Share News

Krishna River Water Dispute: పొంచి ఉన్న కృష్ణా జలకాటకం

ABN , Publish Date - May 06 , 2025 | 02:30 AM

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్-2 తుది తీర్పును గెజిట్ నోటిఫికేషన్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింత పెరిగే అవకాశాన్ని కలుగజేస్తాయి.

Krishna River Water Dispute: పొంచి ఉన్న కృష్ణా జలకాటకం

సుప్రీంకోర్టు స్టే ఉన్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్–2 తుది తీర్పు(2013)పై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సన్నాహాలు చేస్తున్నారు. బేసిన్‌లోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించి తీర్పును గెజిట్ నోటిఫికేషన్ చేయదలచారు. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రానికి పంగనామాలు మిగులుతాయి. ఈ నెల ఏడవ తేదీన బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. వాస్తవంలో కర్ణాటక ఆల్మట్టి జలాశయం నిర్మించిన తర్వాత కృష్ణకు వరద ఆలస్యంగా వస్తోంది. ఈ తీర్పు నోటిఫై జరిగి, ఆల్మట్టి ఎత్తు 525 మీటర్లకు పెరిగితే, ఇంతే సంగతులు. పైగా వర్షాభావ నీటి సంవత్సరాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ తీర్పు ద్వారా ఎగువ రాష్ట్రాలు పొందిన లబ్ధికి వ్యతిరేకంగా కొంత చురుకుగా వ్యవహరించారు. కాని రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ ఎగువ రాష్ట్రాలు పొందిన లబ్ధి గురించి పట్టించుకోవడం మానేశారు.

కేసీఆర్ భావోద్వేగాలు పెంచి పోషించే వ్యూహం రచించి, కృష్ణ నదీ జలాల వాటాల గురించి అవశేష ఆంధ్రప్రదేశ్‌తో వాదులాటకు దిగారు. తుదకు 2020లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బుట్టలో వేసుకొని తిరిగి ఉభయ రాష్ట్రాల మధ్య కృష్ణ నదీ జలాల పంపిణీకి ట్రిబ్యునల్ నియామకం గురించి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందారు. ఈ ప్రతిపాదన కేంద్ర న్యాయశాఖ వద్ద మూడేళ్ల కాలం దస్త్రాలకే పరిమితమవగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2023 తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏకంగా ట్రిబ్యునల్ నియామకానికి ఆమోదం తెలిపి, ఆంధ్రప్రదేశ్ గొంతు కోసింది.


గమనార్హమైన అంశమేమంటే ఇదే ట్రిబ్యునల్ రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు 2015 నుంచి విచారణ జరుపుతుండగా, 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 కింద అదనపు అంశాలు జోడించి, విధి విధానాలతో విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్ రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు రెండు రాష్ట్రాలు కోరిన 31 అంశాలు పక్కన బెట్టి, తాజాగా కేంద్రం జారీ చేసిన ఆదేశాల మేరకు విచారణ సాగిస్తోంది. ఇదంతా ఎందుకంటే, తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గైకొంటున్న చర్యలు ఫలిస్తే, రెండు తెలుగు రాష్ట్రాలకూ ప్రమాదం పొంచి ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక లబ్ధి పొందుతాయి. పైగా అదనంగా 258 టియంసిల నికర జలాలు ఎగువ రాష్ట్రాలు తన్నుకుపోతాయి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల జల వనరులు శాఖ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయడంలోని ఆంతర్యమేమిటి? ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆల్మట్టి ఎత్తు 525 మీటర్లకు పెంచుతామని రైతుల సమావేశంలో ప్రకటించారు. దానికి, కేంద్ర మంత్రి చొరవకు ఏమైనా సంబంధముందా?

బచావత్ ట్రిబ్యునల్ తీర్పు కాల పరిమితి ముగిసిన తరువాత 2004లో నియామకమైన బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్ 2013లో తుది తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర శరాఘాతంగా ఉండడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకెక్కింది. సుప్రీంకోర్టు ఈ తీర్పుపై స్టే విధించడంతో కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ నిలుపుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యథాతథస్థితి కొనసాగుతోంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2015లో తెలంగాణ కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. గత రెండు మూడేళ్లుగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో స్టే వెకేట్ చేయించేందుకు శతవిధాల విఫల యత్నాలు చేశాయి.


కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం షరతులతో ఆల్మట్టి ఎత్తు పెంచుకొనేందుకు అనుమతి ఇవ్వమని సుప్రీంకోర్టును కోరింది. కాని జరగలేదు. ఇప్పుడు తాజాగా కేంద్ర జల శక్తి శాఖ మంత్రి ఏకాభిప్రాయం సాధనకు సమావేశం ఏర్పాటు చేశారు. ఆయనకు ఇప్పుడు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో, దీని వెనుక ఎవరు ఉన్నారో తెలియదు.దేశంలో ఏ నదీ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినా నదికి ఆఖరుగా ఉండే రాష్ట్రం నీటి ఎద్దడి రోజుల్లో వాడుకొనేందుకు మిగులు జలాలు కేటాయించే సంప్రదాయముంది. వర్షాభావ రోజుల్లో ఆ నీరే గతి. కాని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణ నదిలో చుక్క మిగులు నీళ్లు లేకుండా మొత్తం బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల మధ్య పంపకం చేసింది. మిగులు జలాలు ఉండివుంటే నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ స్థాయిలో నీటి వివాదాలు ఉండేవి కావు. పైగా క్యారీ ఓవర్ అనే హెడ్ కాకుండా మిగిలిన రెండు రాష్ట్రాలకు కేటాయించిన నీటిని నేరుగా వాడుకొనే అవకాశం కల్పించింది. కనీసం ఇతర రాష్ట్రాలతో సమానంగా ఇంచుమించు కేటాయింపులు లేకుండా కేవలం 38 టీయంసీలు మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది.

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఏర్పాటు చేసే సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ కూడా ఏకాభిప్రాయ ప్రకటనను గట్టిగా వ్యతిరేకించవలసి ఉంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఇతర జల వివాదాలు ఈ సమిష్టి పోరాటానికి అడ్డు రాకూడదు. ఏకాభిప్రాయ సాధన పేరుతో కేంద్రం ఇతర తాయిలాలతో మభ్యపరిస్తే మాత్రం రెండు రాష్ట్రాల కొంపలు కొల్లేరవుతాయి.


ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పు నోటిఫై చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయాలి. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఉంది. అలాంటి వివాదాన్ని కోర్టు బయట పరిష్కారానికి పూనుకుంటున్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, కేసులున్నా, సుప్రీంకోర్టు స్టే లేని వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పు ఎందుకు నోటిఫై చేయలేదో అర్థం కాదు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై కోసం మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రుల స్థాయిలో చర్యలు ఉంటున్నాయి, ఫాలో అప్ చేస్తున్నారు. ఏపీ కూడా లాబీయింగ్‌ మొదలు పెట్టి ఉంటే వంశధార ట్రిబ్యునల్ ఇంకా పెండింగ్‌లో ఉండేది కాదు. ఇప్పటికైనా ఏపీ ఇంజనీరింగ్ అధికారులు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్–2 తీర్పు నోటిఫైకి వ్యతిరేకంగా పోరాడుతూ, అదే సమయంలో సుప్రీంకోర్టు స్టే లేని వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పు నోటిఫై చేయించుకోవాలి. ఇదే జరిగితే అతి తక్కువ నిధులతో వంశధార, నాగావళి నదులు అనుసంధానికి మార్గం సుగమం అవుతుంది.

- వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - May 06 , 2025 | 02:31 AM