Bengaluru IPL Stampede: తప్పెవరిది...
ABN , Publish Date - Jun 06 , 2025 | 02:09 AM
మాధ్యమాలు మనకు ఎంతగా వడబోసి చూపినా, బెంగుళూరు తొక్కిసలాట దృశ్యాలు మనలను కుదిపేస్తున్నాయి, మనసు కలిచివేస్తున్నాయి. కాళ్ళకింద నలిగిపోతున్నవారిని కాపాడుకోవడానికి కొందరు ప్రయత్నించి కూడా, ఆ తోపులాటల మధ్య ఏమీ చేయలేని నిస్సహాయత వారిది.
మాధ్యమాలు మనకు ఎంతగా వడబోసి చూపినా, బెంగుళూరు తొక్కిసలాట దృశ్యాలు మనలను కుదిపేస్తున్నాయి, మనసు కలిచివేస్తున్నాయి. కాళ్ళకింద నలిగిపోతున్నవారిని కాపాడుకోవడానికి కొందరు ప్రయత్నించి కూడా, ఆ తోపులాటల మధ్య ఏమీ చేయలేని నిస్సహాయత వారిది. పదిహేడు దండయాత్రల తరువాత, రాయల్ చాలెంజర్స్ ఆ ట్రోఫీ మీద తొలిసారిగా చెయ్యివేసిన ఆ సంతోషం బెంగుళూరు నగరానికి కానీ, ఆ రాష్ట్రానికి కానీ మిగలనివ్వకుండా చేసిందీ దారుణఘటన. కేరింతలు కొట్టిన ఆ గొంతులు వెంటనే కన్నీళ్ళు దిగమింగాల్సివచ్చింది. విజయోత్సవాలు విషాదంతం కావడం ఇది తొలిసారి కాదు, చివరిసారీ కాకపోవచ్చు. కానీ, రండి వేడుకచేసుకుందామని ప్రభుత్వపెద్దలే పనిగట్టుకొని పిలిచి ప్రచారం చేసిన తరువాత, కప్పుకొట్టుకొచ్చిన ఆ వీరులను కళ్ళార్పకుండా చూడవచ్చునని నమ్మివచ్చినవారి భద్రతను ఇలా గాలికివదిలేయడం సముచితం కాదు. భావితరాన్ని పోగొట్టుకున్న ఆ కుటుంబాలకు ఇది తీరనిశోకం. ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారని హైకోర్టు ప్రశ్నించింది కానీ, తెరమీద కనిపించాలన్న తాపత్రయంతో తెరవెనుకనుంచి కథ నడిపినవారెవ్వరో న్యాయమూర్తులకు తెలియకుండా ఉంటుందా? కీర్తికిరీటాలు ధరించాలని, తమదికాని విజయంలోనూ వాటా కొల్లగొట్టాలని నాయకుల తాపత్రయం. వారి అత్యుత్సానికి నిండైన జీవితాలను గడపాల్సిన యువతరం అర్థంతరంగానే నిష్క్రమించాల్సివచ్చింది. ఒక భయానకమైన విషాదం జరిగి, ఈ పాపానికి కర్తలెవరు, కారకులెవ్వరన్న ప్రశ్నలు ఎదురైనప్పుడు మాత్రం ఈ సూత్రధారులు, పాత్రధారులు తెరమరుగైపోతారు. సన్మానాలు చేసినవారు, చేయించుకున్నవారు, విజేతలతో కలిసి ఊరేగినవారు వెనక్కుపోయి, ఓ నాలుగు కేసులు పెట్టడం ద్వారా తప్పు ఎదుటివారిమీదకు నెట్టేస్తారు. మనిషి ప్రాణంమీద కాస్తంత ప్రేమ, బాధ్యత ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. ఇదేమీ ప్రళయమో, ప్రకృతివైపరీత్యమో కాదు. ఉగ్రదాడులను సైతం ముందుగా పసిగట్టనందుకు నిఘావిభాగాలను, ప్రజలకు భద్రతనివ్వనందుకు పోలీసుల తప్పుబడుతూనే ఉన్నాం.
ప్రకృతి ఆగ్రహాన్ని సైతం తట్టుకునిలబడేందుకు మనిషి ప్రయత్నిస్తున్న కాలంలో, ఒక వేడుకను సక్రమంగా నిర్వహించలేకపోవడం విషాదం. వరుస తప్పిదాలు, నిర్లక్ష్యాలు ఈ ఘటనకు దారితీశాయన్నది నిజం. తవ్వితీసినకొద్దీ పాపాలచిట్టా బయటకు వస్తూనే ఉంది. ముప్పైవేలమంది పట్టేచోటుకు పదిరెట్లజనం వచ్చేట్టుగా ప్రచారాలు చేయడం, విజేతల ఓపెన్‌టాప్ ఊరేగింపుల, ట్రోఫీల ప్రదర్శనలపై విస్తృత ప్రచారాలు కలగలసి చిన్నస్వామిస్టేడియం సామర్థ్యానికి నాలుగైదురెట్లమందితో చుట్టూవున్న ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోవడానికి కారణమైనాయి. కేవలం రెండుకిలోమీటర్ల దూరం ఉన్న రెండుచోట్లలో అతికొద్దినిముషాల తేడాలో ఒకదానివెనుక మరో కార్యక్రమాన్ని, అదీ అతిభారీగా, బహిరంగంగా నిర్వహించాలన్న ఆలోచన ఎవరిదో బహుశా ఎప్పటికీ తెలియదేమో. ట్రోఫీ గెలిచిన మర్నాడే వీరుల ప్రదర్శన కూడదని, ఆనందంతో ఊగిపోతున్న అభిమానులను నియంత్రించడం కష్టమైపోతుందని చెప్పినా వినకుండా, ఆ వేడి మీదే వేడుక చేయాలంటూ పోలీసులను లొంగదీసిన నేతలెవరో ఎన్నటికీ వెలుగుచూడదేమో. కప్పుచేతిలో పట్టుకున్న విరాట్‌కోహ్లీని ప్రత్యక్షంగా చూడబోతున్నామన్న ఆనందంతోపాటు, చూసితీరాలన్న కసి క్రికెట్ ప్రేమికులకు ఉండటం సహజం. ఈ దురదృష్టకర ఘటన జరగడానికి కనీసం నాలుగైదుగంటల ముందునుంచే పరిస్థితులు చేజారిపోతున్నాయని, పట్టరాని జనసంఖ్యతో నిర్వహణ మీద పట్టుకోల్పోతున్నామని పాలకులకు తెలియకుండా ఉండదు. స్టేడియం తలుపులు మూసినంతమాత్రాన ప్రవాహం నిలిచిపోదు. వినోదం కోసం వచ్చినవారు చివరకు భీతిల్లిన మొహాలతో ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఎటూకదల్లేని దుస్థితికి చేరుకున్నారు. తొక్కిసలాట గురించి తెలిసి కూడా నాయకులు నటించారు, క్రీడాకారులు నవ్వుచెరగకుండా జాగ్రత్తపడ్డారు. ఐపిఎల్ విజేతల సన్మాన కార్యక్రమాన్ని అత్యంత భారీగా, బహిరంగంగా నిర్వహించాలన్న ఆలోచన వెనుక రెండు రాష్ట్రాల, రెండు భాషల, రెండు రాజకీయపార్టీల పోటీ పనిచేసిందని కొందరంటారు. నిజానిజాలు అటుంచితే, కాస్తంత ప్రణాళికతో, మానవత్వంతో, అనవసరపు ఆర్భాటాలు, ప్రచారాలకు దూరంగా, నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించివుంటే అది కచ్చితంగా విజయవంతమయ్యేది, ట్రోఫీతోపాటు, ఇదీ అభిమానుల మనసుల్లో నిలిచిపోయేది.