Share News

Humanitarian Leader: బసవేశ్వరుని సంస్కర్త హృదయం

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:05 AM

బసవేశ్వరుడు సమాజంలో ఉన్న వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి, సామాజిక, ధార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టిన వ్యవస్థాపకుడు. ఆయన ప్రవచనాలు మరియు మానవతా సందేశాలు ఇప్పటికీ సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నాయి.

Humanitarian Leader: బసవేశ్వరుని సంస్కర్త హృదయం

మసమాజం శోషణకు గురై సామాజిక వ్యవస్థ బూజుపట్టి, అస్పృశ్యత, జాతి–వర్గ–వర్ణ విభేదాలు, యజ్ఞ యాగాలు, హోమాలు, నరబలి, స్త్రీ–శిశు హత్యలు, బాల్యవివాహాలు, సతీసహగమనం మొదలైన మూఢాచారాలు తాండవిస్తున్న తరుణంలో బసవేశ్వరుడు అనే క్రాంతి పురుషుడు జన్మించారు. క్రీస్తుశకం 1134లో ఇప్పటి కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, బాగేవాడి గ్రామంలో శైవ బ్రాహ్మణ కుటుంబంలో అగ్రహారం పెద్ద అయిన మాదిరాజు–మాదాంబిక దంపతులకు పుట్టారు. బాల్యం నుంచి మూఢాచారాలను వ్యతిరేకించిన బసవేశ్వరుడు ఎనిమిదవ యేట తండ్రి ఉపనయనం చేయడానికి సిద్ధపడగా, తండ్రి మాటను తిరస్కరించి తన అక్క నాగాంబిక వద్దకు చేరుకున్నారు. అక్కడే గురుకులంలో వేద శాస్త్ర పురాణాలన్నీ అధ్యయనం చేసి దినదిన ప్రవర్ధమానమై ఎదిగిన బసవేశ్వరుడు, బుద్ధిశాలిగా, సాహిత్య, వేద, పురాణ, ఆగమ, సంగీత, గణిత విద్యలన్నింటిలో ప్రావీణుడై పండిత పూర్ణ వ్యక్తిత్వాన్ని సంపాదించారు. ఈ సమయంలో దోషరహితమైన ధార్మిక వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. విద్యాభ్యాసం అనంతరం బిజ్జల చక్రవర్తి దండ నాయకుడైన తన మేనమామ బలదేవర కూతురును వివాహమాడి, స్వయం ఆర్జనతో జీవించే తలంపుతో బిజ్జలుని కొలువులో చేరారు. అపార మేధాసంపన్నుడైన బసవేశ్వరుని నీతి, నిబద్ధత, సమాజసేవను గుర్తించిన బిజ్జల రాజు తన రాజ్యానికి ప్రధానమంత్రిగా ఆయనను నియమించాడు. అనతి కాలంలోనే బసవేశ్వరుడు ఆ రాజ్యంలో నూతన సామాజిక, ధార్మిక సంస్కరణలకు ప్రవేశపెట్టారు. వీటి ప్రచారానికి మంటపాలను నిర్మించి, వాటికి అనుభవ మంటపం అని నామకరణం చేశారు. ఈ మంటపంలో జాతి, కుల, మత, వర్గ, వర్ణ, లింగ భేదాలకు అతీతంగా స్త్రీ–పురుషులకు సమాన అవకాశాలు కల్పించారు. మహిళలకు అక్షరాభ్యాసం చేయించి, వేద శాస్త్రాలు నేర్పి, వారికి తన అనుభవ మంటపంలో స్థానం కల్పించారు. ఈ అనుభవ మంటపం నేటి మన పార్లమెంట్ వ్యవస్థతో సమానమైంది, అందుకే బసవేశ్వరుడి అనుభవ మంటపాన్ని మొదటి పార్లమెంటుగా గుర్తించవచ్చు. ఆనాడు బసవేశ్వరుడు అంకురార్పణ చేసిన మహిళల సమాన హక్కులు– నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుండడం, భారత ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్ కల్పించడం– ఇప్పటికీ స్ఫూర్తినిస్తున్నాయి.


ఎంతో శ్రేష్ఠమైన బసవ వచనాలు సమస్త ప్రజానీకానికి ప్రేరణగా, మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. బసవేశ్వరుడు తన ఉపదేశాలను ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలుగా రాసిన గొప్ప తత్వవేత్త. ఆ వచనాలలోని సూక్ష్మమైన తత్వం సులువుగా బోధపడుతుంది. మానవతావాదానికి మకుటమైన బసవేశ్వరుడు వచనాలను అన్ని భాషలలో అనువదించి, ఆయన చరిత్రను నేటి తరానికి తెలియజేస్తే సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చినవారం అవుతాం. బసవేశ్వరుడు 64 లక్షలకు పైగా వచనాలు రాసినప్పటికీ, నేడు కొన్ని వేలు మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి. సమాజంలో పేరుకుపోయిన వైదిక, సనాతన, మూఢాచారాలను బసవేశ్వరుడు తన రచనల ద్వారా ఖండించారు. ఆ కాలంలో బిజ్జల రాజ్యంలో సాంఘిక సంస్కరణలు అమల్లో భాగంగా వర్ణాంతర వివాహాలు చేయడంతో కొందరు ఆయనని తీవ్రంగా వ్యతిరేకించారు. బసవేశ్వరుని నూతన సంవిధానం కొందరికి కంటగింపుగా మారడంతో వారంతా ఏకమై ఆయనను బిజ్జల రాజు చేత దేశ బహిష్కరణ గావించారు. అక్కడి నుంచి కూడల సంగమం చేరుకొని, అక్కడే 1196లో పరమాత్మ సన్నిధికి చేరుకున్నారు. నేడు ఆ కూడల సంగమం వీరశైవ లింగాయతుల పవిత్ర క్షేత్రంగా బాసిల్లుతున్నది. పాల్కురికి సోమనాథుడు తన ఆరాధ్య దైవమైన బసవేశ్వరుడిపై బసవపురాణం రాశాడు. మహాత్మా బసవేశ్వరుల గొప్పతనాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం పార్లమెంటు ప్రాంగణంలో బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 2006లో ఐదు రూపాయలు, 100 రూపాయల నాణాలను బసవేశ్వరుని బొమ్మతో ముద్రించి, ఆ మహాత్ముని స్మరించుకుంది. తెలంగాణ వాసి డాక్టర్ నీరజాపాటిల్ ఎంతో కృషి చేసి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా లండన్‌లో బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుని జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. ట్యాంక్ బండ్‌పై ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే గాక, బసవేశ్వర చరిత్రను పాఠ్యాంశంగా చేర్పించి, నేటి పౌరులకు ఆ మహాత్ముని గొప్పతనాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నది.


అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో బసవేశ్వరుని చిత్రపటాన్ని తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మహాత్మా బసవేశ్వరుని దేవునిలా ఊహించకుండా ఒక గురువుగా, సంఘసంస్కర్తగా భావించి, ఆయన ప్రవచనాలను అన్ని ప్రముఖ భాషలలో అనువదించి, చరిత్రను ప్రచురించాలి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినా సాధువు, లోకనాయకుడు, బసవేశ్వరుని విశాల హృదయం మానవతావాదానికి నిదర్శనం. నేడు మనం ఏ విధమైన సాంఘిక సంస్కరణలు ఆశిస్తున్నామో, వాటిలో చాలా వాటిని బసవేశ్వరుడు ఆనాడే అమల్లోకి తెచ్చారు. నాటి ప్రజల్లో విప్లవం తీసుకొచ్చిన బసవేశ్వరుని సామాజిక, సమానత్వ భావన కుల–మతాలకు అతీతంగా కులరహిత సమాజం ఏర్పడేదాకా దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. సమాజంలో అసమానతలపై మహాత్మా బసవేశ్వరుడు చేసిన పెనుగర్జనలు నేడు ఏదో ఒక రూపంలో ఘంటానాదాలై మారుమోగుతూనే ఉంటాయి. ఈనాటి సమాజంలో కుల–మత–వర్గ–వర్ణ వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ పరిస్థితుల్లో బసవేశ్వరుని సందేశం ఎంతో ప్రాసంగికం.

- బర్మని మల్లికార్జున్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,

వీరశైవ లింగాయత్ సమితి (నేడు బసవ జయంతి)

Updated Date - Apr 30 , 2025 | 04:05 AM