Population Census: జనగణన హోం ఆధ్వర్యంలో ఎందుకు
ABN , Publish Date - May 09 , 2025 | 01:51 AM
జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలన్న ప్రధాని మోదీ నిర్ణయం చరిత్రాత్మకంగా నిలిచింది. ఈ ప్రక్రియను హోం మంత్రిత్వ శాఖ నుంచి స్వతంత్రంగా నిర్వహించాలని కోరుతూ పారదర్శకత, నమ్మకానికి పెద్దపీట వేశారు.
జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందించాలి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జాతీయ భద్రత వ్యవహారాలలో తల మునకలై ఉండి కూడా కులగణనపై నిర్ణయం తీసుకోవడం ప్రధానమంత్రి విలక్షణ నాయకత్వ శైలికి ఒక తార్కాణం. జమిలి ఎన్నికల (లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం) విషయంలో వలే కాకుండా కులగణనపై అనూహ్య నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయం. ఈ నిర్ణయం ద్వారా, కులగణనపై భారతీయ జనతా పార్టీ వైఖరిలో ఒక సమూల మార్పు సంభవించినట్టు స్పష్టమయింది. బ్రిటిష్ వలసపాలకులు 1872లో జనాభా లెక్కల సేకరణను ప్రారంభించిన నాటి నుంచి అందులో భాగంగా కుల జన గణన కూడా చేస్తూవచ్చారు. ఈ ఆనవాయితీ 1931 దాకా కొనసాగింది. ఆ తరువాత కులగణన ప్రక్రియ నిలిచిపోయింది. స్వతంత్ర భారతదేశంలో కూడా దానిని చేపట్టలేదు. ఇంచుమించు ఎనిమిది దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టడం ఇదే మొదటిసారి. స్వపరిపాలనలో భారతీయ సమాజంలో పెనుమార్పులు సంభవించిన నేపథ్యంలో కులగణన అవసరమూ, ప్రాధాన్యమూ సంతరించుకుంది. ఇది ఎట్టకేలకు ఒక నిర్దిష్ట రూపం పొందనున్నది. చరిత్ర ముందుకు నడుస్తూనే ఉంటుంది కదా. జనాభా లెక్కల సేకరణ, కులగణన చాలా బృహత్ కార్యాలు. అంతేకాదు అవి బృహత్ బాధ్యతలు కూడా. అందునా ఏక కాలంలో నిర్వహిస్తున్నందున అవి పారదర్శకంగా జరగాలి. అది వాస్తవం కావాలంటే ఆ ప్రక్రియల నిర్వహణ వృత్తి నైపుణ్యంతో జరగవలసి ఉంటుంది. మరి ఈ కార్యనిర్వహణ ఏ మేరకు వృత్తి నిబద్ధతతో జరుగుతుందనే విషయమై సూచనలు స్పష్టంగా లేవు. ‘ప్రభుత్వ సంక్షేమ ఎజెండాలో భాగంగా కులగణన’ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించినందున అనుమానాలకు తావివ్వని రీతిలో ఆ ప్రక్రియను పూర్తిచేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనాభా లెక్కల సేకరణ, అందులో భాగంగా కులాలవారీ జనగణన ప్రక్రియలో ఆ పారదర్శకత ఎటువంటి మినహాయింపులు లేకుండా కన్పించి తీరాలి.
దీక్షా దక్షతలు దండిగా ఉన్న నాయకుడుగా ప్రజల గౌరవాదరాలు పొందుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనాభా లెక్కల సేకరణ విషయంలో ఒక సాహసోపేత నిర్ణయం తీసుకోవడం సముచితంగా ఉంటుంది. జనాభా లెక్కల సేకరణ బాధ్యతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విధుల నుంచి విడదీయాలి. ఇది కాలానుగుణ్యమైన మార్పుగా అర్థం చేసుకుని ప్రధాని మోదీ తన విలక్షణ రీతిలో నిర్ణయం తీసుకోవాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే జనాభా లెక్కల సేకరణ, అందులో భాగంగా కులగణనను హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కాకుండా స్వతంత్రంగా, వృత్తి నిపుణుల ఆధ్వర్యంలో జరిగేలా విధాన నిర్ణయం తీసుకోవాలి. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ లేదా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ అప్లైడ్ ఎకనామిక్స్ ఇత్యాది అకడమిక్, పరిశోధనా సంస్థల ఆధ్వర్యంలో జనాభా గణన, కులగణన జరగాలి. 2021లోనే నిర్వహించాల్సిన ప్రక్రియను నాలుగు సంవత్సరాలకు పైగా వాయిదా వేయడంపై విమర్శలు వెల్లువెత్తిన దృష్ట్యా జనాభా గణన నిర్వహణకు ఒక స్వతంత్ర సలహామండలిని ప్రధానమంత్రి ఏర్పాటు చేయాలి. ఒక ప్రభుత్వ విభాగం ఆధ్వర్యంలో జనాభా లెక్కల సేకరణను నిర్వహించాల్సిన అవసరమేమీ లేదు. సెన్సస్ డైరెక్టరేట్ ఇన్ని దశాబ్దాలుగా హోం మంత్రిత్వ శాఖలో భాగంగా ఎందుకు ఉండి పోయిందన్నది ఒక అంతుపట్టని విషయమే. ఆసేతు హిమాచలం సమస్త ప్రజల గౌరవాదరాలు నిండుగా పొందుతున్న ప్రధానమంత్రి జనాభా లెక్కల సేకరణ కార్యకలాపాలను ప్రభుత్వ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యం నుంచి పూర్తిగా తొలగించాలి. అయితే ప్రతిపాదిత సలహా మండలిలో ఆయా మంత్రిత్వశాఖలకు విధిగా ప్రాతినిధ్యం కల్పించాలి. జనగణన, కులగణనకు అవసరమైన నిధులను కేటాయించి, ఆ బాధ్యతల నిర్వహణను ‘స్పేస్ కమిషన్’ తరహా స్వతంత్ర సంస్థకు వదిలివేయాలి. సదరు సంస్థ షెడ్యూలు ప్రకారం ఆ బాధ్యతల నిర్వహణను ప్రారంభించి ముగించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు, సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం సమకూర్చాలి. ఇలా జరిగినప్పుడే జనాభా గణన, కులగణన విశ్వసనీయతను సాధించుకుంటాయి. ఏ సంకల్పంతో వాటిని నిర్వహించడం జరిగిందో అది నెరవేరుతుంది. 2026 జనాభా లెక్కల సేకరణ వర్తమాన భారతదేశ ప్రస్థానంలో చరిత్రాత్మక ప్రాముఖ్యమున్న సంఘటనగా నిలిచిపోతుంది.
– డాక్టర్ ఎన్.భాస్కరరావు
(చైర్మన్, సీఎంఎస్)