Basavaraju Apparao: ఆంధ్ర సారస్వతానికి కీట్స్
ABN , Publish Date - Dec 13 , 2025 | 04:13 AM
ఆయన రచనల్లోనూ, జీవితంలోనూ కూడా ఎక్కువ కవిత్వం ఉంది అనేలా రచన సాగించిన సుప్రసిద్ధ కవి బసవరాజు అప్పారావు. సంగీత పరిజ్ఞానం ఉన్నందువల్ల....
ఆయన రచనల్లోనూ, జీవితంలోనూ కూడా ఎక్కువ కవిత్వం ఉంది అనేలా రచన సాగించిన సుప్రసిద్ధ కవి బసవరాజు అప్పారావు. సంగీత పరిజ్ఞానం ఉన్నందువల్ల, గాయకుడు కావడంవల్ల ఆయన లయాత్మకంగా పాడగలరు. ఆయన సందర్శించని క్షేత్రం లేదు. స్పృశించని భావకవితా శాఖ లేదు. ఇంతా చేసి ఆయన జీవించింది 39 సంవత్సరాలే! జీవితంలో కదిలించిన ప్రతి అనుభూతిని గీతంగా మలచుకున్న కవి అప్పారావు. ఆయనకు టెన్నిస్ ఆడటమన్నా, ఊటీకి వెళ్లడమన్నా చాలా ఇష్టం. ఆయన రాసిన ‘‘కొల్లాయిగట్టితేనేమి..., నల్లవాడే గొల్లపిల్లవాడే..., ఆ మబ్బు ఈ మబ్బు..., వేణు మనోహర గానము..., మనుజుల విభజన ఏలా...’’ పాటల్ని 1938 నాటి ‘మాలపిల్ల’ సినిమాలో ఉపయోగించారు. భార్య రాజ్యలక్ష్మి సౌదామిని కలం పేరుతో ఆయన కవితలు వెలువరించారు. భర్త సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని ఆమె స్వయంగా చెప్పుకున్నారు.
అప్పారావు 1894 డిసెంబర్ 13న ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడ సమీపంలో పటమటలో పిచ్చయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించారు. న్యాయ విద్యను అభ్యసించారు. కొంతకాలం ఆంధ్రపత్రికలో పనిచేశారు. ఆయనకు తెలుగుతో పాటు, ఇంగ్లీష్ భాషపై కూడా మంచి పట్టు ఉంది. ఆయన రాసిన లలితగీతాలని టంగుటూరి సూర్యకుమారి గానం చేశారు. ఆయన 1933 అక్టోబర్ 6న తుదిశ్వాస విడిచారు. ప్రముఖ ఆంగ్ల కవి జాన్ కీట్స్ చిన్న వయసులోనే అద్భుతమైన కవిత్వం రాసి, ఆంగ్ల సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. ఆయన బాటలోనే అప్పారావు పయనించారు. అందుకే ఆయనను ‘ఆంధ్ర సారస్వతానికి కీట్స్’ అని పిలుస్తారు.
– యం.రాంప్రదీప్, తిరువూరు
శాంత వసంత అవార్డుల ప్రదానోత్సవం
హైదరాబాద్ ఆబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో డిసెంబర్ 14 ఉదయం 10 గంటలకు శాంత వసంత ట్రస్టు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ప్రముఖ అవధాని, కథకుడు, సంస్కృతాంధ్ర భాషా పండితుడు బేతవోలు రామబ్రహ్మంకు డా. వరప్రసాద్‌రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం అందజేయనున్నారు. వరప్రసాద్‌రెడ్డి తన తండ్రి పేరిట ఇచ్చే వెంకటరమణారెడ్డి సాహితీ సేవారత్న అవార్డును వ్యాఖ్యాత, వక్త, ఆధ్యాత్మిక గాయకుడు, సుజన రంజని అకాడమీ వ్యవస్థాపకులు మహీధర సీతారామశర్మ స్వీకరిస్తారు. అలాగే శాంత వసంత ట్రస్టు కొత్తగా ప్రవేశపెట్టిన వసంత ప్రసాద్‌రెడ్డి సంగీతరత్న పురస్కారాన్ని ఫణి నారాయణకు అందజేయనున్నారు. ఈ అవార్డుల కింద లక్ష రూపాయలు, జ్ఞాపిక, సన్మానపత్రం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో డా. వై.శివరామ ప్రసాద్ రచించిన ‘ఇదం శరీరం శ్రీచక్రం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
– శాంత వసంత ట్రస్టు, హైదరాబాద్