Share News

Atal Bihari Vajpayee: సుపరిపాలనకు చిరునామా ‘అటల్‌ మోదీ’

ABN , Publish Date - Dec 25 , 2025 | 02:39 AM

భారతదేశ రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసిన అరుదైన రాజనీతిజ్ఞుడు, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ...

Atal Bihari Vajpayee: సుపరిపాలనకు చిరునామా ‘అటల్‌ మోదీ’

భారతదేశ రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసిన అరుదైన రాజనీతిజ్ఞుడు, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ‘అటల్‌–మోదీ సుపరిపాలన యాత్ర’ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్‌ మాధవ్‌ ఆధ్వర్యంలో అటల్‌జీ ఆశయాలను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా సాగిన ఈ యాత్రలో పాల్గొన్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు అటల్‌జీ పాలనాదక్షత, సుపరిపాలన, సేవా తత్పరతను కీర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఒక స్పష్టమైన అవగాహనను కల్పించారు.

ఈ యాత్రలో ప్రసంగించిన వక్తలందరూ ఒక ప్రధాన అంశాన్ని బలంగా వినిపించారు. ‘‘భారతదేశ ప్రగతికి అటల్‌బిహారీ వాజ్‌పేయి బలమైన పునాది వేస్తే, ఆ పునాదిపై ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ అనే మహోన్నత సౌధాన్ని నిర్మిస్తున్నారు’. వాజ్‌పేయి నాడు నాటిన అభివృద్ధి విత్తనం నేడు మోదీ రూపంలో వటవృక్షమై దేశానికి నీడనిస్తోందని నాయకులు అభివర్ణించారు. నాడు వాజ్‌పేయి ప్రారంభించిన సంస్కరణలు, నేడు మోదీ హయాంలో సాంకేతికత, సంస్కృతి, సంక్షేమం అనే మూడు స్తంభాలపై నిలబడి భారత్‌ను విశ్వగురు స్థానానికి తీసుకువెళుతున్నాయి.


ఈ యాత్ర రాజకీయంగా కూటమి ఐక్యతను చాటిచెప్పింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు ఒకే వేదికపైకి వచ్చి వాజ్‌పేయిని స్మరించుకోవడం, మోదీ పాలనను సమర్థించడం వారి మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనం. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈ ప్రతిష్ఠాత్మక సుపరిపాలన యాత్ర ముగింపు సభ అటల్‌జీ జయంతి రోజు(డిసెంబర్‌ 25) జరగనుంది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, కూటమిలోని ఇతర ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొననుండడం విశేషం. 12 అడుగుల ఎత్తైన అటల్‌బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని అతిథులు ఆవిష్కరించనున్నారు.

నాగోతు రమేష్‌ నాయుడు

కన్వీనర్‌, అటల్‌–మోదీ సుపరిపాలన యాత్ర

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో తెగ ట్రెండ్ అయిన సంఘటనలు ఇవే..

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంఘటనలు ఇవే..

Updated Date - Dec 25 , 2025 | 02:39 AM