Activist writer: నల్లకలువల కొలనులో వికసించిన కవిత్వం
ABN , Publish Date - Aug 18 , 2025 | 06:14 AM
అనిశెట్టి రజిత వరంగల్ చైతన్యజ్వాల. హోరెత్తి ఎగిసిపడే కల్లోల కాలపు కడలి తరంగం. కవిత్వమై కాలాన్ని వ్యాఖ్యానించిన సంవేదనాశీలి. ఉద్యమోపజీవి. 1958 ఏప్రిల్ 14న పుట్టి పదకొండేళ్ళ వయసులోనే 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో...
అనిశెట్టి రజిత వరంగల్ చైతన్యజ్వాల. హోరెత్తి ఎగిసిపడే కల్లోల కాలపు కడలి తరంగం. కవిత్వమై కాలాన్ని వ్యాఖ్యానించిన సంవేదనాశీలి. ఉద్యమోపజీవి. 1958 ఏప్రిల్ 14న పుట్టి పదకొండేళ్ళ వయసులోనే 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎత్తిన పిడికిలి, విప్పిన ధిక్కారస్వరం– అర్ధదశాబ్దకాలం బహుముఖ సామాజిక ఉద్యమాలలో, ఊరేగింపులలో ఆమెను ముందువరసలో నిలిపాయి. అరవై ఏడేళ్ల వయసులో 2025 ఆగస్టు 11న తుది ఊపిరి ఆగేవరకు ఆ పిడికిలి బిగి సడలలేదు. ధిక్కారం మొక్క పోలేదు. కవిత్వం శాశ్వత చిరునామాగా అవి నిరంతర స్ఫూర్తిదాయక శక్తులై భాసిస్తాయి. కార్మికులు, కర్షకులు, విప్లవవీరులు, శ్రామిక స్త్రీలు అందరూ ఆమె కవితలలో సందడి సందడిగా కనబడతారు. జన్మభూమి పథకాలు, విప్లవవీరుల తలలకు వెలకట్టే విధానాలు, మహిళా సాధికారత లోని మాయ, స్త్రీలపై అనుక్షణం జరిగే అత్యాచారాలు, ఇంటి పని వంటి అనేక సమస్యలను సహానుభూతితో కవిత్వం చేసింది. శ్రామిక బహుజన స్త్రీ సమస్యలను సంబోధించటం, చదువుకున్న మధ్యతరగతి భాషను వదిలి శ్రామిక జన వ్యవహార భాషలో యాసలో కవిత్వాన్ని రాయటం రజిత ప్రత్యేకతలు. రజిత ఉద్యమ కవిత్వం ప్రధానంగా స్త్రీ సమస్యను, దళిత సమస్యను, తెలంగాణ అస్తిత్వ ఆరాట ఆత్మగౌరవ ఆకాంక్షలను చుట్టుకొని కనిపిస్తుంది. అంతర్జాతీయ మహిళా దశాబ్ది చైతన్య స్ఫూర్తితో 1984లో ప్రచురించిన ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’ సంపుటిలో గులాబీ సౌందర్య సౌకుమార మాధుర్యాలతో, నలిగి పడ్డ అత్తరు త్యాగాలతో ఉపశమింపబడే ఆడవాళ్ళను అంతరంగ వేదన నుండి ‘జ్వలించే గులాబీలు’ అని పునర్నిర్వచించింది రజిత.
వరకట్నపు ఆత్మహత్యలు హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యం అయిన ఈ మూడు దశాబ్దాల స్త్రీల దుఃఖపు జీర రజిత కవిత్వంలో వినబడుతుంది. 2012 డిసెంబర్‌లో ఢిల్లీలో జ్యోతిసింగ్‌పై జరిగిన అత్యాచార ఘటన సందర్భం నుండి ‘అవును మౌనాన్నే మాట్లాడుతున్నాను’ కవిత రాసింది. ‘‘నిత్య గాయాల జ్యోతిలా మం డుతూ/ ఉద్యమ భాషనై మాట్లాడుతున్నాను’’ అనే కవితా పాదాలు రెండు ఆమె తననుతాను ఉద్యమప్రతినిధిగా నిలబడి మాట్లాడటాన్ని సూచి స్తాయి. రుద్రమ ప్రచురణల పక్షాన అత్యాచారాలపై వరంగల్ కవుల నిరసన కవిత్వాన్ని సేకరించి ‘ఉద్విగ్న’ను ప్రచురించింది. 1985 కారంచేడు ఘటన పరిణామంలో తెలుగునాట దళిత అస్తిత్వ ఉద్యమంగా బలపడింది. ‘నేనొక నల్ల మబ్బునవుతా’నంటూ దానితో మమేకతను కవితాముఖంగా ప్రకటించింది రజిత. నలుపును దళిత సంకేతం చేసి ‘నలుపిప్పుడు కోట్లాది బాధితుల చేతుల ఆయుధమై’, నిరసన ప్రకటిస్తున్న వర్తమాన వాస్తవాన్ని చెబుతూ–- ‘‘ఈ నల్లమనుషులే/ కాకిగోలతో మీరు నటించే గాఢనిద్ర నుండి/ లేవగొట్టే దండోరాలవుతారు’’ – అంటూ ‘నలుపంటే భయమెందుకు’ కవితలో అగ్రవర్ణ అహంకారాన్ని సవాల్ చేసింది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ గుణగానం, తెలంగాణ సంస్కృతీ సంకీర్తనం, తెలంగాణలోని విశిష్టవ్యక్తుల ప్రశంస, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఘటనలు రజిత కవిత్వానికి వస్తువైనాయి. అయితే కవితలను ఈ పద్ధతిలో వర్గీకరించి చెప్పటం కూడా కష్టమే. తరచూ అవన్నీ ఒక కవితలోనే కలగలిసి ఉంటాయి. ‘జీవగడ్డగచేయ’, ‘పాట పుట్టిన ఊరు ఉయ్యాలో’, ‘పాట పూచిన’ వంటి కవితలలో ఇది చూడవచ్చు.
మొదటి కవితలో తెలంగాణ భాష ప్రశస్తి, కాకతీయచరిత్ర వైభవం, ప్రాచీన తెలంగాణ కవుల ప్రశస్తి, విప్లవోద్యమ ప్రస్తావన, తెలంగాణ ఉద్యమానికి చాళ్ళు దీసిన జయశంకర్ జనార్దన్, రాములు వంటి వాళ్ళ ప్రశంస, బతుకమ్మ పండుగ ప్రత్యేకత వంటివి కలగలిసి ఉన్నాయి. ‘తల్లీ తెలంగాణమా’, ‘తెలంగాణ మార్చ్’, ‘నరుడా వినరా’, ‘అబ్బబ్బో సర్కారోడా’ వంటి కవితలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వలస విముక్తి ఆశయాన్ని పదేపదే నొక్కి చెప్పాయి. ప్రధానంగా ఇవి 2009 డిసెంబర్ 9న రాష్ట్రం ఇవ్వటానికి అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన సూత్రప్రాయ ప్రకటన ఉపసంహరింపబడిన తరువాత ఉధృతమైన మలి దశ ఉద్యమకాలానికి చెందినవి. ‘అబ్బబ్బో సర్కారోడా’ కవిత- ఇచ్చినమాట తప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహప్రకటన కాగా, ప్రత్యేక తెలంగాణా ఆకాంక్షకున్న ప్రజాబలం ప్రదర్శించటానికి 2011 మార్చ్ 10 న జరిగిన సాగరహార దృశ్యాన్ని కళ్ళ ముందు ఆవిష్కరింప చేసే కవిత ‘తెలంగాణ మార్చ్’. తెలంగాణ ఉద్యమం, మహిళా సమస్యలు, కులపోరాటాలు, ప్రపంచీకరణ ఫలితాల వంటి అనేక ఘనమైన అనుభవాలను దాటి వచ్చాక కవి రజిత మనసు పాత జ్ఞాపకాల్లోకి తొంగి చూసింది. కాలం కాన్వాస్ మీద- తను పుట్టిన ఊరుని- కన్నతండ్రి, వసివాడని మనుషులు, గాయపడిన పాటలు, అమలిన గీతాలతో చిత్రించింది. 2023 లో వచ్చిన రజిత ఆఖరి కవితా సంపుటి ‘కాలం కాన్వాస్ మీద’ ఆమె అంతర్గాన కవితా లోలత్వంతో నిండిపోయింది: ‘‘ఊరంటే ఉట్టి మట్టి కాదు/ మట్టీ! మనిషీ! ఉత్పత్తి!/ ఊరంటే జనజీవన తంత్రం!/ సూర్యునితో కలెదిర్గే శ్రమ యంత్రం!’’ అని ‘ఊరు బంధం’ కవితలో అంటుంది. మనిషిని మనిషి పట్టించుకునే ఆరాటాలు తగ్గిన చోట- ఊరు అటువంటి మానవీయ స్నేహాలను నిలిపి ఉంచుతుందని నమ్మింది రజిత. అందుకే జ్ఞాపకాల పల్లెలో తన బాల్యపు ఉనికికి చోటు లేకపోవడం గురించి వేదన పడుతుంది.
అది సహజమూ, పరిణామ క్రమంలో భాగమూ అని తెలిసినా సరే ఆ మనాది ఆమెని నిలువనియ్యలేదు: ‘‘నా పల్లె జాడ ఏడనో జెప్పుండ్రని/ నోరార్సుకుపోంగ అడుగుతాంది/ కాలుగాలి కాటుగల్సిన పిల్లోలె గాయిరిగాయిరిగా తిరుగుతాంది’’ అంటూ ఇప్పటి ఊర్లలో తనకి కనిపించని గుండె తడిని తల్చుకుని బుగులు పడుతుంది. ‘మా నాన్నే విశాల ప్రపంచం’, ‘మా నాయిన విశ్వమానవుడు’ వంటి కవితల్లో తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన తండ్రిని పదేపదే తల్చుకుంది రజిత. స్వేచ్ఛ, మానవ సంస్కారం, ప్రజాస్వామికత- మొత్తంగా సమాజ సూత్రాలని పరిచయం చేసి స్వేచ్ఛా విహంగంలా తనను వినీలాకాశంలోకి ఎగురవేసిన ‘నాయిన’ ఆమె జీవితంలోనే కాదు, కవిత్వంలోనూ కథా నాయకుడే. సామాజికంలోనూ వ్యక్తిగతంలోనూ రజితకి కవిత్వం ఊరట అయింది, ఓదార్పు అయింది. తన లోపల నిరంతరం జాజ్వల్యమానంగా రగిలే భావోద్వేగాలకి బాసట అయింది. ఆ జ్వాలాముఖ స్వరం శాశ్వతంగా మూగబోయింది, తను పంచిన కవితలను గుర్తులుగా వదిలి.
-కాత్యాయనీ విద్మహే
-కె ఎన్ మల్లీశ్వరి