Share News

Revenue Officer Bribe: జనన మరణాలు సరిగా నమోదు చేస్తున్నారా

ABN , Publish Date - May 31 , 2025 | 12:45 AM

హైదరాబాద్‌లో మరణించిన మహిళ మరణ ధృవపత్రం కోసం లంచం డిమాండ్ చేసిన తహశీల్దారు ఏసీబీకి దొరికారు. జనన, మరణాలను సక్రమంగా నమోదు చేయకపోతే ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Revenue Officer Bribe: జనన మరణాలు సరిగా నమోదు చేస్తున్నారా

టీవల ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం తహశీల్దార్, దొడ్డవరం గ్రామ రెవెన్యూ అధికారి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీనికి కారణం... ఫిర్యాదుదారు భార్య ఆరు నెలల క్రితం హైదరాబాద్‌లో ఒక ఆసుపత్రిలో బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించడంతో ఆమె మరణ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేయగా రెవెన్యూ అధికారులు లంచం డిమాండ్ చేశారు. జనన, మరణాల నమోదు చట్టం ప్రకారం దేశంలో జరిగిన అన్ని జనన, మరణాలు తప్పక నమోదు కావాలి. బ్రిటీష్ కాలంలో వీటిని గ్రామ మునసబు నమోదు చేసేవారు. చిన్న గ్రామాలు మినహా మేజర్ పంచాయితీలు, మున్సిపాలిటీల్లో జనన, మరణాలను పంచాయితీ, మున్సిపల్ అధికారులు వారి పరిధిలో నమోదు చేస్తారు. 2001 నుంచి చిన్న గ్రామాల్లో కూడా జనన, మరణాల నమోదును రెవెన్యూ శాఖ నుంచి తప్పించి, పంచాయితీలకు అప్పగించారు. ప్రస్తుతం జనన, మరణాలు పంచాయితీ కార్యదర్శి చేస్తున్నారు. పిల్లలు బడిలో చేరినపుడు, ఉద్యోగాలు, పాస్‌పోర్టుల కోసం జనన ధృవపత్రాలు అత్యవసరం. అలాగే వారసత్వపు ఆస్తి హక్కులు, బ్యాంకు లావాదేవీలకు మరణ ధృవపత్రం అత్యవసరం. వీటిని సకాలంలో నమోదు చేయించుకోకపోతే, వారసులు ఆ ధృవపత్రాలు పొందడానికి భగీరథ ప్రయత్నం చేయాల్సిందే. జనన, మరణాలు చట్ట ప్రకారం వీటిని 10 రోజుల్లో తప్పక నమోదు చేయించాలి. లేటు ఫీజుతో సంవత్సరం లోపు అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి సర్టిఫికెట్‌తో తహశీల్దార్ (ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో) నమోదుకు ఉత్తర్వులు ఇస్తారు. సంవత్సరం దాటిన జనన, మరణాల నమోదు విషయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో) విచారణ చేసి, నమోదుకు ఉత్తర్వులు ఇస్తారు. వాటిని అనుసరించి, సంబంధిత పంచాయితీలు/ మున్సిపాలిటీల్లో ఆలస్యం నమోదు చేసి, ధృవపత్రం జారీ చేస్తారు.


జననం జరిగినపుడు బిడ్డకు పేరు పెట్టడం మనదేశంలో ఆచారం కాదు. కొన్నాళ్ల తరువాత మంచి రోజున ఒక కార్యక్రమం జరిపి, పేర్లు పెడతారు. అప్పుడు ఆ పేరును సంబంధిత పంచాయితీ/మున్సిపల్ అధికారులకు తెలియపరచాలి. అదే అమెరికా వంటి దేశాల్లో అయితే బిడ్డ పుట్టిన గంటలోపు అధికారులు పేరుతో సహా నమోదు చేస్తారు. ఒక్కోసారి ప్రయాణంలో ఉండగా గర్భిణీకి పురిటి నొప్పులు వస్తే బస్సును పక్కకు ఆపి ఆమెకు ప్రసవం చేయించినట్లు వార్తల్లో చూస్తుంటాం. అటువంటప్పుడు బస్సును ఎక్కడైతే ప్రసవం కోసం ఆపారో ఆ గ్రామంలోనే జననాన్ని నమోదు చేయాలి. జనన, మరణాలు సంభవించిన గ్రామ/మున్సిపాలిటీ పరిధిలోనే నమోదు కావాలి. కానీ చాలా సందర్భాల్లో పట్టణంలో ఆసుపత్రిలో జన్మించినా, స్వగ్రామంలోనే నమోదు చేయిస్తుంటారు. పట్టణాల్లో ఆసుపత్రిలో మరణించినా గ్రామానికి తీసుకొచ్చి దహన కార్యక్రమాలు జరిపి, శాశ్వత గ్రామ నివాసి కాబట్టి, పంచాయతీ అధికారులపై ఒత్తిడి చేసి, అక్కడే నమోదు చేయిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఆసుపత్రిలో జనన, మరణాలు జరిగినపుడు ఆ యాజమాన్యం రెండురోజుల్లో సంబంధిత పంచాయితీ/మున్సిపల్ అధికారులకు తెలియపరచాలి. అలాగే ఆ వివరాలను తప్పులేకుండా పంపాలి. కానీ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఆ జనన, మరణాల వివరాలను సక్రమంగా పంపడం లేదు. ఆన్‌లైన్ సదుపాయాలు వచ్చినా నిర్లక్ష్యం వహిస్తునే ఉన్నారు. అలాగే వ్యక్తులు కూడా తమ కుటుంబంలో జనన, మరణాలు జరిగినపుడు ఆ వివరాలను తప్పులు లేకుండా ఇవ్వడం వల్ల భవిష్యత్‌లో ఏ విధమైన సమస్య లేకుండా ధృవీకరణ పత్రాలు పొందగలుగుతారు.


ఇప్పుడు లంచం తీసుకుంటూ దొరికిన తహశీల్దారు ఎక్కడో హైదరాబాద్‌లో జరిగిన మరణాన్ని వారి స్వగ్రామంలో నమోదు చేయడం తప్పు, చట్టరీత్యా నేరం. హైదరాబాదులో వైద్యం అందించిన ఆసుపత్రి వారు ఆ నమోదును అక్కడి మున్సిపల్ అధికారులకు తెలియపరచకపోవడం చట్టపరంగా కూడా శిక్షార్హమే. ఆసుపత్రి యాజమాన్యం లేటుగానైనా హైదరాబాద్ మున్సిపల్ అధికారులకు ఆమె చనిపోయిన వాస్తవ తేదీని పేర్కొంటూ నివేదిక పంపాలి. భారతదేశంలో జనన, మరణాలు సకాలంలో నమోదు కానందున సంబంధీకులు చాలా కష్టనష్టాలకు లోనవుతున్నారు. గిరిజన ప్రాంతాల ప్రజలయితే తమ బిడ్డల జనన ధృవపత్రాలు లేక చదువులు మధ్యలోనే ఆపేసే పరిస్థితి. గిరిజన సమీకృతాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు మరింత శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఈ జనన, మరణాల నమోదు గురించి మహిళా సంఘాలు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఎన్ఆర్జీఎస్ కూలీలకు, గ్రామపంచాయితీ సభ్యులకు ప్రభుత్వాలు విస్తృత అవగాహన కల్పించాలి. వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులకు కళాశాలలో ఉండగానే వీటిపై స్పష్టమైన అవగాహన కల్పించాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా తమ సభ్యులకు జనన, మరణాల నమోదు నైతిక, చట్టపరమైన బాధ్యత అని తెలియజేయాలి. అప్పుడే ఈ గడ్డమీద జరిగిన ప్రతీ జననం, మరణం సక్రమంగా నమోదవుతాయి. తద్వారా జనన, మరణ ధృవపత్రాలు తప్పులు లేకుండా సకాలంలో ప్రజలు పొందగలుగుతారు.

-మారిశెట్టి జితేంద్ర

స్పెషల్ గ్రేడ్ డిప్యుటీ కలెక్టర్(రిటైర్డ్)

Updated Date - May 31 , 2025 | 12:46 AM