Constitutional Values: ఆత్మగౌరవ దండోరా సభ
ABN , Publish Date - Nov 01 , 2025 | 06:36 AM
నూట నలభై రెండు కోట్ల ప్రజలున్న దేశంలో సర్వోన్నత న్యాయాధిపతి తన సింహాసనం మీద కూర్చుని వాదోపవాదాలు వింటున్న సమయం అది.
నూట నలభై రెండు కోట్ల ప్రజలున్న దేశంలో సర్వోన్నత న్యాయాధిపతి తన సింహాసనం మీద కూర్చుని వాదోపవాదాలు వింటున్న సమయం అది. నిండు కోర్టులో కట్టుదిట్టమైన భద్రత ఉన్న చోటు అది. ఆ న్యాయాధిపతిపై బూటు విసరడమనే జుగుప్సాకరమైన దాడి ఎందుకు జరిగింది? దీనికి ప్రేరేపించిన కళంకాయనులు ఎవరనేది ప్రపంచానికి తెలిసిపోయింది. ఆ చర్యకు పాల్పడిన వ్యక్తి సమాధానం అలాంటిది. అంతేకాదు, అది ఆ వ్యవస్థ సమాధానం కూడా. న్యాయాన్ని న్యాయంగా చూడలేని ఒక అన్యాయాల పునాది మీద విలసిల్లుతున్న భావజాలం అది. వీరి అనాగరిక చర్యలకు సర్వోన్నత న్యాయస్థానానికి సైతం మినహాయింపు లేదనటానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది? మనది కాని నేలమీద పడి బతుకుతున్నామనే అగౌరవాన్ని సంకేతాలుగా పంపదలుచుకున్న అసహన వ్యవస్థ అప్రజాస్వామిక దాడి అది. ఒక వ్యక్తి చర్య ఏ మాత్రం కాదు. అది వ్యవస్థీకృత నియంతృత్వం, దాని పాలన పెంచి పోషిస్తున్న సనాతనవాద ప్రభావం. దానికి పౌర సమాజాన్ని గౌరవించే సహనం ఉండదు. రాజ్యాంగాన్ని గౌరవించే మనసు ఉండదు. మత వైరుధ్యం కుల రాక్షసత్వం నరనరానా నింపుకుని అసమ సమాజ నిర్మాణానికి అనునిత్యం వెంపర్లాడుతుంటుంది. అందుకని న్యాయం అందరిదిగా ఉండడానికి కూడా ఒప్పుకోదు ఈ ధర్మం. ఈ దాడి విషయంలో చట్టం తన పని తాను చేయటానికి నిరాకరించటం దగ్గరే అసలు కథ మొదలవుతుంది. పౌర సమాజం ఆలోచించటానికి కారణం కూడా అయింది. సుప్రీంకోర్టు జడ్జి అంటే రాజ్యాంగం ప్రతిబింబించే ఈ దేశ స్ఫూర్తి. అలాంటి వ్యక్తి మీద దాడి జరగటం అంటే రాజ్యాంగం మీద దాడి జరగడమే. ఇంత జరిగినా ఈ దేశ పాలనా వ్యవస్థకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆ స్థానంలో దళిత సీజేఐ కాకుండా అగ్రహారం నుంచి వచ్చిన సీజేఐ అయితే పరిస్థితులు ఇలా ఉంటాయా? అనే ప్రశ్న దళిత సమాజాన్ని ఆవేదనకు గురిచేసింది. రాజ్యాంగమే సుప్రీం గనుక ఆ వ్యవస్థ మీద దాడి జరిగినప్పుడు బాధ్యత వహిస్తూ న్యాయశాఖ మంత్రి రాజీనామా చేయాలి కదా!
భద్రతా వైఫల్యమయితే శాఖాపరమైన చర్యలు ఏమి తీసుకున్నారో తెలియదు. రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే పరిమితమైనవి గనుక రాజకీయ పార్టీలు అందుకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి. ఆయన దళితుడు గనుక, వాటి నుంచి ఇంతకన్నా ఆశించలేం. దేశం తలవంచుకునే ఘటన... ఈ దాడి. ఇది అక్టోబర్ 6న జరిగినా, నేటికీ న్యాయవ్యవస్థ సుమోటోగా కేసు నమోదు చేయకపోవడంలో ఆంతర్యం తెలియంది కాదు. హేయమైన ఈ దాడిని దేశమంతా ఖండించింది. ‘ఇటువంటి ఘటనలు నన్ను ప్రభావితం చేయలేవు’ అన్న సీజేఐ మాటలు విని క్షమించి వదిలివేయాల్సిన దాడి కాదు ఇది. చెప్పిందల్లా చెయ్యకపోతే ఇలాంటి దాడులు చేస్తామనే భావదారిద్ర్యం నుంచి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉన్నది. సీజేఐ గవాయ్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ ఇరవై ఐదు రోజులుగా ఉద్యమం చేస్తున్నది. ఈ పోరాటంలో భాగంగా నవంబర్ 1న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ మహా ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ఈ ప్రదర్శన రాజ్యాంగ పరిరక్షణ కోసం, దళితుల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నది. దళితుల ఆత్మగౌరవ దండోరా ప్రదర్శనలో పాల్గొనడం ప్రజాస్వామికవాదులుగా మనందరి బాధ్యత.
- డప్పోల్ల రమేశ్