Share News

Bangladesh Diplomatic Strategy: తల్లి బాటను తారిక్‌‌ విడనాడుతారా

ABN , Publish Date - Dec 31 , 2025 | 05:30 AM

బంగ్లాదేశ్‌ ఒకప్పుడు భారత్‌లో అంతర్భాగం; ఆ తరువాత ఒక పొరుగుదేశంలో అర్ధ భాగం; ఇప్పుడు స్వతంత్ర, సార్వభౌమిక పొరుగు దేశం.

Bangladesh Diplomatic Strategy: తల్లి బాటను తారిక్‌‌ విడనాడుతారా

బంగ్లాదేశ్‌ ఒకప్పుడు భారత్‌లో అంతర్భాగం; ఆ తరువాత ఒక పొరుగుదేశంలో అర్ధ భాగం; ఇప్పుడు స్వతంత్ర, సార్వభౌమిక పొరుగు దేశం. ఉభయ దేశాల మధ్య భాషా సంస్కృతుల సాన్నిహిత్యం ఉన్నది. అంతకుమించి నదీజలాల వివాదాలూ ఉన్నాయి. ఈ కారణాన బంగ్లాదేశ్ వర్తమాన రాజకీయ పరిణామాలను భారత ప్రభుత్వమూ, భారత ప్రజలూ నిశితంగా గమనిస్తున్నారు. ఇది జెన్‌–జీ కాలం కదా. ఇతర పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంకలో కంటే బంగ్లాలోని యువతరం క్రియాశీలకంగా తమ దేశ భవిష్యత్తు కోసం మహోగ్రంగా ఉద్యమిస్తోంది. ఈ సంక్లిష్ట ఉద్రిక్త పరిస్థితులలో బంగ్లాదేశ్‌ కీలక జాతీయ నాయకురాలు, బీఎన్పీ అధినేత, మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూశారు.


భారత్‌ సహాయంతో ఆవిర్భవించిన దేశం బంగ్లాదేశ్. అయితే జాతి ఆత్మగౌరవం పేర ఆ దేశంలో భారత విద్వేష రాజకీయాలు రగుల్కొన్నాయి. ఇలా భారత్‌పై వ్యతిరేకతను పెంపొందించడంలో– మంగళవారం అనారోగ్యంతో మరణించిన ఖలీదా అగ్రగణ్య పాత్ర వహించారు. 1970, 80 దశకాలలో బంగ్లాదేశ్‌ను పాలించిన ఆమె భర్త జనరల్‌ జియా ఉర్ రహ్మాన్‌ నదీ జలాల పంపకంలో భారత్‌ తమకు అన్యాయం చేస్తున్నదని 1976లో ఇస్లామిక్ దేశాలకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత అదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకువెళ్లారు. 1993లో బంగ్లా ప్రధానమంత్రిగా ఉన్న ఖలీదా కూడా భారత్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేశారు. భర్త జియా వలే ఆమె కూడా బంగ్లా ఆత్మగౌరవం పేర భారత వ్యతిరేక పంథాను అవలంబించారు. తద్వారా దేశ ప్రజలలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. భారత వ్యతిరేక వైఖరే తమ విధానంగా ఉన్న జమాతే ఇస్లామీ, ఇతర రాజకీయ శక్తుల అండదండలతో పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించి, భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించారనే అప్రతిష్ఠను ఖలీదా మూటగట్టుకున్నారు. తన ప్రత్యర్థి షేక్‌ హసీనా వలే బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థను సర్వతోముఖంగా అభివృద్ధిపరిచేందుకు ఖలీదా తగు శ్రద్ధ చూపలేదు. బంగ్లాదేశ్ సార్వభౌమిక హక్కులకు భారతదేశం భంగం కలిగిస్తోందనే, అగౌరవపరుస్తోందనే వాదనను ఆమె చాలా బలీయంగా ప్రజలలోకి తీసుకువెళ్లారు. తద్వారా బంగ్లాదేశ్‌ రాజకీయాలలో తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నారు. పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుని నరేంద్ర మోదీ లబ్ధి పొందిన దాని కంటే పదింతలు ఎక్కువగా ఖలీదా తన భారత్‌ వ్యతిరేక విధానాలతో ప్రయోజనం పొందారు. భారత్‌కు దౌత్యపరంగా ఇబ్బందులు సృష్టించడంలో ఆమె సఫలమయ్యారు.


బంగ్లాదేశ్‌ ఆర్థిక, సామాజిక జీవన స్రవంతిలో గల్ఫ్ దేశాలకు ఆ దేశ ప్రజల వలసలు ముఖ్యభూమిక వహిస్తున్నాయి. ఒక్క సౌదీ అరేబియాలోనే 30 లక్షల మంది బంగ్లాదేశీ ప్రవాసులు ఉన్నారంటే అతిశయోశక్తి కాదు. ఈ శతాబ్ది మొదటి దశకంలో గల్ఫ్ దేశాలు కొన్ని కారణాల వల్ల బంగ్లాదేశ్‌కు వీసాల జారీపై ఆంక్షలు విధించాయి. ఉపాధి అవకాశాలు సన్నగిల్లి, దేశంలో ఖలీదాపై వ్యతిరేకత పెరిగిపోయింది. ఆమె కుమారుడు తారిక్‌తో పాటు బీఎన్పీకి చెందిన అనేకమంది నాయకులకు గల్ఫ్ దేశాలలో ఉన్న ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి రావడంతో ఖలీదాకు మరింత నష్టం సంభవించింది. ఆ పరిస్థితులలో అధికారం చేపట్టిన హసీనా– గల్ఫ్ దేశాలతో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రాధాన్యమిచ్చారు. గల్ఫ్‌తో సైనికంగా కలిసి పనిచేయడానికి సైతం ఆమె సాహసోపేతంగా ముందుకు వచ్చారు. తద్వారా ఆ దేశాలతో బంగ్లాదేశ్‌ సంబంధాలను పునరుద్ధరించారు. అలా ఇంటా బయటా హసీనా తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంపొందించుకున్నారు. అయితే ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ నాయకుల అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు హసీనా తీసుకున్న భారత్ అనుకూల నిర్ణయాలు బంగ్లాదేశ్‌ ప్రజలలో అసంతృప్తికి దారితీశాయి. బంగ్లా ఆత్మాభిమానాన్ని హసీనా తాకట్టుపెడుతున్నారని ఆమె ప్రత్యర్థులు ప్రచారం చేశారు. నమ్మిన ప్రజలు అగ్రహోదగ్రులు అయ్యారు.


ప్రధాన రాజకీయ పక్షాలపై విసుగెత్తిన బంగ్లా యువత వీధులలోకి వెల్లువెత్తింది. అరాచక చర్యలతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. హసీనా భారత్‌లో ఆశ్రయం పొందడం అనివార్యమయింది. ఇంటా బయటా గౌరవప్రదమైన మేధావిగా గుర్తింపు పొందిన, నోబెల్ పురస్కార గ్రహీత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం ఖలీదా కంటే ఎక్కువగా భారత్‌కు నష్టం చేసింది. అనతికాలంలో భారత వ్యతిరేకతను విపరీతంగా పెంచి పోషించింది. ఢాకా వ్యూహాత్మకంగా భారత్‌ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడంతో న్యూఢిల్లీయే కాదు, భారత ప్రజలూ ఆందోళన చెందుతున్నారు.

బంగ్లాదేశ్‌ రాజకీయాలలో ఇప్పుడు షేక్‌ హసీనాకు, ఆమె పార్టీకి ప్రజాక్షేత్రంలో ఎలాంటి చోటూ లేకుండా పోయింది. ఈ అనివార్య పరిస్థితులలో ఖలీదా నేతృత్వంలోని బీఎన్పీకి భారత్‌ మద్దతు ఇవ్వవలసి వచ్చింది. వచ్చే నెలలో జరిగే బంగ్లా పార్లమెంటు ఎన్నికలలో ఖలీదా వారసుడు తారిక్‌ విజయం సాధిస్తారనే బలమైన అభిప్రాయం సర్వత్రా బలంగా ఉన్నది. 17 ఏళ్ళ ప్రవాసం తరువాత స్వదేశంలో అడుగుపెట్టిన తారిక్‌ తన తొలి ప్రసంగంలో ‘బంగ్లాదేశ్‌– ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు అందరిదీ’ అని విస్పష్టంగా ప్రకటించడం ద్వారా ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు, భారత ప్రభుత్వ విధానకర్తలనూ ఆకర్షించారు. శరవేగంగా మారుతున్న సమీకరణాలలో భారత్‌కు నిస్సందేహంగా ఇదొక దౌత్య విజయం. తన తల్లి అనుసరించిన విధానాలకు భిన్నమైన వైఖరితో తారిక్‌ భారత్‌కు స్నేహ హస్తం అందిస్తారా లేదా అనేది నూతన సంవత్సరంలో తెలుస్తుంది.

-మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - Dec 31 , 2025 | 05:32 AM