Share News

Dandakaranya Faces the Mining Threat: బయో ఎకానమీ హిడ్మా

ABN , Publish Date - Nov 29 , 2025 | 01:59 AM

బ్రెజిల్‌లో దట్టమైన అమెజాన్ నదీ ప్రారంభంలో ఉండే బెలెమ్‌ నగరంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–30 పేరిట నవంబర్ 6 21 తేదీల్లో అంతర్జాతీయ వాతావరణ మార్పు సమావేశాన్ని నిర్వహించారు....

Dandakaranya Faces the Mining Threat: బయో ఎకానమీ హిడ్మా

బ్రెజిల్‌లో దట్టమైన అమెజాన్ నదీ ప్రారంభంలో ఉండే బెలెమ్‌ నగరంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–30 పేరిట నవంబర్ 6–21 తేదీల్లో అంతర్జాతీయ వాతావరణ మార్పు సమావేశాన్ని నిర్వహించారు. అరణ్య ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీల జీవన ఉపాధిని పెంచడానికీ, అమెజాన్ అరణ్యాన్ని మరింత వైవిధ్యంతో, ఉత్పాదకంగా మార్చడానికీ బ్రెజిల్ దేశం కృషి చేస్తోంది. వేడిని, కాలుష్యాన్ని పెంచే గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల చేసే మైనింగ్, ఇతర పరిశ్రమలపై ఎక్కువగా ఆధారపడకుండా, నూతన నమూనా బయో ఎకానమీ అభివృద్ధిని బ్రెజిల్ చేపడుతున్నది. చెట్ల నరికివేతను, మైనింగ్‌ను తగ్గించింది. అనేక హెర్బల్ మొక్కలను గుర్తించి, వాటి సాగును పెంచింది. ఆరోగ్య, సౌందర్య, సుగంధ ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నది. ఫలితంగా మూలవాసుల వలసలు తగ్గిపోయాయి. అమెరికా ఖండానికి అమెజాన్ అడవులు ఊపిరితిత్తులు అనే ఎరుకతో బ్రెజిల్ బయో ఎకానమీని ప్రోత్సహిస్తున్నది.

మన దేశంలో 2024లోను, ఇప్పుడు 2025లోను కూడా తీవ్ర వాతావరణ పరిస్థితులు నమోదు అయ్యాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సంస్థ ఇండియా క్లైమేట్–2025 నివేదిక ప్రకారం దేశంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్న రోజులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎండ, వడగాలుల వలన అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది కూలీల, వీధి వ్యాపారుల జీవనం ఇబ్బందులకు గురవుతున్నది. 60శాతం మంది ఆదాయాన్ని కోల్పోతున్నారు. వడదెబ్బ, గుండెపోటు, వాంతులు, వడలిపోవటం వంటి అనారోగ్యాలకు లోనవుతున్నారు. పొలాల్లో పనిచేసేవారు సాధారణ సింథటిక్ దుస్తులు ధరించడం వలన చెమటతో బాక్టీరియల్, ఫంగల్ చర్మవ్యాధులకు లోనవుతున్నారు. ఫ్యాక్టరీలో పనిచేసేవారికి వెంటిలేషన్ లేక, యంత్రాలు విడుదల చేసే వేడికి రోగాలపాలవుతున్నారు. ఆదాయాలు తగ్గి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. వారు నివసించే చిన్న చిన్న షెడ్ల లాంటి ఇళ్లలో ఫ్యాన్లు పెట్టుకునే స్తోమత ఉండదు. కూలర్, ఏసీ ఊహకందని లగ్జరీ. అధిక వేడితోపాటు, అధిక వర్షాల వలన కోట్లాది ఎకరాలలో పంట నష్టం, వరదల వలన ఇండ్లు కూలిపోవడం ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని నివేదిక పేర్కొంది.


లక్ష చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణలను ఆనుకుని ఉన్న దండకారణ్యం భారతదేశానికి అమెజాన్ లాంటిదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి అడవులు దేశ కార్బన్ ఉద్గారాలను స్వీకరించి ప్రకృతిని శుభ్రం చేస్తున్నాయి. కానీ ఇది ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ ప్రాంతంలో అదానీ, వేదాంత, లాయిడ్, ఆర్య, అభినవ్, జిందాల్ వంటి కార్పొరేట్స్ తవ్వకాలు ప్రారంభించాయి. ఈ ప్రాంతంలో గత రెండువందల సంవత్సరాల నుండి జల్ జంగల్ జమీన్ కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. తమ అడవిని, తమ జీవితాన్ని, ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ, నిలువ నీడ లేకుండా చేస్తున్న మైనింగ్‌ను స్థానికులు మొదటి నుండీ ప్రతిఘటిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా మరింత తెగువతో నక్సలైట్ల నాయకత్వంలో సంఘటితమై సాయుధంగా పోరాడుతున్నారు.

ఆదివాసీ యోధుడు మడావి హిడ్మా మరణం తర్వాత దేశం అతని పోరాట లక్ష్యాన్ని అర్థం చేసుకుంటున్నది. ఇప్పుడు బ్రెజిల్ అనుసరిస్తున్న బయో ఎకానమిని గత 30 సంవత్సరాలుగా తమ ప్రాబల్యంలో ఉన్న దండకారణ్యంలో హిడ్మా నేతృత్వంలో మావోయిస్టు పార్టీ అమలుచేస్తున్నది. కానీ ఇప్పుడు జన జీవితాన్ని కాలుష్యం కోరల్లోకి నెట్టివేసే కార్పొరేట్ మైనింగ్ కోసం విప్లవకారులను ప్రభుత్వం అణచివేస్తున్నది. నవంబర్ 22న దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్‌లో నిర్వహించిన జి–20 సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ‘‘భవిష్యత్ తరాల కోసం సుస్థిర పర్యావరణ సమతుల్య జీవన మార్గం ఆచరణ కోసం ప్రపంచ సాంప్రదాయ జ్ఞాన నిధిని నెలకొల్పాలి’’ అని సూచించారు. కానీ ఆచరణలో ఈ జ్ఞానాన్ని పుష్కలంగా కలిగి ఉన్న భారత్‌ను కాపాడుతున్న ఆదివాసీ ఉద్యమాల నేతలపై అణచివేతకు పాల్పడుతున్నారు.

ప్రజలలో అసంతృప్తి మరింత రాజుకోక ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని, రాజ్యాంగం అందించిన జీవించే హక్కును విస్తృతార్థంలో అమలుచేయాలి. కార్పొరేట్లను నియంత్రించి ప్రభుత్వ పాలనలో వారి ప్రమేయం లేకుండా చేయాలి. పౌర సమాజం నిత్య అప్రమత్తతతో, ప్రజాస్వామిక పోరాట రూపాలతో పర్యావరణ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. కాలుష్య నియంత్రణలో చైనా విధానం, జీవ ఆర్థిక వ్యవస్థలో బ్రెజిల్ విధానం మనకు ఆదర్శం కావాలి.

-అస్నాల శ్రీనివాస్

దొడ్డి కొమురయ్య ఫౌండేషన్

Updated Date - Nov 29 , 2025 | 01:59 AM