నించలేదు. ఆనాటి తమ ప్రభుత్వం సరిగానే కులగణనను చేసిందని ఇంతవరకూ స్పష్టంగా చెప్పుకోలేకపోయింది. 78 ఏళ్ల స్వాతంత్య్రం అనంతరం కుల గణన నిర్ణయాన్ని గొప్పచర్యగా భావించటం రాజకీయంగా సబబే కావచ్చు. కానీ దాని వెనుక సామాజిక, ఆర్థికరంగాల్లో వైఫల్యమే కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఈ వైఫల్యంలోనూ రాజకీయ పార్టీల వాటాలెంతో తేలితేనే అసలు దృశ్యం బయటకు వస్తుంది. ఆ వైఫల్యాలు పునరావృతం కాకుండా, ఎటువంటి చర్యలూ విధానాలూ చేపట్టాలో స్పష్టంచేయకుండా, కేవలం కులాలను లెక్కించటం వల్ల జరిగే లాభం పెద్దగా ఉండదు. ఆర్థికాభివృద్ధి ఫలాలు అందరికీ అందని విధానాలు ఎప్పటిలాగే కొనసాగితే కులం, ప్రాంతం ఆధారంగా కొత్త డిమాండ్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. కులాల్లో ఆర్థిక అంతరాలను, సంపన్న శ్రేణులను పరిగణనలోకి తీసుకుని మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని ఉన్నత న్యాయస్థానాలు చేస్తున్న విజ్ఞప్తులను పట్టించుకోవాల్సిన సమయమూ వచ్చింది. ఆదాయ, సంపద అసమానత్వం భారత్‌లో చాలా తీవ్రంగా ఉందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు వచ్చాయి. ఈ పరిస్థితిని ఎంతోకొంత చక్కదిద్దటానికి తోడ్పడితేనే కులగణనకు సార్థకత లభిస్తుంది. దానికి విరుద్ధంగా జరిగితే ప్రజాస్వామ్యం సంకుచిత భావాలతో సతమతమైపోతుంది. హేతుబద్ధత కుచించుకుపోతుంది.

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

Updated Date - May 01 , 2025 | 03:57 AM