Share News

Caste Discrimination: కులోన్మాదంతో అభివృద్ధికి ఆటంకం

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:45 AM

భారతీయ సమాజంలో సర్వాంతర్యామి భగవంతుడు కాదు... కులమే’ అంటారు ప్రఖ్యాత చరిత్రకారుడు బిపి‍న్‌ చంద్ర. మనదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కులం ఆవరించి ఉందన్నది ఓ చేదు వాస్తవం.....

Caste Discrimination: కులోన్మాదంతో అభివృద్ధికి ఆటంకం

‘భారతీయ సమాజంలో సర్వాంతర్యామి భగవంతుడు కాదు... కులమే’ అంటారు ప్రఖ్యాత చరిత్రకారుడు బిపి‍న్‌ చంద్ర. మనదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కులం ఆవరించి ఉందన్నది ఓ చేదు వాస్తవం. కుల సమస్య ఈ దేశంలో ఉన్న రూపంలో ప్రపంచంలో మరెక్కడా లేదు. భారతదేశంలో కులానికి బలమైన పునాదులు ఉన్నాయి. వాటిని పెకిలించే ప్రయత్నాలు గతంలో, ప్రత్యేకించి జాతీయోద్యమ సమయంలో చిత్తశుద్ధితో జరిగాయి. కులజాడ్యం, కులాధిక్యత, కులాల కట్టుబాట్ల వల్ల భారత సమాజానికి జరిగిన చెరుపును మాటల్లో చెప్పలేం. అనేక శతాబ్దాల పాటు భారత సమాజంలో కులం సామాజిక అనైక్యతకు, సమాజ విచ్ఛిన్నానికి కారణం అయింది. జాతీయ సమైక్యతాభావం వికసించకుండా, ప్రజాస్వామ్య స్ఫూర్తి విస్తరించకుండా, అభివృద్ధి ఫలాలు అందరికీ చెందకుండా ‘కులం’ అడ్డుపడింది. 1950లో రాజ్యాంగ చట్టం అమలులోకి రాకముందే దేశంలో కుల ప్రభావాన్ని తగ్గించడానికి, కులాధిపత్య ధోరణుల్ని అరికట్టడానికి, కులాల మధ్య సానుకూల వాతావరణం పెంచడానికి అనేక ఉద్యమాలు జరిగాయి. ముఖ్యంగా జాతీయోద్యమం, హేతువాద ఉద్యమాలతోపాటు, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజం వంటి సంస్థలు, సంఘ సంస్కర్తలు ఎంతో కృషి సల్పారు. కొన్ని ఫలితాలు కూడా సాధించారు. దేశంలో పారిశ్రామిక, వ్యవసాయ విప్లవాలు వచ్చాక మరికొంత మార్పు వచ్చింది. నూతన ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరం అయ్యాక కులమత భేదాలు లేకుండా ప్రజలు కలసి మెలసి పనిచేసే వాతావరణం నగరాలు, పట్టణాలలో చాలావరకు ఏర్పడింది. దేశ స్వాతంత్య్రం తర్వాత అన్ని రంగాలలో అమలు కావాల్సిన ప్రజాస్వామ్య స్ఫూర్తి వ్యక్తుల స్వార్థంతోను, రాజకీయ పార్టీల అధికార దాహంతోను మృగ్యంగా మారింది. రాజ్యాంగకర్తలు ఆశించిన విధంగా మన రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కాకపోవడానికి కారణం, అది సామాజిక ప్రజాస్వామ్య వ్యవస్థగా రూపుదిద్దుకోలేకపోవడమే. అనేక దశాబ్దాలపాటు దేశంలోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అణగారిన కులాలకు రాజ్యాధికారంలో సముచితమైన భాగస్వామ్యం లేకుండాపోయింది.


కులాలను ఓటు బ్యాంకులుగా చూసే వైఖరిని దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు చాలా రోజులుగా ఓ వ్యూహంగా మార్చుకొన్నాయి. దాంతో, ఒక్కో కులం నుంచి పదుల సంఖ్యలో స్వయం ప్రకటిత నాయకులు తయారవుతున్నారు. ఎన్నికల సమయంలో వారు ప్రెజర్ గ్రూప్స్‌గా తయారై రాజకీయ పార్టీలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొన్నా, దానిని కులం కోణం నుంచి చూసి సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేయడం, తమ కులస్థుల్ని రెచ్చగొట్టడం వారికి సర్వసాధారణంగా మారింది. ఈ కుల మేధావులు ఎంత దూరం వెళ్తున్నారంటే.. సీఎం, డిప్యూటీ సీఎం ఏ విధంగా పరిపాలించాలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా సోషల్ మీడియా ద్వారా వారే నిర్దేశిస్తున్నారు! ఆ మధ్య హిందూపురం శాసనసభ్యుడు, సినీహీరో నందమూరి బాలకృష్ణ, మరో సినీ హీరో చిరంజీవిల మధ్య ఏర్పడిన స్వల్ప వివాదంలోకి కూడా ఈ కులోన్మాదులు దూరిపోయారు. వాళ్లిద్దరి ప్రమేయం లేకుండానే వీరు సవాళ్లు, ప్రతిసవాళ్లతో సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఎంతో సున్నితమైన అంశంగా, కులాల మధ్య వైషమ్యాలను పెంచడం నేరంగా భావించే ప్రధాన మీడియా స్రవంతి కూడా ఇందులో ప్రధానపాత్ర పోషించడం ఆశ్చర్యం. తాజాగా, నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఓ ఘటనలో ప్రధాన పార్టీకి చెందిన మీడియా అత్యంత బాధ్యతారహితంగా ప్రవర్తించింది. ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకొన్న వివాదం చివరకు దారుణ హత్యకు దారితీసింది. ఈ ఘటనలో కొందరు కుల నాయకులు, ప్రతిపక్షం వ్యవహరించిన తీరు అమానుషంగా ఉంది. ఓ వైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం, పరిశ్రమలను రప్పించడం కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. శాంతిభద్రతలు సవ్యంగా ఉన్నచోటనే పారిశ్రామికాధిపతులు తమ సంస్థలు ప్రారంభిస్తారు. రాజకీయ అస్థిరత, అనిశ్చితి, రౌడీయిజం ఉండే చోటుకు ఎవరూ రారు. ఈ వాస్తవం చంద్రబాబు నాయుడుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదేళ్లు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో కుల, మత ఘర్షణలకు తావులేదు. 2014–19 మధ్య అయిదేళ్లలో గానీ, గత 16 నెలల్లో గానీ ప్రజల మధ్య కులపరమైన విభేదాలు లేవు. ముఖ్యంగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఖరారైనప్పట్నుంచీ ఏపీ రాజకీయాల్లో కొన్ని అవాంఛనీయ ధోరణులు మొదలైన సంకేతాలు వెలువడుతున్నాయి. కొన్ని శక్తులు తమకు అడ్డూ అదుపూ లేనట్టు రెచ్చిపోతున్నాయి. ఇటువంటి ధోరణులను ఆదిలోనే తుంచివేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.

-సి. రామచంద్రయ్య శాసనమండలి సభ్యుడు

Updated Date - Nov 11 , 2025 | 12:45 AM