Share News

Badal Sarkar: మన వీధికి వచ్చిన నాటకం

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:27 AM

సాంస్కృతిక దార్శనికుడు బాదల్ సర్కార్‌. నాటకం అంటే పుక్కిటి పురాణం కాదనీ, జనజీవన ప్రతిబింబమని నమ్మిన బాదల్ సర్కార్ భారతీయ రంగస్థలాన్ని విప్లవీకరించారు.

Badal Sarkar: మన వీధికి వచ్చిన నాటకం

సాంస్కృతిక దార్శనికుడు బాదల్ సర్కార్‌. నాటకం అంటే పుక్కిటి పురాణం కాదనీ, జనజీవన ప్రతిబింబమని నమ్మిన బాదల్ సర్కార్ భారతీయ రంగస్థలాన్ని విప్లవీకరించారు. అభివ్యక్తికి ఒక మౌలిక లక్ష్యం నిర్దేశించారు. అసమానతల గోడల్ని కూల్చడం కోసమే కళ అంటూ నినదించారు. ఉన్నత వర్గాల వారికి మాత్రమే పరిమితమైన రంగస్థలానికి స్వేచ్ఛను ప్రసాదించి, ప్రజా రంగస్థలంగా మలిచారు. కల్పిత కథలు, నిజ జీవితంతో సంబంధం లేని పాత్రలను కాలదన్ని పీడిత ప్రజలకు అండనిచ్చే హృద్యమైన మానవతా మంద్ర స్వరంగా నాటకాన్ని బాదల్‌ మార్చివేశారు. నాటక ప్రయోక్తగా ఎన్నో భిన్నమైన ప్రయోగాలు చేశారు. సగటు మనిషి ప్రసక్తి లేని పౌరాణిక నాటకాన్ని, కులీన వర్గానికి మాత్రమే నవీన నాటకం రెంటినీ అధిగమించి మొట్టమొదటిసారిగా సగటు మనిషి కోసం ‘మూడో రంగస్థలం’ (థర్డ్ థియేటర్)ను సృష్టించారు. అందుకే ప్రపంచ రంగస్థలం ఆయన్ని ‘ఫాదర్ ఆఫ్ థర్డ్ థియేటర్’గా గౌరవిస్తోంది. జూలై 15, 1925న కలకత్తాలో సుధీంద్ర సర్కార్‌గా పుట్టిన బాదల్ ఇంజనీరింగ్ చదివారు. ఇంగ్లాండ్, నైజీరియా మొదలైన దేశాలలో ఉద్యోగాలు చేశారు. యాభై వరకు నాటకాలు రచించిన బాదల్ సర్కార్ భారతదేశంలో పీడిత ప్రజల పక్షాన ప్రత్యామ్నాయ రంగస్థలాన్ని లోతుగా అధ్యయనం చేసిన మొదటి వ్యక్తి. సంప్రదాయక నాటక రంగాన్ని కాదని సమిష్టి కృషితోనే కళ సంపూర్ణ వికాసం పొందుతుందని ఆయన నిరూపించారు. అందుకే, నాటక ప్రదర్శనకి ఆయన సరికొత్త నిర్వచనం ఇచ్చారు. ప్రదర్శనశాలలకు పరిమితమైన నాటకాన్ని ఏకంగా నాలుగు వీధుల కూడలిలోకి తీసుకువచ్చి మొదటిసారిగా ‘వీధి నాటకాన్ని’ నిర్మించారు. భారతీయ రంగస్థల చరిత్రలో అదో అసాధారణ విప్లవం. నాటకం అంటే గంటలకొద్దీ సాగే కథనం కాదని, అది ఒక నిరంతర చైతన్య ప్రవాహమని బాదల్‌ చాటారు. వీధి నాటకాన్ని ప్రజా ఉద్యమంగా మలిచారు. ఆ ప్రక్రియలో నిత్య ప్రయోగశీలిగా నిలిచారు. ఈనాటికి కూడా స్ట్రీట్ ప్లే (వీధి నాటకం), అది ఏ ప్రాంతంలో, ఏ స్థాయిలో ప్రదర్శితమౌతున్నా దానికి ఆద్యుడు మాత్రం బాదల్ సర్కారే.


బాదల్ సర్కార్ దృష్టిలో నాటకం అంటే జీవితాన్ని వినూత్నంగా దర్శింపజేసే విశిష్టమైన కళాత్మక సాధనం. అదేదో అలౌకికమైనది కాదు. సమాజంలో భాగం. జీవితానికి ప్రతిబింబం. సత్యాన్వేషణకి సోపానం. నాటక కళ నలుగుర్ని దగ్గరికి చేర్చాలి. వారి గుండె బరువు తీర్చాలి. అందుకే, అసలు వీధి నాటకం కళే కాదన్న వారికి దీటుగా జవాబిస్తూ, ‘ప్రధాన స్రవంతి నాటకం ఆధిపత్య రూపమైతే, ప్రత్యామ్నాయ నాటకం మార్పుకు మాధ్యమం’ అని బాదల్ నిరూపించారు. నక్సల్బరి ప్రభావితులయిన సగటు బెంగాల్ యువత సంక్లిష్ట మనస్తత్వాన్ని చిత్రించే అనేక విలువైన నాటక రచనలు బాదల్ చేశారు. ‘అవర్ స్ట్రీట్ థియేటర్’ (మన వీధి నాటకం) అన్న తన పుస్తకంలో పాలకుల నిర్బంధంలో వీధినాటకం, ‘గెరిల్లా నాటకం’గా రూపాంతరం చెందుతుందని బాదల్‌ అన్నారు. ప్రశ్నను సహించలేని పాలక వర్గాలు, ధిక్కారాన్ని ఓర్చుకోలేని ప్రభుత్వాలు కళలను కట్టడి చేయడానికి, అణచివేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రజా నాటకం మరింత బలోపేతం కావాలని బాదల్‌ అన్నారు. నాటక కళా తాత్వికతను పునర్‌ నిర్వచించిన బాదల్, నాటకం అంటే కేవలం కల్పిత వినోద ‘ప్రదర్శన’ కాదని, అది వ్యవస్థలోని నిజాలను ‘నిదర్శనం’గా చూపే శక్తిమంతమైన వాహకమని అన్నారు.


అందుకు అనుగుణంగానే చివరి వరకు ఆయన జీవితం సాగింది. దశాబ్దాల పాటు ప్రత్యామ్నాయ నాటక కళా ఉద్యమానికి నేతృత్వం వహించిన బాదల్ సర్కార్ ఎన్నడూ పాలకుల మెప్పు కోసం పాకులాడలేదు. మొదట్లో పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ పురస్కారాల్ని అంగీకరించినా తర్వాత కాలంలో చైతన్యం పెంపొంది ప్రభుత్వం ఇస్తానన్న పద్మభూషణ్ అవార్డును రెండుసార్లు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. 1967లో ‘శతాబ్ది’ అనే రంగస్థల సంస్థను స్థాపించిన బాదల్, ఈబాంగ్ ఇంద్రజిత్, బాసి ఖబర్, సారీ రాత్, పగల గోడా, స్పార్టకస్, బోమా వంటి అనేక వైవిధ్య నాటకాలు రచించారు.


అతి తక్కువ ఖర్చుతో, తక్కువ మందితో ఎక్కడికక్కడ సొంతంగా ప్రదర్శించగలిగేది వీధి నాటకం. అందుకనే, పౌరసమాజంపై వెన్వెంటనే గాఢమైన ముద్రవేసే ఈ ప్రక్రియ త్వరలోనే ప్రజల్లోకి లోతుగా వెళ్ళిపోయింది. అనేక సాంస్కృతిక సంఘాలు వీధి నాటకాన్ని ఆయుధంగా ప్రయోగించడం పెరిగిపోయింది. 80వ దశకంలో కేరళలో ప్రారంభమై దేశ వ్యాప్తంగా కొనసాగిన వైజ్ఞానిక కళాజాతా మొదలుకుని జాతీయ స్థాయిలో జరిగిన మూఢనమ్మకాల వ్యతిరేక ఉద్యమం, తెలుగు రాష్ట్రాల్లో ఉవ్వెత్తున ఎగిసిన అక్షరాస్యత ఉద్యమం, మద్యపాన వ్యతిరేక ఉద్యమం తదితర ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న అసంఖ్యాక ప్రజలకు స్ఫూర్తి నింపిన వివిధ కళా రూపాలు, వీధి నాటకాలకు మూలం నాడు బాదల్ సర్కార్ రూపొందించిన రంగస్థల కార్యాచరణ ప్రభావితాలే. అదక్కడితో ఆగలేదు, అటు ఆదివాసి దళిత బహుజన సాంస్కృతిక సంస్థల నుండి, ఇటు ప్రగతిశీల మహిళా, గాంధేయవాద, సోషలిస్టు, వామపక్ష శక్తుల వరకు ప్రతి ప్రజాసంఘమూ వీధి నాటకాన్ని, భావజాల ప్రచార పనిముట్టుగా ఆశ్రయించాల్సి రావడం, బాదల్ సర్కార్ భావోద్యమాలలో సాధించిన అరుదైన విజయం. ప్రత్యామ్నాయ కళా రూపకంగా వీధి నాటకానికి మాత్రమే దక్కిన అపూర్వ గౌరవం. ప్రత్యామ్నాయ నాటకం ప్రజాచైతన్య పూరకం. మనిషి జీవితానికి సంబంధించిన ఉన్నత విలువలను ప్రమాణీకరించేది నాటకం. అది అనాదిగా అభివృద్ధి చెందుతున్న మానవాళి అభివ్యక్తికి ఆదర్శాత్మక చిహ్నం.


కళాకారుడిగా, ప్రయోక్తగా, రచయితగా, సాంస్కృతిక కార్యకర్తగా, నిత్య చైతన్యశీలిగా బతికిన బాదల్ సర్కార్ 2011, మే 11న కేన్సర్‌తో చనిపోయారు. భారతీయ రంగస్థల చరిత్రలో మహత్తరమైన మార్పుకి సారథ్యం వహించిన ప్రజాపక్ష మేధావిగా బాదల్ సర్కార్ శాశ్వతంగా నిలిచిపోతారు. ఆయన దిశానిర్దేశం చేసిన ప్రత్యామ్నాయ రంగస్థలాన్నీ, అందులో ప్రధానమైన వీధి నాటకాన్ని మరింత బలోపేతం చేసుకుని సమసమాజ నిర్మాణం దిశగా సాగడమే బాదల్ సర్కార్ ఆశయ స్పూర్తికి మనం ఇవ్వాల్సిన బాధ్యతాయుతమైన నివాళి.

-గౌరవ్ సాంస్కృతిక కార్యకర్త (90320 94492)

Updated Date - Jul 13 , 2025 | 12:28 AM