Share News

Bird of Spring: లోపలి వేడుక

ABN , Publish Date - Dec 22 , 2025 | 04:34 AM

ఆకు రాలిన అడవికి వసంతం ఓ పిట్టను ఇచ్చింది రంగుల పిట్ట కూతకు చెట్లు రెండు వయసును మరిచాయి..

Bird of Spring: లోపలి వేడుక

ఆకు రాలిన అడవికి

వసంతం ఓ పిట్టను ఇచ్చింది

రంగుల పిట్ట కూతకు

చెట్లు రెండు

వయసును మరిచాయి

చిట్టి రెక్కల స్పర్శకు

జంట తరువుల ఏకాకితనం

శాపవిమోచనం పొందింది

సడి లేని గూటిలో

రెండు మువ్వలు దొర్లిన సమయం

వెన్నెల పూచిన కాలం

చిట్టి పులుగు అల్లరికి

కొమ్మలు నిండా పూల పరిమళం

పాల పళ్ళు నవ్విన మేర

సీతాకోకల హల్లీసకమే

జ్ఞానం కొలువయిన పర్ణశాలలో

ఓ తేట కాంతి పారాడుతోంది

పుస్తకాల దొంతరల నడుమ

బొట్టు బిళ్ళ దారిచేసుకుని

బొమ్మల్ని దాచేస్తోంది

తిరిగొచ్చిన అమ్మకు

ప్రాణాలు రెండు

మురిపెంగా బుగ్గన చుక్కగా

మళ్ళీ మళ్ళీ అమరిపోతున్నాయి

పొట్టి గౌను అల్లరి

కథలో ఒదుగుతుందా

కవిత్వంలో నిలుస్తుందా.

తెలుగు వెంకటేష్

99853 25362

Updated Date - Dec 22 , 2025 | 04:36 AM