Atal Bihari Vajpayee: అజాత శత్రువు, ఆదర్శ నాయకుడు
ABN , Publish Date - Dec 25 , 2025 | 02:45 AM
అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో 1999లో కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నారు. తరచూ అలగటం...
అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో 1999లో కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నారు. తరచూ అలగటం ఆమె స్వభావం. అయితే, ప్రభుత్వాన్ని కూల్చేటంత బలం మాత్రం ఆమె పార్టీకి లేదు. కాకపోతే ఆమెకు ప్రజల్లో ఆకర్షణ బాగా ఉంది. ఫ్యాక్సులో వచ్చిన ఆమె రాజీనామా లేఖను చూసిన వాజ్‌పేయి, బాగా ఆలోచించారు.
ఆ మర్నాడే ఆయన కలకత్తాలో పార్టీ మహాసభకు వెడుతున్నారు. అక్కడ దిగగానే మమతా బెనర్జీ ఇంటికి ఫోన్ చేసి, మమత తల్లితో మాట్లాడారు. ఎలా ఉన్నారని పరామర్శించారు. మాటల్లో ఆవిడ ‘‘మా ఇంటికి భోజనానికి రావచ్చు కదా నాయనా!’’ అని అడిగింది. సంతోషంగా అంగీకరించి, భోజనానికి వెళ్లారు వాజ్‌పేయి. ఆయనతో పాటు మమతా బెనర్జీ కూడా భోజనానికి కూర్చున్నారు. భోజనాలయ్యాక మాటల్లో మమత తల్లి ప్రధానమంత్రిని ‘‘కేంద్రంలో మా అమ్మాయి ఎలా పని చేస్తోంది నాయనా?’’ అని అడిగారు. వాజ్‌పేయి చిరునవ్వుతో ‘‘బాగా పనిచేస్తోందమ్మా. ఎటొచ్చీ చిన్న చిన్న విషయాలకే అలిగేస్తూంటుంది... రాజకీయాల్లో ఆమె ఎంతో ఎదగాల్సి ఉంది. మంచి భవిష్యత్తు ఉన్న మనిషి’’ అన్నారు. అలా మమత మనసును గాయపర్చకుండానే ఆమె తొందరపాటు ఆమెకు తెలిసేలా చేశారు. అంతే! మర్నాడు పత్రికల్లో మమతా బెనర్జీ తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు వార్త వచ్చింది.
1977 నుంచి 2007 వరకు 3 దశాబ్దాలపాటు అటల్‌జీతో కలిసి, ఆయన మార్గదర్శనంలో పని చేసే అవకాశం నాకు దక్కింది. ఆ కాలంలో ఆయన నుంచి రాజకీయాల్లోనే కాదు, జీవితంలోనూ అమూల్యమైన పాఠాలు నేర్చుకున్నాను. అనేక అడ్డంకులు, విపరీత పరిస్థితులు, సవాళ్లు, ముళ్లతో నిండిన రాజకీయ ప్రయాణాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ, దేశ చరిత్రలో తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా నిలిచిన అసాధారణ నాయకుడు వాజ్‌పేయి. గొప్ప దార్శనికుడు, అచంచల దేశభక్తుడు, నిబద్ధత కలిగిన రాష్ట్రీయవాది. అంతకుమించి అపూర్వమైన మానవతావాది. అంతేగాక ఒక గొప్ప వక్త, కవి, పరిపాలనాదక్షుడు.
1939లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరటం ఆయన జీవితాన్ని ప్రభావితం చేసిన మలుపు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, కొద్ది రోజుల పాటు జైలుశిక్ష అనుభవించారు. వాజ్‌పేయి గొప్ప సాహిత్యకారుడు, పాత్రికేయుడు. ‘రాష్ట్ర ధర్మ’ అనే హిందీ పత్రికకు సంపాదకత్వం వహించారు. ‘స్వదేశీ విరాట్’ పత్రికలో పనిచేశారు. 1947లో ఆయన ఆరెస్సెస్ ప్రచారక్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలోనే వాజ్‌పేయి అసాధారణ రాజకీయ పరిజ్ఞానం, మేధస్సును గమనించిన ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మాధవ సదాశివ గోల్వాల్కర్, ఆయన్ను భారతీయ జన్ సంఘ్ పార్టీలోకి పంపించారు. 1957లో జరిగిన సార్వత్రక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, 33 ఏళ్ల వయసులోనే ఘనవిజయం సాధించి, పార్లమెంటులో అడుగుపెట్టారు. వాజ్‌పేయి లేవనెత్తిన అంశాలు, మాట్లాడే తీరు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రుతో సహా అధికార, ప్రతిపక్ష నాయకులందరినీ ఆకర్షించేవి. ఎంపీలు ప్రజాప్రతినిధులుగా పార్లమెంటుకు వచ్చి, తమకు నచ్చని విషయం వచ్చినప్పుడు సమావేశాల్ని బహిష్కరించటాన్ని ఆయన తప్పు పట్టేవారు.
ఇందిరాగాంధీ 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఈ సమయంలో వాజ్‌పేయిని మీసా చట్టం కింద అప్రజాస్వామిక విధానంలో అరెస్టు చేసి బెంగళూరు జైలులో నిర్బంధించారు. అయితే జైలుగోడలు కూడా ఆయన ప్రజాస్వామ్య పోరాటాన్ని ఆపలేకపోయాయి. 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వంలో వాజ్‌పేయి విదేశాంగమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన చేపట్టిన దౌత్య విధానాలు, ముఖ్యంగా పొరుగు దేశాలతో నెరిపిన స్నేహపూర్వక సంబంధాలు, అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్ఠను మరింత పెంచాయి. 1980లో భారతీయ జనతా పార్టీ అవతరించినప్పుడు, పార్టీ తొలి అఖిల భారత అధ్యక్షుడిగా వాజ్‌పేయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
1984లో శ్రీమతి ఇందిరాగాంధీ దుర్మరణానంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేవలం రెండు లోక్‌సభ స్థానాలకే పరిమితమైంది. ఇది పార్టీ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన కాలం. వాజ్‌పేయి ఒక సభలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు జరిగిన ఒక సమావేశంలో పలువురు నాయకులు ‘‘ఇక పార్టీకి గడ్డు రోజులు రాబోతున్నాయి’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు వాజ్‌పేయి మాట్లాడుతూ ‘‘అంధేరా చటేగా–సూరజ్ నిఖ్లేగా–కమల్ ఖిలేగా’’ అంటూ కార్యకర్తల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపారు.
1998లో ఎన్నికలలో గెలుపొంది 23 పార్టీలను ఏకం చేసి నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)తో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా అటల్‌జీ బాధ్యతలు స్వీకరించారు. 1998, మే 11న పోఖ్రాన్‌లో అత్యంత రహస్యంగా, అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించి సంచలనం సృష్టించారు. అమెరికా అనేక ఆంక్షలు విధించినా చలించలేదు. 1999 ఫిబ్రవరిలో లాహోర్‌కు వెళ్లి పాకిస్థాన్‌కు స్నేహహస్తం అందించారు వాజ్‌పేయి. అయితే కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించే కుట్రకు పాక్ పాల్పడింది. భారత సైన్యం ప్రదర్శించిన పరాక్రమానికి ఆ దేశ సైన్యం పలాయనం చిత్తగించింది.
1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన వాజ్‌పేయి, ప్రభుత్వం ఏర్పాటు చేసి దేశానికి సుస్థిరమైన పాలన అందించారు. మొట్టమొదటిసారిగా గ్రామీణ భారత అభివృద్ధిని కేంద్రంగా పెట్టుకొని ‘‘ప్రధాన్‌మంత్రి గ్రామ్ సడక్ యోజన’’ అనే బృహత్తర పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. స్వర్ణ చతుర్భుజి పథకం ద్వారా నిర్మితమైన మన జాతీయ రహదారులు ఈ రోజు మన దేశ జీవనాడులుగా మారాయి. రహదారులతో పాటు ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, టెలీ కనెక్టివిటీ, షిప్ కనెక్టివిటీ రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. సర్వశిక్షా అభియాన్, నదుల అనుసంధానం, పారదర్శక పాలన, ప్రజలకు సమర్థమైన సేవలను అందించడం వంటి కార్యక్రమాల ద్వారా వాజ్‌పేయి దేశ ప్రజల మన్ననలు పొందారు. ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ‘వికసిత భారత్–2047’ నాటికి ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగాలనే లక్ష్యాన్ని వాజ్‌పేయి నుంచే ప్రేరణ పొందింది. ఆయన ఆలోచనలు, ఆదర్శాలు, సిద్ధాంతాలను అనుసరించి వేగవంతమైన అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపిస్తోంది. వాజ్‌పేయికి నిజమైన నివాళి, ఆయన జీవిత విలువలను మనం ఆచరించడమే.
బండారు దత్తాత్రేయ
మాజీ గవర్నర్
(నేడు అటల్‌బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల ముగింపు)
ఇవి కూడా చదవండి
ఈ ఏడాది ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో తెగ ట్రెండ్ అయిన సంఘటనలు ఇవే..
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంఘటనలు ఇవే..