Share News

Suppression Of Critical Thinking: గౌరవం పేరిట గుడ్డి విధేయత

ABN , Publish Date - Jul 22 , 2025 | 03:10 AM

ఇటీవల ఒక పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు హాజరయ్యాను. ఇలాంటి సమావేశాలు విద్యా ..

Suppression Of Critical Thinking: గౌరవం పేరిట గుడ్డి విధేయత
Suppression Of Critical Thinking

టీవల ఒక పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు హాజరయ్యాను. ఇలాంటి సమావేశాలు విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలోను, తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచడంలోను ఎంతో కీలకం. కానీ ఈ వేదికపై చోటుచేసుకున్న ఒక అంశం నన్ను తీవ్రంగా ఆలోచింపజేసింది. ఈ సమావేశంలో పిల్లల చేత తల్లిదండ్రుల పాదాలకు మొక్కించారు. పాదాలను ముద్దాడమని చెప్పారు. ఇది స్వచ్ఛందంగా జరగలేదు. కొందరు పిల్లల ముఖాల్లో ఇబ్బంది స్పష్టంగా కనిపించింది. మన దక్షిణ భారత సంస్కృతిలో ఇది అనూహ్యం. బెంగాలీ వంటి ఉత్తర భారత ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలలో ఉండే సంప్రదాయాన్ని, మన సమాజంలో బలవంతంగా ప్రవేశపెట్టే ప్రయత్నమా అని అనిపించింది. ఉపాధ్యాయుల పాదాల్ని పిల్లలతో మొక్కించడం కూడా చూసాను. ఇవన్నీ మన పిల్లలపై బలవంతంగా విధేయతను రుద్దే ప్రయత్నాలుగా అనిపించాయి. ఇలాంటి చర్యల వెనక ఉన్న భావజాలాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. పిల్లలను గౌరవం పేరుతో తల వంచేట్టు చేసే బదులు, నిలబడి మాట్లాడే శక్తిని కలిగించటం నేడు ఎక్కువ అవసరం. ఈ పాదపూజలు, తల వంచే శిక్షణలు విద్యా లక్ష్యాలకి విరుద్ధం. ప్రముఖ విద్యా తత్త్వవేత్త పాలో ఫ్రెయిర్, ‘‘విద్యార్థి ఒక ఖాళీ పాత్ర కాదు, ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని నింపే అధికారి కాదు. ఇద్దరూ కలిసి వారి మధ్య సంభాషణలో జ్ఞానాన్ని ఆవిష్కరించాలి’’ అంటారు. విద్య ఇలాంటి విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించాలి, గుడ్డి విధేయతను కాదు. గురువులు, పాఠ్యపుస్తకాలు చెప్పిన విషయాలను గుడ్డిగా ఆమోదించడం కంటే, వాటిని ప్రశ్నించడం, విశ్లేషించడం, కొత్త ఆలోచనలను అన్వేషించడం ముఖ్యం. శాస్త్రీయ ఆవిష్కరణలు, సామాజిక సంస్కరణలు ఎల్లప్పుడూ ప్రశ్నించే మనస్తత్వం నుండే జన్మించాయి. విద్యా వ్యవస్థలు విద్యార్థులను గుడ్డి విధేయత వైపు కాక, స్వతంత్ర ఆలోచన వైపు నడిపించాలి.


తలవంచడం, పాదాభివందనం వంటి సంప్రదాయాలు గౌరవాన్ని సూచిస్తాయి, కానీ కొన్ని సందర్భాలలో ఇవి విద్యార్థులలో భయం, ఆత్మవిశ్వాస లోపాన్ని సృష్టించవచ్చు. స్వతంత్ర ఆలోచనలు, ఆత్మగౌరవం లేని విద్యార్థి సమాజంలో తన గొంతును వినిపించలేడు. ఆధునిక సమాజంలో రేపటి పౌరులు కాబోయే నేటి విద్యార్థులు భవిష్యత్తులో తమ ఆలోచనలను ధైర్యంగా వ్యక్తపరచడం, అన్యాయాన్ని ఎదిరించడం, సమాజంలో సానుకూల మార్పుల కోసం కృషి చేయడం అవసరం. తలవంచే సంస్కృతి ఈ ఆత్మవిశ్వాసాన్ని అణచివేయగలదు. గౌరవం అనేది హృదయంలోని భావం, కేవలం శారీరక చర్యలలో లేదా బాహ్య ఉపచారాలలో మాత్రమే ఇది వ్యక్తం కాదు. పాదపూజలు భయం ఆధారంగా ఏర్పడతాయి – గౌరవం, ప్రేమ ఆధారంగా కాదు. ఇలాంటి భయ ఆధారిత సంబంధాలు పిల్లల విమర్శనాత్మక ఆలోచనకు అడ్డుపడతాయి. పిల్లలు ఏ విషయాన్నైనా ప్రశ్నించే ధైర్యాన్ని కోల్పోతారు. ‘‘పెద్దవారు చెప్పిందే నిజం’’ అనే అభిప్రాయం అలవాటవుతుంది.


ఇప్పటి రాజకీయ వర్గాల్లో పాత విలువలు, గురుకుల పద్ధతులు, ధార్మిక విశ్వాసాల పేర్లతో, ఆధిపత్య నిర్మాణాలను తిరిగి బలపరిచే ప్రయత్నం జరుగుతున్నది. ఇది కేవలం సంస్కృతి పరిరక్షణ కాదు, అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం. ప్రశ్నించే పిల్లలకు బదులుగా విధేయత చూపే తరం కావాలన్న లక్ష్యం దీని వెనక ఉన్నది. ఇది కొత్త తరం ప్రజల్లో విమర్శనాత్మక ఆలోచనను అణిచివేస్తుంది. అలాంటి తరం ప్రభుత్వాన్ని ప్రశ్నించదు, సమాజపు తేడాలను ఎత్తి చూపదు, నియంత్రణను అంగీకరిస్తుంది. ఇది ఒక విధమైన సామాజిక మౌనాన్ని బలపరచే విధానం. నూతన జాతీయ విద్యా విధానంలో ‘గురుకుల పద్ధతి’కి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రాచీన సంస్కృత గ్రంథాలపై దృష్టిపెట్టి భారతీయతను నినాదంగా మార్చడం చూస్తుంటే, ఇది జ్ఞానం పెద్దవారివద్ద ఉండాలి, పిల్లలు వినాలి మాత్రమే అనే పద్ధతికి దారితీస్తోంది అనిపిస్తుంది. విద్యార్థులు తలవంచే బదులు, నిలబడి మాట్లాడే శక్తిని పొందాలి. విద్య విమర్శనాత్మక ఆలోచనను, స్వతంత్ర దృక్పథాన్ని ప్రోత్సహించాలి. సంప్రదాయ గౌరవ వ్యక్తీకరణలు ఆధునిక సమాజంలో భావాధారితంగా, పరస్పర గౌరవంతో కూడినవిగా పరిణమించాలి. విద్యార్థులలో స్వేచ్ఛ, సంభాషణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడం ద్వారా మాత్రమే మనం సమసమాజాన్ని, పురోగమన దేశాన్ని నిర్మించగలం. తలెత్తి నడిచే విద్యార్థులు సమాజంలో సానుకూల మార్పులను తీసుకురాగల నాయకులుగా మారతారు.

– డా. కె.రమాప్రభ, సామాజిక కార్యకర్త

Updated Date - Jul 22 , 2025 | 03:10 AM