Share News

భయ్యా, దానశీలత మరిచావా?

ABN , Publish Date - Mar 19 , 2025 | 01:03 AM

సకల మతాల ధార్మిక సూత్రాలలో దానం, కరుణ ప్రధానంగా ఉంటాయి. కనుకనే, సర్వమతాల సారాంశం మానవ సేవే మాధవ సేవ. మనిషి దైవ సన్నిధికి వెళ్లే మార్గంలో దానం అనేది అత్యంత...

భయ్యా, దానశీలత మరిచావా?

సకల మతాల ధార్మిక సూత్రాలలో దానం, కరుణ ప్రధానంగా ఉంటాయి. కనుకనే, సర్వమతాల సారాంశం మానవ సేవే మాధవ సేవ. మనిషి దైవ సన్నిధికి వెళ్లే మార్గంలో దానం అనేది అత్యంత కీలక వారధి. భక్తి ప్రవచనాలు ఎన్ని పలికినా, దైవ చింతనలో ఎంత గడిపినా మనిషి దానం విషయానికి వచ్చే సరికి సహజంగా వెనుకంజ వేస్తున్నాడు! ఇస్లాం జీవన విధానానికి మూలం ఖురాన్. ఈ పవిత్ర గ్రంథం రంజాన్ మాసంలో అవతరించిందని ముస్లింల విశ్వాసం. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజాలు రంజాన్ మాసాన్ని భక్తిశ్రద్ధలతో పాటిస్తాయి. ఇక, ఇస్లాం అధికారిక మతంగా ఉన్న గల్ఫ్ దేశాలు అన్నిటిలోనూ ఈ పవిత్ర మాసంలో విశ్వాసుల ఆర్భాటం ఇతర ముస్లిం దేశాలలో కంటే ఎక్కువగా ఉంటుంది. ఇస్లాంలో ఐదు మౌలిక, ఆదేశిక సూత్రాలలో ఒకటి: సియాం (ఉపవాసం). రంజాన్‌ నెలలో ముస్లింలు అందరూ ఈ ధార్మిక నియమాన్ని పాటిస్తారు. తమ ఉపవాస దీక్ష, దానాల ద్వారా దైవ సంకల్పం బలోపేతం కావాలనేది రంజాన్ మాసం అందించే సందేశం. ఈ పవిత్ర మాసంలో వీలయినంత ఎక్కువ సమయాన్ని దైవ సన్నిధిలోనూ, ఖురాన్ పఠనంలోనూ గడపాలని ఇస్లామిక్ పండితులు చెబుతుంటారు. ఈ కారణాన సంవత్సరంలోని మిగిలిన నెలల్లో రోజూ నమాజు చేయనివారు కూడ ఈ నెలలో క్రమం తప్పకుండా నమాజు చేయడానికి ప్రయత్నిస్తారు.

ఐదు ఆదేశిక సూత్రాలలో సియాంతో పాటు జకాత్ (నిర్బంధ దానం) కూడ ముఖ్యమైనది. ముస్లింలకు నమాజు, ఉపవాసం ఎంత ముఖ్యమో అదే విధంగా విధిగా దానం చేయడం కూడ అంతే ముఖ్యం. జకాత్ అనేది ఒక రకమైన ఖచ్చితమైన అల్లాహ్ పన్ను పేదలకు చెల్లించే విధానం. ఈ నియమవ్రతం నుంచి అర్హులకు మినహాయింపు లేదు. దానం అనేది ఐచ్ఛికం కానీ జకాత్ ఖచ్చితం, తప్పని సరి. ప్రతి ముస్లిం తన వద్ద నిల్వ ఉన్న వార్షిక ఆదాయం నుండి రెండున్నర శాతం విధిగా పేదలకు తప్పనిసరిగా చెల్లించాలనేదే జకాత్‌ ధార్మిక నియమం. ఉదాహరణకు లక్ష రూపాయలు ఉన్న వ్యక్తి విధిగా రెండున్నర వేల రూపాయలు పేదలకు దానం ఇవ్వాలనేది తప్పనిసరి ఇస్లామిక్ నిబంధన. నమాజు, ఉపవాసం పట్ల ముందుకు వచ్చే భారతీయ ముస్లిం సమాజం జకాత్ ఇవ్వాల్సివచ్చే సరికి వెనుకంజ వేస్తోంది. నమాజుతో పాటు జకాత్ చెల్లింపు బాధ్యతను అల్లాహ్‌ ఖురాన్‌ వివరించింది. హదీస్, ఖురాన్ ప్రవచనాలను అత్యంత భక్తి శ్రద్ధలతో వినేవారు, ముస్లిం సమాజం వెనుకబాటుతనం గురించి భావోద్వేగ ప్రసంగాలకు లోనయ్యేవారు కూడ జకాత్ చెల్లింపు వచ్చేసరికి ఆసక్తి చూపరు. మత బోధకులు (ఖతీబ్) జకాత్ దానం ఇవ్వాల్సిన అవశ్యకతను నొక్కి చెబుతున్నారు. కానీ ఆశించిన స్ధాయిలో సరైన నిష్పత్తి ప్రకారం జకాత్‌ ఇవ్వడం లేదనే ఒక అభిప్రాయం చాలామందిలో నెలకొని ఉంది. జకాత్ డబ్బును ప్రణాళికా బద్ధంగా వెచ్చిస్తే ముస్లిం సమాజంలో పేదరికం అంటూ ఏమి ఉండదనేది అనేక మంది అభిప్రాయం. జకాత్‌తో పాటు సదఖా, వక్ఫ్ అనే మరో రెండు రకాల దానాలు కూడ ఇస్లాంలో ఉంటాయి కానీ జకాత్ తప్పనిసరి. జకాత్ దానం ద్వారా తమ సామాజిక వర్గ అభ్యున్నతికి సవాలక్ష అవకాశాలు ఉన్నా తెలుగునాటతో సహా సమస్త భారతదేశంలోనూ అటువంటి కృషి జరుగుతున్న ఉదంతం ఒక్కటి కూడా లేకపోవడం విచారకరం. జకాత్ దానం ద్వారా విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టవచ్చు.


ముస్లిం సమాజంలోని పేదలకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యా సంస్ధ గానీ ఆసుపత్రి గానీ తెలుగునాట ఒక్కటి కూడా లేదు. కనీసం నవాబుల నగరమైన హైదరాబాద్‌లో విద్యావకాశాల కొరకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ముస్లిం బాలబాలికలకు నీడ నివ్వడానికి విద్యార్ధుల వసతి గృహం ఒక్కటి కూడా లేదంటే దుస్ధితిని ఉహించుకోవచ్చు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింల ఇళ్ళలో, మస్జీదులలో జకాత్ ఇవ్వమని వచ్చే అసంఖ్యాకులలో ఏ ఒక్కరు కూడ ఒక పాఠశాల లేదా వైద్యశాల నిర్మాణం కోసం రాకపోవడానికి కారణం ఆ దిశగా సమాజం అడుగువేయకపోవడమే కాదూ? సామాజిక వికాస కార్యక్రమాలను జకాత్ ద్వారా చేయడం పెద్ద సమస్య ఏమి కాకున్నా ఎందుకో ముస్లిం సమాజం మిన్నకుండిపోతోంది. హైదరాబాద్‌ నగరంలోని ఒక్క టోలీచౌకీ ప్రాంతానికి చెందిన ప్రవాసులు నిబద్ధతగా జకాత్ ఇస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ముస్లిం సామాజికులకు ఈ దిశగా నేతృత్వం వహించే ఆమోదయోగ్యమైన నాయకుడు ఒక్కడు కూడ లేడంటే ఆశ్చర్యం కలుగుతుంది. అటు కర్ణాటక సరిహద్దులోని హిందూపురం మొదలు ఇటు మహారాష్ట్ర సరిహద్దులోని బోధన్ వరకు తెలుగునాట ముస్లిం సమాజం దీనిపై ఆత్మ విమర్శ చేసుకోవాలి. తమ వెనుకబాటుతనానికి పాలకులే కారణమంటూ నిందించడం వల్ల ప్రయోజనమేముంది? వివక్షకు గురవుతున్న బాధితులుగా చెప్పుకొంటూ వాపోవడం కంటే తమ పరధిలో తామెంత వరకు తమ వారికి మేలు చేయగలుగుతామనే కనీస కింకర్తవ్యాన్ని ముస్లింలు విస్మరిస్తున్నారు. ప్రార్ధనలతో పాటు దానానికి కూడ ముందుకు వస్తేనే అధ్యాత్మికతకు పరిపూర్ణత ఉంటుంది.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి:

BIg Alert: కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా..రూ.25 వేల ఫైన్, జైలు శిక్ష కూడా..

Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Updated Date - Mar 19 , 2025 | 01:03 AM