Nitish Kumar: నితీశ్‌ను కాదనలేని బీజేపీ
ABN , Publish Date - Nov 07 , 2025 | 03:00 AM
బిహార్‌కి మజ్‌బూరి హై, నితీశ్‌కుమార్ జరూరి హై’ బిహార్ నిస్సహాయంగా ఉన్నది, నితీశ్‌కుమార్ నాయకత్వం అవసరం... ఈ ఆకర్షణీయ నినాదాన్ని నేను మొట్టమొదట 2017లో ...
‘బిహార్‌కి మజ్‌బూరి హై, నితీశ్‌కుమార్ జరూరి హై’ (బిహార్ నిస్సహాయంగా ఉన్నది, నితీశ్‌కుమార్ నాయకత్వం అవసరం)... ఈ ఆకర్షణీయ నినాదాన్ని నేను మొట్టమొదట 2017లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వెలుపల విన్నాను. అనూహ్యంగా విన్న ఉద్ఘోష అది. లాలూప్రసాద్ యాదవ్‌తో ఉన్న రాజకీయ అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీలో మళ్లీ చేరేందుకు నితీశ్ నిర్ణయించుకున్న సందర్భమది. బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకే నితీశ్ పార్టీ మారారని మరి చెప్పనవసరం లేదు. మోదీతో ఉన్న పాతస్నేహాన్ని మళ్లీ చిగురింపచేసుకునేందుకే ఆయన ఆ నిర్ణయం తీసుకోలేదు. రాజకీయ సౌలభ్యం కోసమే ఆయన మళ్లీ మోదీతో చేయి కలిపారు. ఇది జరిగి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ పరిస్థితిలో మార్పు ఏమీ లేదు. సరే బీజేపీకి నితీశ్‌బాబు పట్ల ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు. 2013లో ప్రధానమంత్రి పదవికి అవసరమైన అర్హతలు నరేంద్ర మోదీకి లేనేలేవని తొట్టతొలుత నిరసన తెలిపిన నేత నితీశ్‌కుమార్. ఈ విషయాన్ని బీజేపీ మరచిపోయి ఉండదు. అయితే బిహార్‌లో ఎన్డీఏకు సమర్థంగా నేతృత్వం వహించగల నాయకుడు మరొకరు లేరన్న వాస్తవమూ బీజేపీకి బాగా తెలుసు. నితీశ్‌కు ప్రత్యామ్నాయంగా మరెవ్వరూ లేనందునే బీజేపీ ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగనిస్తోంది. వృద్ధాప్యం పైబడిన నేత నితీశ్. వయసు పొద్దు వాలిపోయిన వేళ ఆరోగ్యం సైతం ఆయనకు దూరంగా ఉంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో మోదీయే సర్వం అయిన ఢిల్లీ దర్బార్‌కు విధేయుడుగా ఉండడమే మేలు అని నితీశ్ నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంతో ఆయన నిశ్చింతగా ఉన్నారు. బిహార్ రాజకీయాలలో షేక్‌స్పియర్ విషాద నాటకం తరహాలో ఒక నాటకం సుదీర్ఘకాలంగా ప్రదర్శితమవుతోంది. మండల్ ఉద్యమంతో ఈ విషాద ప్రహసనం ప్రాంభమయింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ఆ సుదీర్ఘ నాటకంలో చివరి అంకంగా చెప్పవచ్చు.
మూడున్నర దశాబ్దాల క్రితం మండల్ ఉద్యమంతో ప్రభవించిన నాయకద్వయం లాలూప్రసాద్ యాదవ్, నితీశ్‌కుమార్. ‘బ్రదర్స్ బిహారీ’గా సుప్రసిద్ధమయ్యారు. అయితే పరస్పరం పూర్తిగా భిన్నమైనవారు. తొలి జనప్రియ నాయకుడుగా అధికార అందలాలు ఎక్కిన లాలూప్రసాద్ యాదవ్ ఇప్పుడు శారీరకంగా బలహీనుడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతున్న అనారోగ్యగ్రస్తుడు. పార్టీ బాధ్యతలను పూర్తిగా కుమారుడు తేజస్వి యాదవ్‌కు అప్పగించారు. తేజస్వి నవతరం నాయకుడు. అయితే తండ్రిలో ఉన్న జన సమ్మోహన శక్తి ఈ యువనేతలో కానరాదు. 1970 దశకంలో జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో జరిగిన విద్యార్థి యువజన ఉద్యమం నుంచి ప్రభవించిన నాగరీక నాయకుడు నితీశ్‌కుమార్. ఈయనా ఇప్పుడు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. శరీరాని కంటే మానసిక సామర్థ్యాలను కుంగదీస్తున్న అనారోగ్యమది. బారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీయే సర్వోన్నత నాయకుడు. మోదీ మాటే తుది మాట. అయితే సమస్త బిహార్ ప్రజలను సమరీతిలో ఆకట్టుకోగల సమర్థ నాయకత్వం బిహార్‌లో బీజేపీకి లేదు. భారత జాతీయ కాంగ్రెస్ శక్తియుక్తులను కాలం హరించివేసింది. ఇప్పుడు ఈ పార్టీ దాదాపు అచేతన స్థితిలో ఉన్నది. ఇక యువ నాయకుడు ప్రశాంత్ కిశోర్ బిహారీలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు, సందేహం లేదు. అయితే కులమే నిర్ణయాత్మక అంశంగా ఉన్న బిహార్ రాజకీయాలలో ఈ యువనేత జయపతాక ఎగురవేయగలడా? సంప్రదాయ అధికార నిర్మాణాలు, సామాజిక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఈ కొత్త నేత బిహార్ సమాజంలో మౌలిక మార్పులు తీసుకువస్తానని వాగ్దానం చేస్తున్నారు. బిహార్ ఓటర్లలో అత్యధికులు సైతం మౌలిక మార్పులు కోరుకుంటున్నారు. మరి ప్రశాంత్ కిశోర్ నాయకత్వంలోని జన్ సురాజ్ పార్టీకి వారు ఓటు వేస్తారా? ఇప్పుడు మళ్లీ నితీశ్‌కుమార్ విషయానికి వద్దాం. బిహార్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడంలో నితీశ్ రికార్డు సృష్టించారు. ఇప్పటికి మొత్తం తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాజకీయ అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ స్వర్ణపతకాన్ని అందుకోవడానికి ఆయన అందరికంటే బాగా ముందంజలో ఉన్నారు మరి. అనేక పరిమితులు ఉన్నప్పటికీ బిహార్‌కు ఆయన నాయకత్వం తప్పనిసరి అని పలువురు, ముఖ్యంగా బీజేపీ భావిస్తోంది.
ఐదు సంవత్సరాల క్రితం కొత్త తరం బిహారీ రాజకీయ నాయకుడు చిరాగ్ పాశ్వాన్‌ను ప్రోత్సహించడం ద్వారా నితీశ్ స్థాయిని తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నించింది నితీశ్ ప్రాధాన్యాన్ని తగ్గించడం ద్వారా జనతాదళ్ (యునైటెడ్) పార్టీ ఓటర్లను తనవైపు తిప్పుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడ. ఈ వ్యూహం దాదాపుగా ఫలించింది. గత శాసనసభ ఎన్నికల్లో జనతాదళ్(యు) కేవలం 43 సీట్లు మాత్రమే కైవసం చేసుకోగా బీజేపీ 74 నియోజకవర్గాలలో జయపతాక నెగురవేసింది. బీజేపీ, జనతాదళ్(యు) మధ్య అధికార సమతౌల్యత జాతీయ రాజకీయ పక్షానికే అనుకూలంగా మారింది. అయినప్పటికీ నితీశ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేందుకు బీజేపీ సంకోచించింది. తమ సొంత అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేసేందుకు సుముఖత చూపలేదు. నితీశ్‌కుమార్ అపరచాణక్యుడు. బీజేపీ ఎత్తుగడలను అర్థం చేసుకున్నారు. ఆ పార్టీతో పొత్తును కొనసాగించడం ప్రమాదకరమని భావించారు. మహారాష్ట్రలో శివసేనను నిలువునా చీల్చివేసిన రీతిలో బిహార్‌లో తన పార్టీని బీజేపీ చీల్చకుండా ఉంటుందా అని నితీశ్ ఆలోచించారు. సంభావ్య పర్యవసానాల గురించి భయపడ్డారు. 2022లో బీజేపీతో తెగతెంపులు చేసుకుని ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో చేరారు. అయితే జాతీయ స్థాయిలో అగ్రగామి నాయకుడుగా ఎదగాలన్న తన ఆకాంక్ష నెరవేరేందుకు ఇండియా కూటమి సహకరించదనే భావన ఆయన మనసును తొలిచివేసింది. దీంతో గత సార్వత్రక ఎన్నికల సందర్భంగా ఒక శుభ దినాన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరారు. ప్రజా జీవితంలో నైతిక విలువలకు నిబద్ధమైన నేతగా పేరుపొందిన నితీశ్‌కుమార్ ఇప్పుడు తన రాజకీయ మనుగడను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టారు. సైద్ధాంతిక విశ్వాసాల స్థానంలో అవకాశవాద రాజకీయాలు ప్రబలిపోయాయి. ఒకప్పుడు ‘నయా’ బిహార్‌కు సగర్వంగా సారథ్యం వహించిన నితీశ్‌కుమార్ ఇప్పుడు బీజేపీ ‘చక్రవ్యూహం’లో చిక్కుకున్నారు. పలు ఇతర రాష్ట్రాలలో తమ మిత్రపక్షాలను బీజేపీ శాసిస్తోంది. తన నిర్ణయాలను ఆ పార్టీలపై రుద్దుతోంది. ఆ మిత్రపక్షాల నాయకులను బహిరంగంగా చిన్నబుచ్చుతోంది. అయితే బిహార్‌లో సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ జోలికి ఏ విధంగానూ పోయేందుకు బీజేపీ సాహసించడంలేదు. బహిరంగంగాను, అంతర్గతంగాను సీనియర్ నాయకుడుగా ఆయన్ని గౌరవిస్తోంది. ఇతర హిందీ రాష్ట్రాలలో వలే బిహార్‌లో విశ్వసనీయమైన వెనుకబడినవర్గాల నాయకత్వాన్ని పెంపొందించుకోవడంలో బీజేపీ బాగా వెనుకబడిపోయింది బిహార్‌లోని బీజేపీ శ్రేణుల్లో పాతకాలం నాటి అగ్రకులాల ఆధిపత్యం ఇప్పటికీ బలీయంగా ఉన్నది. 2015లో బీజేపీ బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో సొంతంగా అన్ని స్థానాలకూ పోటీ చేసింది. మోదీ హవా ఉధృతంగా ఉన్న ఆ కాలంలో కూడా బీజేపీ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేకపోయింది. లాలూ–నితీశ్‌ల సంయుక్త నాయకత్వం బీజేపీ పురోగతిని పూర్తిగా నియంత్రించింది. 2024 సార్వత్రక ఎన్నికలలో సొంతంగా మెజారిటీ సాధించలేకపోవడంతో నితీశ్‌కుమార్‌ను బీజేపీ ఏమీ చేయలేకపోతోంది. సంకీర్ణ రాజకీయ ధర్మాన్ని అనుసరిస్తోంది.
తనకు మద్దతునిచ్చిన ప్రతి పార్టీ పట్ల సానుకూల వైఖరితో వ్యవహరించడాన్ని బీజేపీ అలవరచుకున్నది. 2029 సార్వత్రక ఎన్నికలకు ఇంకా వ్యవధి ఉన్నప్పటికీ ప్రస్తుత దశలో నితీశ్‌ను తొలగించడం తమ భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదని బీజేపీ భావిస్తోంది. నితీశ్‌కుమార్ ప్రాభవ ప్రభావాలను ఎంతగా తగ్గించినప్పటికీ ఆయన గెలుచుకోగల ఓట్ల వాటా చాలా అత్యధికంగా ఉంటుందన్న వాస్తవాన్ని బీజేపీ అర్థం చేసుకున్నది. పోటీ కూటమి రాజకీయాలు ప్రబలంగా ఉండే బిహార్ లాంటి రాష్ట్రంలో స్వల్పస్థాయి ఓట్ల వాటా సైతం అంతిమ విజయంలో నిర్ణయాత్మక పాత్ర వహిస్తుంది. 2020 అసెంబ్లీ ఎన్నికలలో జనతాదళ్ ఓట్ల వాటా 15 శాతంగా ఉన్నది. నితీశ్ మళ్లీ అధికారానికి రావడానికి ఇది విశేషంగా తోడ్పడింది. 2005 నుంచి ప్రతి ఎన్నికల్లోను రెండు వర్గాలు నితీశ్‌కు పూర్తి మద్దతునిస్తున్నాయి. మహిళలు, బాగా వెనుకబడిన కులాలవారు నితీశ్‌కు ఎటువంటి మినహాయింపు లేని మద్దతునిస్తున్నారు. మహిళా ఓటర్ల శక్తిని జాతీయ రాజకీయ పక్షాలు కనుగొనక ముందే నితీశ్‌కుమార్ మహిళా ఓటర్ల ఆదరాభిమానాలను ఇతోధికంగా చూరగొన్నారు. మృదుభాషి, అంతర్ముఖుడు అయిన నితీశ్ తన ప్రత్యర్థిగా మారిన స్నేహితుడు, పల్లెటూరి మనిషిలా వ్యవహరించే లాలూప్రసాద్‌కు పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఈ కారణంగానే మహిళా ఓటర్లను నితీశ్ ఆకట్టుకున్నారు. అచంచలమైన కుల సంబంధిత విధేయతలతో పాటు మహిళా ఓటర్ల మద్దతు నితీశ్ విజయాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి 2005లో నితీశ్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చదువుకుంటున్న బాలికలు అందరికీ ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. ఆనాడు లబ్ధి పొందిన బాలికలు ఇప్పుడు వయోజన ఓటర్లుగా ఉన్నారు. ఆ మహిళా ఓటర్లే నితీశ్ నాయకత్వానికి, అధికార ప్రాభవానికి వెన్నుదన్నుగా ఉన్నారనడం సత్యదూరం కాదు. ఈ కారణంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నితీశ్‌ను తన పక్షాన ఉంచుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తనను వ్యతిరేకించిన వారిని క్షమించే అలవాటు లేని మోదీ, ఒకప్పుడు నితీశ్ తనను తీవ్రంగా వ్యతిరేకించారన్న వాస్తవాన్ని పూర్తిగా విస్మరించారు. బిహార్‌లో బీజేపీ ఎదుగుదలకు నితీశ్‌తో పొత్తు తప్పనిసరి అని ప్రధానమంత్రి గ్రహించారు. అయితే జనతాదళ్(యు)లోకి బీజేపీ శ్రేణులు క్రమంగా చొరబడుతున్న దృష్ట్యా సమీప భవిష్యత్తులో బిహార్‌లో కూడా ఏక్‌నాథ్ షిండే లాంటి తిరుగుబాటు సంభవించే అవకాశం లేకపోలేదు. అయినా ప్రస్తుతానికి మాత్రం బీజేపీ ఎన్నికల విజయాలకు నితీశ్‌కుమార్ ఆవశ్యకత అమితంగా ఉన్నది. ఆయనను ‘మార్గదర్శక్’ విశ్రాంత జీవితంలోకి పంపే యోచన బీజేపీ చేయబోదనే చెప్పవచ్చు.
-రాజ్‌దీప్ సర్దేశాయి