BC Movement: బీసీ ఉద్యమానికి సమైక్య సారథి కావాలి
ABN , Publish Date - Oct 25 , 2025 | 04:02 AM
బీసీ చైతన్యం వెల్లివిరుస్తోంది. ప్రతి బీసీలో తమ వెనుకబాటుతనానికి కారణమేమిటన్న ఆలోచనల కదలిక వచ్చింది. బీసీ కులాలలో ఏ కులానికి ఆ కులం ఒక దగ్గరికొచ్చి నిలబడే కులస్పృహ బాగా పెరిగింది....
బీసీ చైతన్యం వెల్లివిరుస్తోంది. ప్రతి బీసీలో తమ వెనుకబాటుతనానికి కారణమేమిటన్న ఆలోచనల కదలిక వచ్చింది. బీసీ కులాలలో ఏ కులానికి ఆ కులం ఒక దగ్గరికొచ్చి నిలబడే కులస్పృహ బాగా పెరిగింది. సంబంధిత కులాలలో వచ్చిన కులస్పృహ బీసీ ఐక్యతగా మారాలి. కింది కులాలన్నీ కలిసి ఒకే ఒక్క బీసీ కులంగా గొంతెత్తాలి. బీసీ భావజాల ప్రచారం విస్తృతంగా జరగాలి. యువతరం దాన్ని స్వీకరించాలి. బీసీ ఉద్యమం శక్తిమంతం కాకుండా బీసీ రాజ్యాధికారం రాదు. ఆ దిశగా కింది నుంచి పై స్థాయి వరకు నిర్మాణాత్మక కృషి జరగాలి. వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న బీసీలంతా ఒక్కతాటిపైకి రావాలి. బీసీల ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం కోసం ఒక్కటిగా నిలవాలి. ‘‘బీసీల స్వప్నం సకల రంగాల్లో సమన్యాయం’’ అన్న ఏక నినాదంతో బీసీ ఉద్యమం కదలాలి. రాజకీయ పార్టీల చర్చను బీసీ ఉద్యమంలోకి తీసుకువస్తే అది బీసీ ఉద్యమాన్ని నిర్మించలేదు. పైగా ఉద్యమంలో విభేదాల సృష్టికి దారితీస్తుంది. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది. వివిధ పార్టీ జెండాల కింద ఉన్న బీసీ నాయకులు విడివిడిగానే మాట్లాడుతున్నారు. కానీ వాళ్లు ఒక్క వేదికమీదికి వచ్చి నిలవటం లేదు. వివిధ పార్టీలలో ఉన్న బీసీ నాయకులు స్పష్టతతో నిర్మాణాత్మక ఉద్యమంలోకి వచ్చి నిలవాలి. అయితే అందుకు భిన్నంగా ఎవరి అజెండా వాళ్లు చెప్పుకుంటూపోతున్నారు. బీసీల హక్కుల సాధన విషయంలో ఏఏ పార్టీలు ఏమేమి చేశాయో? అవి ఎలా వ్యవహరిస్తున్నాయో? ఇకముందెలా వ్యవహరిస్తాయో బీసీ ఉద్యమ చరిత్రకు తెలుసు. ఇప్పుడు అన్ని పార్టీలు బీసీ నినాదాన్ని ఎత్తుకోవటం మంచిదే. కానీ ఇది బీసీ ఉద్యమ అంతిమ విజయం కోసం రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయా లేక తమ గెలుపోటముల రాజకీయ అస్తిత్వం కోసమా అన్నది ప్రస్తుత బీసీ ఉద్యమం జాగ్రత్తగా గమనించాలి. 42శాతం రిజర్వేషన్ల అంశంపై అధికారపక్షం, ప్రతిపక్షాలన్నీ బీసీ బంద్‌లో పాల్గొన్నాయి. అది మంచి పరిణామంగానే చెప్పాలి. కానీ అన్ని రాజకీయ పార్టీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణల ద్వారానే సాధ్యమవుతాయని తెలుసు. రాజ్యాంగ సవరణ కోసం అన్ని రాజకీయ పార్టీలు చివరిదాకా నిలవాలి. ఇందుకోసం రాజకీయ పార్టీలన్నీ కృతనిశ్చయంతో రాజ్యాంగ సవరణ జరిగేదాకా ఈ అంశాన్ని విడిచిపెట్టబోమని చెప్పి బీసీ ఉద్యమానికి అండగా నిలబడాలి. అది ఇప్పటివరకు ఏ మేరకు జరిగిందో బీసీ ఉద్యమమే పునశ్చరణ చేసుకోవాలి. సగం జనాభాకు న్యాయం జరగాలన్న న్యాయబద్ధమైన ఉద్యమాన్ని గెలిపించి నిలిపే సరైన నాయకుడి కోసం బీసీ ఉద్యమం ఎదురుచూస్తోంది.
తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలాగా బీసీల పోరాటం జరగాలి. తమిళనాడులో రామస్వామి పెరియార్ పోరాటంలా జరగాలి. పూలే, అంబేడ్కర్‌ల ఆలోచనలు దట్టించిన మహోద్యమంగా ఎగియాలి. బీసీ ఉద్యమమే భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. ఉద్యమ అగ్గి రగిల్చే నవతరం యువతరం రావాలి. బీసీలందరూ ఆమోదించగల ఏకగ్రీవ నాయకుడు కావాలి. దేనికీ తలవంచని ఎన్ని ఒడుదొడుకులనైనా ఎదుర్కోగల సత్తా ఉన్న బీసీ నాయకుడు కోసం ఉద్యమమే ఎదురుచూస్తోంది. ఇది అగ్రవర్ణ వ్యతిరేక ఉద్యమం కాదని, కులవిద్వేషాలను రెచ్చగొట్టే ఉద్యమం కాదని బీసీ ఉద్యమం చాటిచెప్పాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందర్నీ ఒక్కతాటిపై నడిపించే ఉద్యమ శక్తి కావాలి. నిర్మాణాత్మక ఉద్యమం వైపు నడిపే నాయకుని కోసం 85 శాతం సమాజం ఎదురుచూస్తోంది. ఇప్పటికే లెఫ్టిస్టులు లాల్‌నీల్ అన్నారు. అగ్రవర్ణాల్లో వున్న ప్రగతిశీలవాదులంతా బీసీ ఉద్యమ పక్షాన వచ్చి నిలుస్తారు. బీసీ ధర్నాలు బహుజన సింహగర్జనల సభలు కావాలి. మంత్రాలతో చింతకాయలు రాలవన్నట్లుగా ఉపన్యాసాలతో ఉద్యమాలు రావు. బీసీ వర్గాలకు నమ్మకం కలిగించే నాయకత్వం వస్తే దానిని ఆపటం ఎవరితరం కాదు. మన బతుకులు మారాలంటే రాజ్యాధికారమొక్కటే అంతిమమన్న సోయితో ఉద్యమం ఎదగాలి. ‘బీసీల రాజ్యాధికారమంటే అది అందరి రాజ్యం’ అన్న స్ఫూర్తిని కలిగించాలి.
-జూలూరు గౌరీశంకర్