Share News

Caste Census India 2025: కులగణన ఎలా జరగాలి

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:47 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయం వెనుకబడిన కులాలకు సామాజిక న్యాయాన్ని అందించడంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించనుంది. 2011లో జనగణనలో కులగణన చేస్తామని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి...

Caste Census India 2025: కులగణన ఎలా జరగాలి

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయం వెనుకబడిన కులాలకు సామాజిక న్యాయాన్ని అందించడంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించనుంది. 2011లో జనగణనలో కులగణన చేస్తామని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి, మరుసటి రోజే మళ్లీ అలా చేయబోమని, ప్రత్యేకించి సామాజిక, ఆర్థిక, కులగణన చేస్తామనీ చెప్పి, ఆ సోషల్ ఎకానమిక్ క్యాస్ట్ సెన్సెస్‌ రిపోర్టు కూడా బయటపెట్టలేదు. తర్వాత ఆ సెన్సెస్‌‌లో తప్పులున్నాయని చేతులు దులుపుకుని, రిపోర్ట్‌ను బుట్టదాఖలు చేసింది. అలా ఐదువేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. ఈసారైనా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణనను చిత్తశుద్ధితో చేయాలి. గత అనుభవాల దృష్ట్యా కులగణనను పారదర్శకంగా, నిజాయితీతో జరపాలి. ఈ దిశగా పలు పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉంది. 1) కుల గణన సెన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలోనే జరగాలి. గతంలో కాంగ్రెస్‌ సోషియో, ఎకానమిక్ కులగణన చేసినప్పుడు గ్రామీణ ప్రాంతంలో రూరల్ డెవలప్‌మెంట్‌ శాఖ, పట్టణ ప్రాంతంలో అర్బన్ డెవలప్‌మెంట్‌ శాఖ వారు దాన్ని చేపట్టారు. వీరికి ఆ వృత్తి నైపుణ్యం లేక ఆ సెన్సెస్ తప్పుల తడకగా మారింది. సెన్సెస్ డిపార్ట్‌మెంట్‌లో శిక్షణ పొందిన అధికారుల ద్వారా జరిగితేనే ఈ ప్రక్రియకు ఒక విశ్వసనీయత ఏర్పడుతుంది. 2) కులగణన జనగణనలో అంతర్భాగం కావాలి. దీని కొరకు సెపరేట్ ఫారం ఉండకూడదు. ఉంటే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. 3) ఈ సెన్సెస్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల లెక్కలు మాత్రమే గాక, అన్ని కులాల లెక్కలు తీయాలి. అదే విధంగా ముస్లింలలో, క్రిస్టియన్స్‌లో ఉన్న కులాల లెక్కలు కూడా గణించాలి. 4) ప్రతి కులానికి ఒక కోడ్ నంబర్ ఇవ్వాలి. లేదంటే అనేక కులాలు పుట్టుకు వచ్చి డాటా స్వచ్ఛత దెబ్బ తింటుంది. ఉదాహరణకు ఒకే కులాన్ని ఒకే రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఉదాహరణకు చాకలి వారిని కొన్ని ప్రాంతాల్లో రజక అంటారు, కొన్ని ప్రాంతాల్లో ధోబి అంటారు. వీరందరినీ ఒకే కోడ్ నంబర్‌లోకి తీసుకొచ్చినట్టయితే కులాల లెక్కలు సరిగ్గా వస్తాయి. అలాగే ఓసీ కులాలకు కూడా కోడ్ నంబర్ ఇవ్వాలి. రాష్ట్రాలవారీ కులాల లిస్టులను తయారుచేసి వాటికి కోడ్ నెంబర్ ఇచ్చి పేపర్ ప్రకటనలు ఇవ్వాలి. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది లిస్టును ప్రకటించాలి. ముస్లిం, క్రిస్టియన్ మతాలలోని కులాల క్రోడీకరణ జరగాలి. 5) ప్రస్తుతమున్న సెన్సెస్ ఫారంలో కాలం నెంబర్ 8లో కులాల వివరాలు తెలియపరచవలసి ఉంటుంది. కాలం నెంబర్ 8లో ఎస్సీ అయితే ఎస్సీ అని టిక్ చేసి కింద 8Aలో ఏ కులమో తెలియచేయాలి. అదేవిధంగా ఎస్టీ అయితే ఎస్టీ అని టిక్ చేసి క్రింద 8Bలో తెగ వివరాలు చెప్పాలి. ఇక్కడ బీసీ లేదా ఓబీసీ అనే కాలమ్‌ సృష్టించాలి. దాని కింద బీసీ, ఓబీసీ అనే కాలమ్స్‌ ఉండాలి. ఎందుకంటే, ఉదాహరణకు తెలంగాణలో 134 కులాలు బీసీ లిస్టులో ఉన్నాయి. కాని కేంద్ర ఓబీసీ లిస్టులో 86 కులాలు మాత్రమే ఉన్నాయి. మరి అక్కడ వ్యక్తి ఏ విధంగా సమాధానం ఇవ్వాలి అన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. రాజ్యాంగ రీత్యా ఆర్టికల్ 342A1 ప్రకారం కేంద్రం తన స్వంత ఓబీసీ లిస్ట్‌ను కలిగి ఉండవచ్చును. అదేవిధంగా రాష్ట్రాలు ఆర్టికల్ 342A3 ప్రకారం తమ స్వంత లిస్ట్‌ కలిగి వుండవచ్చు. అందువలన ఈ రెండు కాలమ్స్ ఉండటం శ్రేయస్కరం.


అయితే మొదట ఈ లిస్టులు పత్రికలలో ప్రకటించాలి. అలాగే ఓసీ కాలమ్ కూడా సృష్టించాలి. అక్కడ కూడా కింద కులాల లిస్ట్ కోడ్ నంబర్లతో ఉండాలి. ముస్లిం, క్రిస్టియన్ ఇతర మతాలకు కూడా కాలమ్స్‌ సృష్టించాలి. వారి కులాలను కూడా క్రోడీకరించి కోడ్ నంబర్స్ ఇవ్వాలి. 6) ప్రస్తుత సెన్సెస్‌ ఫార్మేట్‌లో 29 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో ఆర్థికపరమైన డాటా పెద్దగా సేకరించడం లేదు. కేవలం కుల డాటా సేకరించి భూమి, ఆర్థిక వివరాల డాటా సేకరించకపోతే బీసీల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం తేటతెల్లం కాదు. కాబట్టి సెన్సెస్ కాలమ్స్ కొన్ని పెంచాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్స్ సమాచారాన్ని కూడా సేకరించాలి. 7) ఈ సెన్సెస్‌‌ను జాతీయ జనాభా రిజిస్టర్‌కు లింక్ చేయకుండా ఉంటే మంచిది. లేనట్టయితే అనవసర రాజకీయాలకు దారితీసి డాటా సమగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. 8) సెన్సెస్‌లో డాటా సేకరణ డిజిటల్‌గాను, మాన్యువల్‌గాను కూడా జరగాలి. కొండ ప్రాంతాలలో సెల్ ఫోన్ సిగ్నల్స్ తక్కువ కాబట్టి మాన్యువల్ సెన్సెస్‌ ఉపయుక్తం. 9) సేకరించిన సమాచారం గోప్యంగా ఉంచాలి. అది వ్యక్తి ప్రైవసీకి భంగం కలగకుండా భద్రపరచాలి. 10) సెన్సెస్ ఆఫ్ ఇండియా ఆక్ట్ 1948 ద్వారా సెన్సెస్‌ జరుగుతుంది. ఇప్పుడు అన్ని మతాలలోని కులాల జనగణన జరుగుతుంది కాబట్టి ఆ సెన్సెస్ చట్టాన్ని కూడా అవసరమైన మేరకు సవరించాలి. అదేవిధంగా ఒక స్వతంత్ర సెన్సెస్ కమిషన్‌ వేసి ప్రజాభిప్రాయం ద్వారా ఫార్మేట్స్‌ను రూపొందించి చట్టంలో కావాల్సిన మార్పులు చేర్పులు చేసి ఈ కులగణనను చేయాలి. 11) భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చేపట్టే అన్ని సర్వేలలో కూడా ఓబీసీ కాలమ్స్ చేర్చి వివరాలు సేకరించాలి. 12) కేంద్ర ప్రభుత్వం కులగణన షెడ్యూల్‌కు ఎంతోముందునుంచే తగు ప్రచారాన్ని కల్పించాలి, ప్రజలను సమాయత్త పరచాలి. కులం అనేది భారతదేశంలో ఒక వాస్తవికత. కులం ఎక్కడ ఉందో అక్కడ వివక్ష కూడా ఉంటుంది. అందుకే ఈ కులగణన ఒక రోగ నిర్ధారణ పరికరం. రోగం సరిగా తేలితే అప్పుడు చికిత్స సులభం. కాబట్టి ఈ ప్రక్రియ మొత్తం పారదర్శక విధానాలతో జరగాలి. భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా, మానవ అభివృద్ధి సూచీలో 130వ ర్యాంకులోనే మిగిలిపోయింది. ఈ కులగణన ద్వారా సామాజిక, ఆర్థిక, అవసరమైతే రాజకీయ అంశాలను లెక్కించి రాబోయే కాలంలో తగు విధాన నిర్ణయాలు, ప్రణాళికలు రచించి మానవాభివృద్ధి సూచికలలో, ముఖ్యంగా విద్యా ఆరోగ్యాలలో మన స్థానాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

- టి. చిరంజీవులు రిటైర్డ్‌ ఐఏఎస్‌,

బీసీ ఇంటెలెక్చువల్స్‌ ఫోరమ్‌ చైర్మన్‌

Updated Date - Jun 07 , 2025 | 12:49 AM