Share News

Environmental Awareness: విధ్వంసాన్ని ఆపకపోతే వినాశనమే

ABN , Publish Date - May 22 , 2025 | 06:03 AM

పారిశ్రామిక అవసరాల కోసం ప్రకృతిని నిర్వాకం చేయడం వల్ల భూమి తాపం, జీవజాతుల అంతరింపును ఎదుర్కొంటోంది. ఈ సమస్యలకు పరిష్కారం స్థిరమైన అభివృద్ధి, ప్రకృతితో సామరస్యమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 Environmental Awareness: విధ్వంసాన్ని ఆపకపోతే వినాశనమే

ప్రకృతి వనరులను కేవలం పారిశ్రామిక అవసరాలు తీర్చే వ్యాపార వస్తువులుగా చూసే అభివృద్ధి చెందిన దేశాల అహంకారపూరిత వైఖరే నేడు భూమ్మీద సకల జీవరాశి ఎదుర్కొంటున్న సమస్త సంక్షోభాలకూ కారణం. నిత్యం పరిశ్రమల నుంచి వెలువడుతున్న కర్బన ఉద్గారాలు, ఇతర వ్యర్థాల కారణంగా వాతావరణం నానాటికీ వేడెక్కుతోంది. భూమ్మీద జీవరాశుల మనుగడ కష్టమవుతోంది. ‘ప్రకృతితో సామరస్యం, స్థిరమైన అభివృద్ధి’ అనే థీమ్‌తో ఈ ఏడాది ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితి కోరింది. మానవ చర్యల కారణంగా వేగంగా అంతరించిపోతున్న అనేక జీవజాతుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయా దేశాలకు సూచించింది. పెరుగుతున్న కాలుష్యం, రెట్టింపవుతున్న భూతాపం, సహజ వనరుల క్షీణత, విచ్ఛిన్నమవుతున్న ఓజోన్‌ పొర వంటి సమస్యల వల్ల కోట్లాది జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ‍ఈ పరిస్థితిని మార్చేందుకు 1972లో స్టాక్‌హోం సదస్సు, 1997లో జపాన్‌లోని క్యోటో వాతావరణ సదస్సుల్లో అనేక తీర్మానాలను ప్రవేశపెట్టారు. పెరుగుతున్న భూతాపం వల్ల ప్రతి సంవత్సరం ఎన్నో వేల జీవజాతులు అంతరించిపోతున్నాయని జీవవైవిధ్య పితామహుడు, అమెరికా ప్రఖ్యాత శాస్ర్తవేత్త ఎడ్వర్డ్‌. ఒ. విల్సన్‌ హెచ్చరిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న 30 సంవత్సరాలలో 20 శాతం జీవజాతులు పూర్తిగా అంతరించి పోతాయని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 24 శాతం క్షీరదజాతులు, 12 శాతం పక్షిజాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. జన్యు పంటలు సగానికిపైగా కనబడకుండా పోయాయి. పగడపు దిబ్బలు ఇప్పటికే 75 శాతం పైగా ధ్వంసమై పోయాయి. రానున్న 20 సంవత్సరాల్లో ప్రస్తుతమున్న 620 రకాల వానర జాతుల్లో 120కి పైగా జాతులు అంతరించిపోయే ప్రమాదముందని జీవ శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు.


ఏటా రెండు బిలియన్‌ టన్నుల కార్బన్‌డై ఆక్సైడ్‌ను శోషించుకునే సమశీతోష్ణ మండలాల్లోని సతత హరితారణ్యాలతో పాటు, సుమారు 12 లక్షల హెక్టార్ల ఇతర అడవులు గడచిన దశాబ్ద కాలంలో నరికివేతకు గురయ్యాయని అంచనా. ప్రపంచ జీవవైవిధ్యంలో మన దేశం 8శాతం వాటాతో 7వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశంలో వేలాది జీవజాతులు మనుగడ కోల్పోతున్నాయని ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ సైన్సు పాలసీ ప్లాట్‌ఫాం’ అనే అధ్యయన సంస్థ తెలిపింది. ఈ పరిస్థితిని మార్చేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని సూచించింది. పరిమితమైన వనరులను వినియోగించుకుని, అపరిమితమైన ఆర్థికవృద్ధిని సాధించే దిశగా పారిశ్రామిక దేశాలు ఆలోచన చేయాల్సిన సమయమిది. అప్పుడు మాత్రమే సహజవనరులపై ఒత్తిడి తగ్గి, కోల్పోయిన జీవావరణాన్ని తిరిగి పునరుద్ధరించగలిగే అవకాశం ఉంటుంది. లేకపోతే కోట్లాది జీవులకు అమ్మగా భావించే భూమాత మరుభూమిగా మారిపోతుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అదే జరిగితే మనిషి తన మరణ శాసనం తాను రాసుకున్నట్టే.

– డాక్టర్‌ కె. శశిధర్‌

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం

(నేడు ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం)

Updated Date - May 22 , 2025 | 06:05 AM