Social media Ban: ఆస్ట్రేలియా ఆదర్శం
ABN , Publish Date - Dec 13 , 2025 | 04:11 AM
పదహారేళ్ళలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడానికి ఆస్ట్రేలియా చేసిన ప్రయత్నం బాగుంది. దీర్ఘకాలం మల్లగుల్లాలుపడి, చివరకు ధైర్యంగా.....
పదహారేళ్ళలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడానికి ఆస్ట్రేలియా చేసిన ప్రయత్నం బాగుంది. దీర్ఘకాలం మల్లగుల్లాలుపడి, చివరకు ధైర్యంగా తెచ్చిన ఈ చట్టం రెండురోజులక్రితం అక్కడ అమలులోకి వచ్చింది. ఆశయం మంచిదే, ఆచరణే కష్టం.. అని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ స్వయంగా ఓ మాటన్నప్పటికీ, ఒకవేళ అనుకున్నంతగా విజయం కాక, వైఫల్యాలు ఎదురైనప్పటికీ, ఒక మాయాప్రపంచం నుంచి పిల్లలను రక్షించే సదుద్దేశంతో మొదలుపెట్టిన ఈ ప్రయత్నం ప్రశంసనీయమైనది.
వయసు, అనుభవం ఉన్నదనీ, తమకే అంతా తెలుసుననీ అనుకుంటున్న పెద్దలే ఈ సోషల్ మీడియా మాయలో పడి గింగిరాలు తిరుగుతూంటే, తెలిసీ తెలియని వయసు పిల్లలు దాని వలలో పడి, ప్రభావితులు కాకుండా ఉండటం అసాధ్యం. పసిహృదయాలపై దీని దుష్ప్రభావాలు, మానసిక రుగ్మతలమీద ఆస్ట్రేలియా ప్రభుత్వం లోతైన అధ్యయనాలు జరిపి, పదహారేళ్ళలోపు వారిని పూర్తిగా సోషల్ మీడియాకు దూరం పెట్టవలసిందేనని నిర్ణయానికి వచ్చింది. డిజిటల్ స్వేచ్ఛ అని మనం ముద్దుగా అంటున్నదానికి పూర్తిదూరంగా ఉన్నదేశాలు కూడా ఈ ప్రపంచంలో అనేకం. ఎత్తయిన గోడలు కట్టి పాక్షికంగా అనుమతిస్తున్న దేశాలూ ఉన్నాయి. పిల్లలను సోషల్‌మీడియాకు పూర్తిగా దూరం చేయడం సరికాదంటూ చిన్నాచితకా జాగ్రత్తలతో యథాతథంగా అనుమతిస్తున్న దేశాలే అధికం. కానీ, ఆస్ర్టేలియా మాత్రం ఎటువంటి మినహాయింపులూ ఇవ్వడానికి సిద్ధపడలేదు. ప్రధానిగా ఉన్నందుకు ఎన్నడూ తనకు ఇంత సంతోషం కలగలేదని, మిగతా ప్రపంచానికి ఆస్ట్రేలియా దారిచూపించిందని అల్బనీస్ గర్విస్తున్నారు. ఇదేదారిలో తూచ తప్పకుండా నడుస్తామని ఇప్పటికే కొన్ని దేశాలు ప్రకటించాయి. ఆస్ట్రేలియాలో మూడింట రెండువంతులమంది ఓటర్లు, రాజకీయపక్షాలు ఈ నిర్ణయానికి అనుకూలంగా ఉండటం విశేషం. టెక్ కంపెనీలు తలెగరేయకుండా, తోకజాడించకుండా ఉండటానికే ఆస్ట్రేలియా ప్రభుత్వం మొన్న సెప్టెంబరులో ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించి, వయసు పరిమితి అవసరాన్ని నొక్కివక్కాణించి, మిగతా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేసిందని అంటారు.
మెసేజింగ్ యాప్‌లు మినహా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఎక్స్, యూట్యూబ్ ఇత్యాది పది ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతానికి ఈ నిర్ణయం పరిధిలోకి వస్తున్నప్పటికీ, భవిష్యత్తులో మరిన్ని వచ్చిచేరవచ్చు. పదహారేళ్ళ లోపువారు ఈ వేదికల్లోకి చొరబడినపక్షంలో వారినీ, తల్లిదండ్రులనూ కాక, కంపెనీలనే భారీ పెనాల్టీలతో శిక్షించాలన్నది మంచి నిర్ణయం. అవి అనుసరించబోయే వయసు నిర్థారణ విధానాలమీద అనుమానాలు, గోప్యత భయాలు ఉన్నప్పటికీ, ఉల్లంఘనలకు తావులేని రీతిలో చట్టాన్ని అమలుచేయాల్సిన బాధ్యత పూర్తిగా వాటిదే. ఆదిలో వీరంగాలు వేసి, హెచ్చరికలు చేసిన టెక్ కంపెనీలు క్రమంగా చల్లబడ్డాయి.
తాము, తమ మిత్రులు నిషేధాన్ని ఎలా ఉల్లంఘించామో ప్రధానికే ఆస్ర్టేలియా పిల్లలు చెబుతున్నారట. విపిఎన్‌ల వాడకంతోపాటు, ఇతరత్రా అడ్డుతోవల్లో ఈ అడ్డుగోడ ఛేదించేందుకు ఎక్కువమంది ప్రయత్నిస్తున్నారట. ఇవన్నీ తాము ఊహించనివేమీ కాదని, ఈ తరం పిల్లలు ఎంత ఘటికులో తెలుసునని ప్రభుత్వం అంటోంది. ఇప్పుడు నిషేధాన్ని మెచ్చుకున్నవారే రేపటి రోజుల్లో తమ పిల్లల నిరసన, ఒత్తిడి భరించలేక వ్యతిరేకంగా తయారయ్యే అవకాశమూ లేకపోలేదు. రిడిట్ చూపినదారిలో మిగతా కంపెనీలు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. సోషల్‌మీడియా వాడకాన్ని ఒక వ్యసనంలాగా మార్చివేసే ఆల్గరిథమ్స్‌నుంచి, విషపూరిత కంటెంట్‌నుంచి, ఆన్‌లైన్ అవమానాలు, వేధింపులు, బెదిరింపులనుంచి పిల్లలను కాపాడుకోవాలన్న ఈ ప్రయత్నం ప్రశంసనీయమైనది. ఎదిగేవయసులో ఈ ఉచ్చులో చిక్కి, చదువు, నిద్ర, ఆటకు దూరమై, సకల సామర్థ్యాలు భావోద్వేగాలు కోల్పోయి, వాస్తవిక ప్రపంచానికి దూరంగా మిగులుతున్నారు పిల్లలు. ఒక అబద్ధాల ప్రపంచంతో తమను పోల్చుకుంటూ ఆత్మన్యూనతలోకి జారిపోతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు చేతులెత్తేసిన ఒక తీవ్రమైన సమస్యని ఆస్ట్రేలియా ప్రభుత్వం నెత్తినెత్తుకొని, మిగతాదేశాలకు దారిచూపుతున్నందుకు సంతోషిస్తున్నవారే అధికం.