Share News

Book Sharing Experience: పంచుకున్న పుస్తకం

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:39 AM

ఒకరు చదివి మనకు ఇచ్చిన పుస్తకం ప్రేమ, మిత్రత్వం, జ్ఞాపకాల తిమ్మిరి నిండిన అనుభూతిగా కవితలో వ్యక్తమైంది. ఆ పుస్తకం అనుభవం, జీవితం లో ఎప్పటికీ మిగిలిపోయే మధుర క్షణాలను తలపించేలా ఉంటుంది.

Book Sharing Experience: పంచుకున్న పుస్తకం

ఒకరు చదివి ఇచ్చిన పుస్తకం

గుళ్ళో ఇచ్చిన ప్రసాదాన్ని మిగిల్చి

ఇష్టమైన వాళ్ళ కోసం ఇంటికి తేవడం లాంటిది

తోకచుక్క రాలిపడుతుంటే

పక్కనున్నవాళ్ళని తట్టి చూపించడం లాంటిది

దూరాలనున్న ప్రేమికులు ఫోన్‌లో కబుర్లాడుకుంటూ

చందమామను ఇప్పుడే చూడమని గుసగుసలాడడం లాంటిది

వాళ్ళు కలిసి గుర్తు చేసుకోవాలనుకునే తీపిజ్ఞాపకం లాంటిది.

ఒకరు చదివి గుర్తులు పెట్టి ఇచ్చిన పుస్తకం,

నీలాంటి ఎవరో నీ కలలోకి రావడం లాంటిది

అనూహ్యంగా ఎవరో నీ గుప్పెట్లో పెట్టి మూసిన

ప్రేమలేఖ లాంటిది

అనుకోని ప్రయాణంలో కలిసి

అదాటున మనసుకు దగ్గరైన స్నేహం లాంటిది

చిట్టి పిట్ట మృదుత్వం నీకు అనుభవమవ్వడానికి

దాని ఈకనొకరు నీ చెంపల మీద రాయడం లాంటిది

ఒకరు చదివి, చదవమని ఇచ్చిన పుస్తకం

జగమంతా తిరిగినా తరిగిపోని

జాబిలి తునక వెలుగు లాంటిది. ఆ అనుభవం,

ఈ లోకంలో సూర్యోదయాలను చూడటానికి

దగ్గరి మిత్రులు కలిసి సముద్రాలకు వెళ్ళడం లాంటిది

ఎగసే ఒక సంతోష కెరటానికి ఎదురెళ్ళి

ఇద్దరు మనుషులు నిలువెల్లా తడిసిపోవడం లాంటిది.

-మానస చామర్తి

79754 68091

Updated Date - Jun 09 , 2025 | 12:40 AM