Share News

Bihar: కులమతాల ఉచ్చుల్లో విఫల రాష్ట్రం

ABN , Publish Date - Nov 01 , 2025 | 06:29 AM

బిహార్‌ గురించి మాట్లాడడమూ లేదా రాయడమూ బాధాకరమైన విషయమే. స్వతంత్ర భారతదేశంలో బిహార్‌ కథ సంపూర్ణ నిర్లక్ష్యం, వ్యర్థ ప్రగల్భాల చరిత్రే. 1947లో భారతదేశ సమస్త రాష్ట్రాలు ఒకే ప్రారంభ స్థానంలో ఉన్నాయి.

Bihar: కులమతాల ఉచ్చుల్లో విఫల రాష్ట్రం

బిహార్‌ గురించి మాట్లాడడమూ లేదా రాయడమూ బాధాకరమైన విషయమే. స్వతంత్ర భారతదేశంలో బిహార్‌ కథ సంపూర్ణ నిర్లక్ష్యం, వ్యర్థ ప్రగల్భాల చరిత్రే. 1947లో భారతదేశ సమస్త రాష్ట్రాలు ఒకే ప్రారంభ స్థానంలో ఉన్నాయి. స్వాతంత్ర్య వేళ, లేదా భారత గణతంత్ర రాజ్యం ప్రభవించిన పొద్దులో తమను వెనుకనే వదిలివేసి స్వతంత్ర దేశం ముందుకు సాగిపోయిందని ఏ రాష్ట్రమూ చెప్పదు, చెప్పలేదు. నాడు కేంద్రంలోనూ, దాదాపుగా అన్ని రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీయే కనుక దేశవ్యాప్తంగా ఎల్లెడలా ఒకే విధానాలు, కార్యక్రమాలు అమలయ్యాయి. నిజానికి కొన్ని ప్రగతిశీల భావాలను తొలుత బిహార్‌లోనే ప్రయోగాత్మకంగా అమలుపరిచారు. అవి అక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి. భూ సంస్కరణలు, భూముల పంపిణీ అందుకు ఉదాహరణలు. ప్రజాహితాన్ని ఔదలదాల్చిన నాయకులు బిహార్‌లో ఉండేవారు. సుపరిపాలనను సమర్థంగా అందించిన పాలనా వ్యవస్థ, దీక్షాదక్షతలతో తమ విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించిన సివిల్‌ సర్వెంట్లూ ఉండేవారు. దేశంలోనే మహా సస్యశ్యామల క్షేత్రాలు బిహార్‌లో ఉండేవి. ఆరు రుతువుల్లోనూ నిండుగా ప్రవహించే జీవనది గంగమ్మ చెంతనే ఉన్నది. సహజ వనరులు అపారం. భారత్‌లో తొలి ఉక్కు కర్మాగారాలు అవిభక్త బిహార్‌లోనే ప్రారంభమయ్యాయి. దేశంలోని నాలుగు ప్రముఖ హైకోర్టుల్లో ఒకటి పట్నాలో ఉండేది. దృఢమైన న్యాయవ్యవస్థ వర్ధిల్లేది. మరి బిహార్ ఎందుకు విఫలమయింది? బిహార్‌పై అధికారిక సమాచారం మహా నిరుత్సాహం కలిగిస్తుంది. వాస్తవ పరిస్థితులు అంతకంటే అధ్వానమైనవని పరిశీలకులు ఘంటాపథంగా చెప్పుతారు. ఈ శోచనీయ పరిస్థితులకు ప్రతి ప్రభుత్వమూ నిందార్హమైనదే. నితీశ్‌కుమార్‌ నవంబర్‌ 24, 2005 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. (మధ్యలో 278 రోజులు మినహా. ఆ స్వల్పకాలిక ముఖ్యమంత్రిని నితీశ్‌ స్వయంగా ఎంపిక చేశాడు). అంటే నితీశ్‌ 20 సంవత్సరాల పాటు బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తరువాత సుదీర్ఘకాలం పాలించిన నేత లాలూప్రసాద్‌ యాదవ్‌ (లేదా ఆయన సతీమణి) 1990 నుంచి 2005 దాకా బిహార్‌లో లాలూ పాలన నడిచింది. 35 సంవత్సరాల వయసులోపు బిహారీలకు ఒకే ఒక్క ముఖ్యమంత్రి– నితీశ్‌ కుమార్‌– మాత్రమే తెలుసు. బిహార్‌ అసెంబ్లీకి ఇప్పుడు జరగనున్న ఎన్నికలు 1990ల నాటి లేదా అంతకు ముందటి సంవత్సరాలలోని ప్రభుత్వాల గురించి కాదు. నితీశ్ నాయకత్వం, ఆయన ఇరవై సంవత్సరాల పాలనపై 2025 ఎన్నికలలో బిహారీలు తీర్పు ఇవ్వనున్నారు. 2025లో బిహార్‌ జనాభా 13.43 కోట్లు అని అంచనా. 1 కోటి నుంచి 3 కోట్ల మంది బిహారీలు తమ రాష్ట్రం వెలుపలి ప్రాంతాలకు వలసపోయారని అంచనా. బిహార్‌లో నిరుద్యోగిత, పేదరికానికి ప్రధాన కారణాలు: యువజనుల నిరుద్యోగిత రేటు 10.8 శాతం. విద్యాస్థాయి ఎంత ఎక్కువగా ఉంటుందో నిరుద్యోగిత రేటు కూడా అంత అధికంగా ఉండడం ఒక వైరుధ్యం. కేవలం 1,35,464 మంది బిహారీలు మాత్రమే తమ రాష్ట్రంలోని పరిశ్రమలలో ఉద్యోగులుగా ఉన్నారు.


వీరిలో కేవలం 34,700 మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులు. భారతదేశంలో అత్యధిక పేదరికం రేటు బిహార్‌లో ఉందని 2024లో నీతిఆయోగ్‌ నివేదిక ఒకటి వెల్లడించింది. 64శాతం కుటుంబాల నెలసరి ఆదాయం పదివేల రూపాయల కంటే తక్కువగా ఉన్నది. నెలసరి ఆదాయం రూ.50 వేల కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలు 4శాతం మాత్రమే. మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ (ఎమ్‌పీఐ– ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలలో బహుళ లేమిని ఒకేసారి పరిశీలించడం ద్వారా పేదరికాన్ని అంచనా వేస్తుంది) అత్యంత చెత్త పనితీరు కనపరిచే రాష్ట్రం బిహార్‌. బిహార్‌ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులకు నితీశ్‌కుమార్ ప్రభుత్వానిదే బాధ్యత. భారత్‌ జనాభాలో 9శాతం బిహార్‌లో ఉండగా, స్థూల దేశీయోత్పత్తిలో ఆ రాష్ట్రం వాటా 3.07 శాతమే. 2023–24లో బిహారీల తలసరి ఆదాయం రూ.32,174 (జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,06,744లో మూడో వంతు) మరింత ఆందోళనకరమైన విషయమేమిటంటే బిహార్‌ తలసరి ఆదాయం జాతీయ సగటు ఆదాయం పెరుగుదల రేటు కంటే తక్కువ రేటులో పెరుగుతోంది. రెండిటి మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతోంది. ఆర్థికాభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నప్పటికీ బిహార్ పేద సమాజంగా, విఫల రాష్ట్రంగా ఎందుకు మిగిలిపోయింది? ఆ రాష్ట్ర రాజకీయాలే అందుకు కారణం, సందేహం లేదు. బిహార్‌ ప్రభుత్వమూ, దాని వ్యవస్థలూ తమకుతాము వేసుకున్న కులం, మతం ఉచ్చుల్లో చిక్కుకుపోయాయి.


బిహార్‌ ప్రజలలో తీవ్ర విభేదాలకు మతం ఒక పెద్ద కారణం. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యంతో పరిపాలనలో ప్రతి అంశాన్ని మతం ప్రభావితం చేస్తోంది. ముస్లింలు నమ్మకద్రోహులు, కృతఘ్నులు అని, తత్కారణంగా వారి ఓట్లను తాను ఆశించడం లేదని గిరిరాజ్‌సింగ్‌ అనే బీజేపీ నేత వ్యాఖ్యానించాడు. ముస్లింలు 17శాతంగా ఉన్న రాష్ట్రంలో ఆయన ఈ వ్యాఖ్య చేశాడు మరి. బిహార్‌ ప్రజల పిచ్చాపాటీలో కులమే ప్రధాన అంశం. రాజకీయాల గురించిన చర్చ కూడా కులం చుట్టూనే నడవడం పరిపాటి. హిందువులు ఓబీసీలుగా, ఎమ్‌బీసీలుగా, ఈబీసీలుగా చీలిపోయి ఉన్నారు. ఈబీసీలలోని 12 కులాలలో నాలుగు మాత్రమే ప్రధానమైనవిగా పరిగణన పొందుతున్నాయి. కుల మతాలకు మితిమీరిన ప్రాధాన్యమివ్వడం వల్ల బిహార్‌ ప్రజలలో పరస్పర అనుమానాలు, విరోధ భావాలు, ఘర్షణలు పెరిగిపోతున్నాయి. బిహార్‌ రాజకీయాలలో మార్పు వచ్చి తీరాలి. ఆ మార్పును ఎవరు సాధిస్తారు? ఈ ప్రశ్నకు భిన్న సమాధానాలు వస్తాయి. మార్పును తీసుకువచ్చే నాయకుడు నితీశ్‌కుమార్‌ మాత్రం కానే కాదని ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడూ చెప్పగలడు. ఆయన తన ఇరవై సంవత్సరాల పాలనా అలవాట్లలో పాదుకుని పోయివున్నాడు. అనూహ్య రీతుల్లో ప్రవర్తించడం ఆయనకు పరిపాటి. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా ఆయనను చుట్టుముట్టాయి. నితీశ్‌ తననుతాను మార్చుకుని బిహార్‌ పాలనలో, సమాజంలో మౌలిక మార్పులు తీసుకురాగలరని భావించడం, ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. బీజేపీతో జత కట్టిన ప్రతి ప్రాంతీయ పార్టీ పతనమయింది. ఉనికినీ కోల్పో యింది. నితీశ్ నాయకత్వంలోని జనతాదళ్(యు) భవిష్యత్తు అందుకు భిన్నంగా ఉండదు. కులం కుటుంబానికే పరిమితమవ్వాలి. మతాన్ని పూజా ప్రదేశాలలోనే అనుష్ఠానించాలి. రాజకీయ వ్యవహారాలనూ పాలనా వ్యవస్థలనూ ఎట్టి పరిస్థితులలోనూ ప్రభావితం చేయకుండా కులమతాలను కట్టడి చేయాలి. బిహార్‌ ప్రజలు ఈ సత్యాన్ని గ్రహించి జాగృతమయినప్పుడే తమకుతాము వేసుకున్న ఆ ఉచ్చుల నుంచి బయటపడగలుగుతారు.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Nov 01 , 2025 | 06:33 AM