Share News

సిందూర్‌ : ఐక్యతా స్వరాలు, విరుద్ధ వాదాలు

ABN , Publish Date - Jun 06 , 2025 | 02:12 AM

భారత జాతీయవాది అసదుద్దీన్‌ ఒవైసీ! మితవాద రాజకీయ శ్రేణులు ఇప్పుడు ఆయన్ను ఆ విధంగా గౌరవిస్తున్నాయి. హిందుత్వవాదుల నుంచి ఒవైసీకి ఆ ఆదరణ లభించేందుకు భయానక పహల్గాం ఉగ్రదాడి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా 87 గంటలపాటు భారత్‌ సైనిక చర్య అవసరమయ్యాయి.

సిందూర్‌ : ఐక్యతా స్వరాలు, విరుద్ధ వాదాలు

భారత జాతీయవాది అసదుద్దీన్‌ ఒవైసీ! మితవాద రాజకీయ శ్రేణులు ఇప్పుడు ఆయన్ను ఆ విధంగా గౌరవిస్తున్నాయి. హిందుత్వవాదుల నుంచి ఒవైసీకి ఆ ఆదరణ లభించేందుకు భయానక పహల్గాం ఉగ్రదాడి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా 87 గంటలపాటు భారత్‌ సైనిక చర్య అవసరమయ్యాయి. ఒవైసీ రాజకీయాలు ‘జాతి–వ్యతిరేక’ మైనవిగా భారతీయ జనతా పార్టీ చాలా సంవత్సరాలుగా నిందిస్తోంది. ఆయన తన విలక్షణ మత అస్తిత్వాన్ని తాను నిత్యం ధరించే షేర్వాణీతో చాటుతున్నారు. భారతీయ ముస్లింలు భిన్నమైనవారు, అన్యులు అనే మనోవైఖరి, సైద్ధాంతిక విశ్వాసంతో వ్యవహరించే వారి రాజకీయాలు ఒవైసీని ఒక ‘శత్రువు’గా పరిగణించాయి. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద ఘాతుకాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపై భారత్‌ వాదనను ఘంటాపథంగా వినిపిస్తున్న అదే అసదుద్దీన్‌ ఒవైసీని ‘దేశభక్తుడు’గా హిందుత్వ వర్గాలు నేడు కొనియాడుతున్నాయి. స్ఫుటంగా మాట్లాడే హైదరాబాద్‌ ఎంపీ రాజకీయాలు నిజానికి మారలేదు: గతంలో ఆయన చాలాసార్లు పాకిస్థాన్‌ను, ‘ద్వి జాతి’ సిద్ధాంతాన్ని తీవ్రంగా విమర్శించారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ముస్లిం నాయకుడుగా ప్రఖ్యాతుడైన ఒవైసీని ముస్లింల సంకీర్ణ ప్రయోజనాల వకాల్తాదారుగా ముద్రవేయడం చాలా తేలిక. అయితే ఇప్పుడు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్‌ వాదనను ప్రపంచానికి వినిపించడాన్ని ఆయన మౌలిక రాజకీయ వైఖరులలో వచ్చిన మార్పుగా కాకుండా పహల్గాం అనంతర రాజకీయ వాతావరణానికి ఆనుగుణ్యమైనదిగా భావించాలి. మరి ఈ రాజకీయ పరిస్థితులు ఇంట (స్వదేశం) విభజనలు, మితిమీరిన పక్షపాతంతో కొనసాగుతుండగా బయట (విదేశాలు) సమైక్యత, ఏకాభిప్రాయం ప్రాతిపదికన ఉన్నాయి. హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో చేసిన వ్యాఖ్యలను పరిశీలించండి. ఆపరేషన్‌ సిందూర్‌పై మమతా బెనర్జీ ప్రభుత్వం ‘ఓటుబ్యాంకు రాజకీయాలు’ చేస్తోందని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్‌తో మోదీ ప్రభుత్వ ‘యుద్ధాన్ని’ చాలా ఇతర పార్టీల వలే తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా సమర్థిస్తోంది. కోల్‌కతాలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో అమిత్‌ షా ప్రసంగిస్తుండగా ఆ పార్టీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ అఖిలపక్ష ప్రతినిధి బృందం సభ్యుడుగా తూర్పు ఆసియాలో పాకిస్థాన్‌ సైనిక రాజ్యంపై మాటల పిడుగులు వర్షిస్తున్నారు.


బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు ఒక ఏడాదిలో జరగనున్న నేపథ్యంలో మమత సర్కార్‌పై అమిత్‌ షా విమర్శనాత్మక వ్యాఖ్యలు రాబోయే ఎన్నికలకు సమర శంఖాన్ని పూరించడమేనని కచ్చితంగా చెప్పవచ్చు. అవిశ్రాంత రాజకీయవేత్త అయిన అమిత్‌ షా ప్రచార కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు హోం మంత్రికి తక్కువ, బీజేపీ కార్యకర్తకు ఎక్కువగాను వ్యవహరిస్తుంటారు. ప్రధాన జాతీయ ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితులనూ చూడండి. పహల్గాం ఘటన సంభవించిన వెన్వెంటనే దేశ ప్రయోజనాలను పరిరక్షించేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టే ఏ చర్యకు అయినా ‘సంపూర్ణ మద్దతు’నిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. తిరువనంతపురం నుంచి నాలుగుసార్లు ఎన్నికైన పార్టీ ఎంపీ శశి థరూర్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను బలపరిచిన వెంటనే స్థానిక కాంగ్రెస్‌ నాయకులు ఆయన్ను బీజేపీ ‘అగ్రగామి ప్రతినిధి’ అని ఆక్షేపించారు. అసాధారణ వాక్పటిమ ఉన్న థరూర్‌ అమెరికాను సందర్శించిన మరో అఖిలపక్ష ప్రతినిధి బృందం నాయకుడుగా వ్యవహరించారు. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు భారత్‌ను తానే ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌ హౌజ్‌లోను, విదేశీ పర్యటనల్లోనూ పదే పదే చేస్తున్న వాదనలను వాషింగ్టన్‌లో శశిథరూర్‌ ఖండిస్తున్న సమయంలోనే భోపాల్‌లో కాంగ్రెస్‌ ర్యాలీలో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తూ అమెరికా ఒత్తిడికి నరేంద్ర మోదీ లొంగిపోయి, కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ఆరోపించారు. పార్టీ అగ్రనేతల పరస్పర విరుద్ధ ప్రకటనలు కాంగ్రెస్‌ కార్యకర్తల్లో తీవ్ర అయోమయాన్ని సృష్టించాయి. పాలకపక్షం బీజేపీ వైనాన్ని చూద్దాం. ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రారంభించినప్పుడు కాంగ్రెస్‌ను అధిక్షేపిస్తూ, ముంబైపై ఉగ్రదాడుల సందర్భంలో దేశ ప్రజలను రక్షించడంలో మన్మోహన్‌సింగ్‌ విఫలమయ్యారని, ఆయన ఒక ‘బలహీన’ ప్రధానమంత్రి అని అపహిస్తున్న వీడియో నొకదాన్ని బీజేపీ అధికారిక సోషల్‌ మీడియా హ్యాండిల్‌ విడుదల చేసింది. వాచాలుడైన ఆ పార్టీ ఎంపీ నిశికాంత్‌ దూబే అఖిలపక్ష ప్రతినిధి బృందం సభ్యుడుగా విదేశాల్లో పర్యటిస్తున్నప్పటికీ కాంగ్రెస్‌ ప్రధానమంత్రులు జవహర్‌లాల్‌ నెహ్రూ నాటినుంచీ ‘భారత్‌ ప్రయోజనాలను విక్రయించారని’ ఆరోపిస్తూ కటువైన ట్వీట్‌లు పోస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఒక ‘గద్దర్‌’ (దేశ ద్రోహి) అని రాహుల్‌గాంధీ ఒక ‘పాకిస్థానీ ఏజెంట్‌’ అని దుయ్యబడుతూ బీజేపీ మీడియా విభాగం పదే పదే కాంగ్రెస్‌ నాయకులకు వ్యతిరేకంగా విమర్శనాస్త్రాలు సంధించింది. విదేశాలలో మాతృభూమి తరపున దీక్షాదక్షతలతో వాదిస్తూ స్వదేశంలో ఐకమత్యాన్ని నిమజ్జనం చేసి, మర్యాద, ఔచిత్యం లేకుండా పరస్పర విరుద్ధ వాదనలతో పెట్రేగిపోతున్న రాజకీయ వాతావరణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వ్యవహారంలో ప్రధాన వ్యక్తులు అయిన ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడే ఈ అసంబద్ధ రాజకీయాలకు కీలక కారకులు. వారిదే ప్రథమ బాధ్యత, సందేహం లేదు.


పరస్పర గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం మరచిపోయి, ప్రధాని మోదీ, ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ పరస్పరం పూర్తి తృణీకార భావంతో ప్రవర్తిస్తున్నారు. గాంధీ కుటుంబాన్ని కించపరిచేందుకు ప్రధానమంత్రి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తరచు ముతక భాషలో దూషిస్తున్నారు. మోదీ పట్ల కాంగ్రెస్‌ నాయకుడు అంతకంటే తీవ్ర తిరస్కార భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి పదవినధిష్టించేందుకు మోదీ అనర్హుడనే భావన రాహుల్‌ మాటల్లో స్పష్టంగా ద్యోతకమవుతోంది. అగ్రనాయకులు ఇంత అనాగరికంగా వ్యవహరిస్తున్నప్పుడు వారి అనుయాయులు భిన్నంగా ఎలా ప్రవర్తిస్తారు? భారత ప్రజాస్వామ్య సంస్థాగత దృఢత్వం క్షీణించడం రెండో కారణం. ఫలితంగా కనీసమాత్రంగా నైనా ప్రజాస్వామిక జవాబుదారీతనం మృగ్యమై పోతోంది. పార్లమెంటునే తీసుకోండి. గత దశాబ్దంలో ఈ మహోన్నత సంస్థను ఒక నోటీస్‌ బోర్డ్‌గా అధికారపక్షం కుదించివేయలేదూ? ప్రభుత్వ ప్రతినిధులు కీలక అంశాలపై ప్రతిపక్ష సభ్యులతో అర్థవంతమైన చర్చలు జరుపుతున్నారా? ఎవరినీ సంప్రదించకుండా పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెట్టడం, వాటిపై చర్చ దాదాపుగా లేకుండానే ఆమోదించడం జరుగుతోంది. వివాదాస్పద అంశాలను ప్రస్తావించేందుకు అనుమతించరు. చైనా చొరబాట్లపై చర్చకు నోటీస్‌ ఇస్తే వెన్వెంటనే తిరస్కరించారు. ఆపరేషన్‌ సిందూర్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే ప్రధానమంత్రి దానికి గైర్హాజరయ్యారు. పహల్గాం అనంతర పరిస్థితులపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను ఆమోదించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. చర్చను నిరాకరిస్తే ప్రజాస్వామ్యం ఎలా బలపడుతుంది? మీడియా నిర్వహిస్తోన్న పాత్ర మూడో కారణం. పలు మీడియా సంస్థలు వ్యవహరిస్తున్న తీరుతెన్నులను నిశితంగా పరీక్షించి తీరాలి. ప్రభుత్వానికి లౌడ్‌ స్పీకర్‌గా మారి, ప్రతిపక్షాలను నిరంతరం నిర్దయగా ప్రశ్నిస్తుంటే జాతీయ అంశాలపై సంభాషణ సమరీతి అవకాశాలతో సంయమనంతో, నిష్పాక్షికంగా జరగడం సాధ్యమేనా? ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రభుత్వాన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడానికి మీడియా ప్రయత్నించనే లేదు. ప్రయత్నించకపోగా ప్రభుత్వ ప్రచారాన్ని విపులీకరించడమే తన విధ్యుక్తధర్మంగా భావించింది. మరి యుద్ధం తొలి దశలో మన వాయుసేనకు నష్టాలు వాటిల్లాయన్న వాస్తవాన్ని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ తొలుత దేశ ప్రజలకు చెప్పకుండానే సింగపూర్‌లో విదేశీ మీడియా ప్రతినిధుల ఎదుట అంగీకరించడంలో ఆశ్చర్యమేముంది? దేశీయ మీడియా విశ్వసనీయతను కోల్పోవడం సమాచార శూన్యతను సృష్టిస్తోంది. ఈ పరిణామం ప్రజాప్రయోజనాల పరిరక్షణకు దోహదం చేయదు. జాతీయ భద్రతకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకోవడం ప్రజల హక్కు. వారికి తప్పుడు సమాచారమివ్వడం క్షమించరాని నేరం. తరచు కలహశీలంగా పరిణమిస్తూ ప్రజల ఉమ్మడి సమస్యల పరిష్కారంపై ఏకాభిప్రాయం కొరవడేలా చేస్తున్న మన రాజకీయాల సరళికి ఒక ప్రధాన కారణం సామాజిక మాధ్యమాల ప్రమాదకర ప్రభావమే. నియమ నిబంధనలు, అడ్డూ అదుపూ లేని ఈ అధునాతన భావ ప్రసార వేదికలు అబద్ధాల వెల్లువకు, దుర్భాషల దాడులకు ఆలంబనగా వర్ధిల్లుతున్నాయి. బహిరంగ చర్చల్లో సావధానత, సభ్యత కనీసమాత్రంగానైనా ఉండేందుకు శ్రద్ధ చూపని సోషల్‌ మీడియా ప్రజాభిప్రాయాన్ని ప్రబలంగా ప్రభావితం చేస్తున్న కాలంలో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ప్రప్రథమంగా చోటుచేసుకున్న యుద్ధమే ఆపరేషన్‌ సిందూర్‌. ఎలాంటి ఆంక్షలు లేని ఈ ప్రభావదాయక సామాజిక మాధ్యమాలు తీవ్ర స్వరాలు, దురుసు అభిప్రాయాలే అందరినీ ఆకట్టుకునేలా చేస్తుండగా సంయమన స్వరాలు భిన్న భావ రీతులు అంతకంతకూ ప్రాముఖ్యం కోల్పోతున్నాయి. బిగ్గరగా అరచుకోవడం, పరస్పరం తిట్టుకోవడమే పరమప్రమాణంగా చర్చలు జరుగుతున్నాయి. సంచలనశీలతే ఆమోదయోగ్యమైనప్పుడు వివేకశీల, అర్థవంతమైన చర్చలు ఎవరు కోరుకుంటారు? వర్తమాన భారత రాజకీయాలు నిష్పాక్షికత కంటే పక్షపాతానికి ప్రాధాన్యమిస్తున్న మీడియా ధోరణులకు అనుగుణంగా నడుస్తున్నాయి. మరి మన రాజకీయాలలో అర్థవంతమైన సంవాదాలకు ఆస్కారం క్రమేపీ తగ్గిపోతుండడంలో ఆశ్చర్యమేముంది? ఆపరేషన్‌ సిందూర్‌ మన నాయకులను అన్య దేశాలలోని ఆరోగ్యకరమైన వాతావరణంలో ఏకం చేసి ఉండవచ్చుగాని స్వదేశంలో మనం ఎప్పటి మాదిరిగానే ఐక్యత లేకుండా పరస్పరం ఘర్షించుకుంటూ వ్యతిరేక సమూహాలుగా ఉండిపోతున్నాం. ఎంత బాధాకరం!

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

Updated Date - Jun 06 , 2025 | 02:25 AM