Baloch Insurgency: బలూచీ నుంచీ పాఠం నేర్చుకోవాలా
ABN , Publish Date - May 30 , 2025 | 05:58 AM
బలూచీస్థాన్ సమస్యను రాజకీయ, సామాజిక, చారిత్రక పరిప్రేక్ష్యాలలో లోతుగా అర్థం చేసుకోవాలి. స్థానికుల స్వతంత్ర ఆకాంక్షలను దమనించడం వల్ల సమస్యలు తీవ్రమవుతున్నాయి మరియు హింసాత్మక పరిష్కారాలు క్షమించలేవు.
రాజకీయాలను రెండు రకాలుగా చూడొచ్చు. స్థూలదృష్టితో చూసి రేఖామాత్రంగా ఒక అవగాహన ఏర్పరచుకోవటాన్ని మొదటిదిగా చెప్పుకోవచ్చు. సాధారణ పౌరులు చాలావరకూ ఈ దృష్టితో సరిపెట్టుకుంటారు. దీనికి భిన్నంగా సూక్ష్మదృష్టితో రాజకీయాలను చూసి అందులోని మంచిచెడులను లోతుగా అవగాహన చేసుకుని వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాడుకోవటం రెండోదిగా భావించొచ్చు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల విషయంలో రెండోదానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. దీన్ని ప్రస్తుత పరిస్థితుల్లో అర్థంచేసుకోటానికి బలూచీస్థాన్ వ్యవహారాలను నిదర్శనంగా తీసుకోవచ్చు. కశ్మీరు సమస్యను పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికల మీద లేవనెత్తినప్పుడల్లా బలూచీస్థాన్‌లో మీరేం చేస్తున్నారంటూ భారత్ తరపు నుంచి ప్రశ్నించటం ఇటీవల ఎక్కువైంది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ కొన్నాళ్ల క్రితం పాకిస్థాన్‌ను ఇలాగే హెచ్చరించారు. పహల్గాం దారుణం అనంతరం బలూచీస్థాన్ వేర్పాటువాదులు పాక్ భద్రతాదళాలపై దాడులను ముమ్మరం చేశారు. కొంత ప్రాంతం పాక్ నుంచి విముక్తం అయినట్లూ ప్రకటించారు. అంతకుముందు జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును నిర్బంధించి పాక్ సైన్యంతో ముఖాముఖీ తలపడ్డారు. అటూఇటూ చాలా ప్రాణనష్టం అనంతరం మాత్రమే పాక్ భద్రతాదళాలు పరిస్థితిపై పట్టుసాధించినట్లు ప్రకటించుకున్నాయి. ఈ తరహా హింసాత్మక చర్యలు బలూచీ చరిత్రలో కొత్తవి కావు. 1948 నుంచి ఇప్పటివరకూ ఏదోరూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. బలూచీస్థాన్ సమస్యను వ్యూహాత్మక దౌత్య ప్రేమతో కాకుండా అక్కడి ప్రజల దృష్టి నుంచి చూస్తే... దారుణ అణచివేతలు, చిందిన రక్తపాతాలు, విచ్చలవిడి వనరుల దోపిడీలు, స్థానికులను అధమస్థానంలోకి నెట్టటం, రాజకీయ అధికారంలో భాగస్వామ్యాన్ని నిరాకరించటం, స్వపరిపాలనా కాంక్షను జాతి విద్రోహంగా పరిగణించటం, సైనిక బలంతో పెత్తనం సాగించటం, స్థానిక తెగలను అభివృద్ధి నిరోధకులుగా ముద్రవేయటం, రాజకీయ ప్రత్యర్థులను మాయం చేయటం, బూటకపు ఎన్‌కౌంటర్లతో ప్రజలను మట్టుబెట్టటం, స్థానిక భాషను తృణీకరించటం.. లాంటి ఎన్నో దురాగతాలతో ఆ నేలకు నిలువెల్లా గాయాలయినట్లు స్పష్టంగా కనపడుతుంది. పాక్‌కు బలూచీస్థాన్ పక్కలో బల్లెంలా మారటం మనలో కొందరికి సంతోషం వేయవచ్చు. అక్కడి ప్రభుత్వ వ్యతిరేక ప్రతిఘటనా రాజకీయాలకు వివిధ రూపాల్లో సహాయాన్ని అందించటం మన దౌత్యవ్యూహ చాతుర్యంగా భావించొచ్చు.
కానీ దానికి మించి అక్కడి పరిస్థితిని సమగ్ర దృష్టితో, మానవతాకోణం నుంచి చూస్తే ఎన్నో గుణపాఠాలనూ నేర్చుకోవచ్చు. స్వపాలనా ఆకాంక్షలను, జాతి గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలను బలప్రయోగంతో అణచివేస్తే తీవ్రవాదాలు పుట్టుకొచ్చి పరిస్థితిని ఎంత భయంకరంగా మార్చుతాయో తెలుసుకోవచ్చు. బ్రిటిషు పాలకులు, ఆ తర్వాత అమెరికా, సోవియట్ రష్యా, చైనా సాగించిన నిర్వాకాలతో అక్కడి పరిస్థితి విషమంగా మారి జన జీవితాల్ని ఎంత ఛిద్రంచేసిందో అర్థం చేసుకోవచ్చు. బలూచీస్థాన్ చరిత్రే చాలా విచిత్రమైంది. అదెన్నో మలుపులు తిరిగింది.ఏ మలుపులోనూ స్థానికుల స్వరాన్ని లెక్కచేయకపోవటమే అక్కడ కనిపిస్తుంది. బ్రిటిషు వలసపాలకులు బలూచీస్థాన్‌లో అడుగుపెట్టేనాటికి అక్కడ బలమైన రాజ్యవ్యవస్థ లేదు. తెగల సమాహారంగా సమాజం ఉండేది. తెగల నాయకులు, పెద్దలు చెప్పేదే చెల్లుబాటు అయ్యేది. పన్నులను, శిస్తులను కూడా వాళ్లే నిర్ణయించేవాళ్లు. సున్నీ ముస్లిం మతం ప్రబలంగా ఉన్నా అది తెగల హద్దులను దాటి అందరినీ ఏకంచేసే స్థాయికి చేరలేదు. మతం జాతీయతా భావాన్ని కలగచేయలేదు. పర్షియన్, ఆఫ్గాన్, సింధీ, సిక్కు సైన్యాలు బలూచీస్థాన్‌పై దండెత్తినా తెగలను పూర్తిగా లొంగదీసుకోలేకపోయాయి. తెగల నుంచి కప్పం వసూలు చేసుకుని వాటి అంతర్గత విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోని పరిస్థితే ఉండేది. 18వ శతాబ్దంలో మాత్రమే తెగలను ఒక రాజ్యవ్యవస్థ కిందకు సమీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. కలాత్ ప్రాంతానికి చెందిన నజీర్‌ఖాన్ సారథ్యం కింద 25000 మందిని సైనికులుగా సమీకరించటంతో అక్కడ ప్రాథమిక రాజ్యవ్యవస్థ ఏర్పాటైంది. నజీర్‌ఖాన్ మరణం (1794) తర్వాత ఆ వ్యవస్థ కూడా బలహీనపడి పోయి, మళ్లీ విడివిడి తెగల ప్రాబల్యం పెరిగింది. కలాత్ ఖాన్‌ల కింద ఉన్న ప్రాంతంలోనే రాజ్యవ్యవస్థ కాస్త బలంగా ఉండేది. ఈ పరిస్థితి 1884 వరకూ కొనసాగింది. ఆ ఏడాది బ్రిటిషు వలసపాలకులు బలూచీస్థాన్‌ను మొత్తంగా స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. బ్రిటిషు సైన్యం రాకపోకలకూ రవాణా అవసరాలకూ వారికి బలూచీస్థాన్ కావాల్సి వచ్చింది. అందుకోసం కలాత్ పాలకుడితో ఒప్పందం కుదుర్చుకున్నారు.
దాన్ని కొన్ని తెగలు గుర్తించకుండా బ్రిటిషు వారికి అడ్డంకులు సృష్టించాయి. దీన్ని సాకుగా తీసుకుని కలాత్ మీద దాడి చేసి అక్కడి ఖాన్‌ను చంపేశారు. బలూచీస్థాన్‌ను ఏడు ముక్కలు చేశారు. రెండు ముక్కలను ఇరాన్, ఆఫ్గానిస్థాన్‌ల్లో కలిపారు. మూడో భాగాన్ని బ్రిటిష్ బలూచీస్థాన్ పేరుతో తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. మిగతా నాలుగు ముక్కల్లో కలాత్ కింద కొంత భాగాన్ని మిగిలిన మూడు ముక్కలను మూడు చిన్న సంస్థానాల కింద విభజించారు. దేశ విభజన నాటికి బలూచీస్థాన్‌ను ఏంచేయాలన్న ప్రశ్న వచ్చినప్పుడు బ్రిటిషు పాలకులు గతంలో ఇరాన్, ఆఫ్గానిస్థాన్‌ల్లో తాము కలిపేసిన ప్రాంతాల గురించి ఆలోచించలేదు. భారత్, పాక్‌ల్లో దేంట్లోనైనా చేరేందుకూ అందుకు ఇష్టం లేకపోతే స్వతంత్రంగా ఉండేందుకూ అప్పటి సంస్థానాలకు స్వేచ్ఛను ఇచ్చారు. మూడు చిన్న సంస్థానాలు పాకిస్థాన్‌లో చేరటానికి అంగీకరించినా కలాత్ పాలకుడు స్వతంత్రంగా ఉండటానికే నిర్ణయించుకున్నాడు.1947 ఆగస్టు 15న స్వతంత్ర పాలకుడిగా తనను ప్రకటించుకున్నాడు. ఎంతో ఒత్తిడి వచ్చినా రక్షణ, విదేశీ వ్యవహారాలు మినహా మిగతా వ్యవహారాల్లో స్వయం నిర్ణయాధికారాన్నే కోరుకోవటంతో 1948 ఏప్రిల్‌లో పాక్ సైనిక చర్యను చేపట్టి విలీనం చేసుకుంది. 1947కు ముందు నుంచీ కూడా ప్రత్యేక దేశంగా ఉండటానికి బలూచీలు గట్టిగానే ప్రయత్నించారు. పాక్‌లో బలవంతంగా కలిపేసుకున్నా ఒక రాష్ట్రంగా సొంతంగా వ్యవహారాలు నడిపే హక్కుని కూడా ఇవ్వకపోవటంతో బలూచీల విషాదం మొదలైంది. బలూచీల హక్కులను నిరాకరించటం పాక్ వ్యవస్థాపకుడైన జిన్నాతోనే మొదలైంది. బలూచీస్థాన్‌ని నియంత్రించటానికి తన నేతృత్వంలో ఒక సలహామండలిని ఏర్పాటు చేసుకున్నారు. సర్వాధికారాలు కేంద్రం గుప్పిట్లో పెట్టుకునే వ్యవహారాలు అట్లా ఆనాడు మొదలయ్యాయి. అయూబ్ ఖాన్ సైనిక పాలనలో (1958) దేశం మొత్తాన్ని రెండు విభాగాలు చేశారు. దాన్నే ‘వన్ యూనిట్ స్కీం’గా పిలిచేవారు. తూర్పు బెంగాల్‌ను ఒక యూనిట్‌గా, పశ్చిమ ప్రాంతాలను మరో యూనిట్‌గా పరిగణించటంతో రాష్ట్రాల హక్కులన్నీ హరించుకుపోయాయి. ఆ పరిస్థితిని వ్యతిరేకిస్తూ బలూచీస్థాన్‌లో మొదలైన ప్రతిఘటనను సైన్యంతో అణచివేశారు.
1962లో వామపక్ష అనుకూల జాతీయవాదులకూ ఆ పరిస్థితి తప్పలేదు. 1973 నుంచి 1977 వరకూ సాగిన అణచివేత బలూచీస్థాన్ చరిత్రలోనే అత్యంత ఘోరమైంది. 5300 మంది గెరిల్లాలూ, 3300 మంది సైనికులూ మరణించారు. పౌరుల మరణాలకు లెక్కేలేదు. 55000 బలూచీలు ఆయుధాలు పట్టారు. ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బర్తరప్ చేయటంతో ఆనాటి ప్రతిఘటన రాజుకుంది. పాక్‌లో వయోజన ఓటుహక్కు కింద మొదటి ఎన్నికలు 1970లోనే జరిగాయి. ఇక ఆ ఏడాదే బలూచీస్థాన్‌కు రాష్ట్ర ప్రతిపత్తినీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నేషనల్ అవామీ పార్టీ స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వటం మొదలుపెట్టింది. బలూచీ ఆకాంక్షలను ఒక్కొక్కటిగా తీర్చటానికి అడుగులు వేయటం ప్రారంభించింది. పాక్ పాలకులకు అవి జాతి వ్యతిరేక చర్యలుగా కనపడ్డాయి. ప్రధానిగా జుల్ఫికర్ అలీ భుట్టోను పదవీచ్యుతుడ్ని చేసిన సైనిక పాలకులు కాల్పుల విరమణను ప్రకటించారు. ఆఫ్గనిస్థాన్‌లో రష్యా సేనల ప్రవేశంతో (1979) పరిస్థితి మారిపోయింది. బలూచీల పోరాటం వెనుకపట్టు పట్టింది. 1999లో ముషారఫ్ సైనిక పాలన రావటంతో మళ్లీ చిచ్చురగిలింది. చైనా–పాక్ ఎకనమిక్ కారిడార్‌లో భాగమైన గ్వాదర్ పోర్టు నిర్మాణంతో మొత్తం కారిడార్‌పైనే వ్యతిరేకత తలెత్తింది. స్వదేశీ–విదేశీ పెత్తనాలపై బలూచీల పోరాటం మళ్లీ ఉధృతమైంది. 2005 నుంచి పరిస్థితి రగులుతున్న రాక్షసిబొగ్గులాగానే తయారైంది. ఒకప్పుడు తెగల నాయకుల నుంచి నాయకులూ, గెరిల్లాలూ వస్తే రెండు దశాబ్దాల నుంచి మధ్యతరగతి, నగర జీవుల నుంచి ఆందోళనకారులు పుట్టుకొస్తున్నారు. రకరకాల పేర్లతో బలూచీ విముక్తి దళాలు రంగంలోకి వచ్చాయి.
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, కిడ్నాపులు, ఆత్మాహుతి దాడులు, భద్రతా దళాలపై బాంబులు వేయటం నిత్యకృత్యంగా మారిపోయాయి. ఆఫ్గాన్ సరిహద్దులోని పష్టూన్ ప్రజల్లో ప్రాబల్యాన్ని పెంచుకున్న తాలిబాన్ తీవ్రవాదం, బలూచీల తిరుగుబాటు పాక్ పాలిట ప్రస్తుతం పెను సమస్యలుగా మారాయి. అధికారంలో ఏళ్లపాటు ప్రాతినిధ్యం లేకుండా చేసి, ఆర్థికంగా అట్టడుగుకు నెట్టేస్తే ఉత్పన్నమయ్యే పరిణామాలకు సూచికగా, బలూచీస్థాన్‌ను నిదర్శనంగా పేర్కొంటూ ఎన్నో విశ్లేషణలు వచ్చాయి. పాక్‌లో విస్తీర్ణం పరంగా బలూచీస్థానే పెద్ద రాష్ట్రం. కానీ జనాభాపరంగా దిగువున ఉంది. నిరుద్యోగం, నిరక్షరాస్యత ఎక్కువ. తలసరి ఆదాయం తక్కువ. నీటి సౌకర్యాలు అంతంత మాత్రమే. వ్యవసాయంపై ఆధారపడటం కష్టం. పశుపోషణే ఒకప్పుడు ప్రధానంగా ఉండేది. సహజవాయువు, ఖనిజ వనరులు, ముడిచమురు నిల్వలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. వీటిపై వచ్చే రాయల్టీల్లో సింహభాగం ఇప్పటికీ పంజాబీ, సింధీలే తన్నుకుపోతున్నారు. ఉన్నత, సాధారణ ఉద్యోగాల్లోనూ పంజాబీ, సింధీలదే ఆధిపత్యం. వ్యాపార, పరిశ్రమలూ వీరి చేతుల్లోనూ ఉన్నాయి. ఇక మిలటరీలో పంజాబీల గుత్తాధిపత్యానికి తిరుగులేదు. బలూచీ చరిత్ర చెప్పే సత్యం ఒక్కటే. రాజకీయ, ఆర్థిక అధికారాల్లో సముచిత ప్రాతినిధ్యం ఇవ్వకుండా, రాష్ట్రాల అధికారాలకు కత్తెరవేస్తూ, జాతీయ సమగ్రత పేరుతో ప్రాంతీయ ఆకాంక్షలను నేలరాస్తూ, వేర్పాటువాదులుగా ముద్రలువేస్తూ, సైనికబలంతో సమస్యలను పరిష్కరిద్దామనే వ్యూహం లెక్కలేనన్ని విపరిణామాలకు దారితీస్తుంది. హింసనే నమ్ముకునే విపరీత భావజాలాలను సృష్టిస్తుంది. బలూచీస్థాన్ అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం అదే!
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)