Share News

Andhra University History: విద్యాభారతి భవిష్యత్‌ చిరునామా ఏయూ

ABN , Publish Date - Apr 26 , 2025 | 06:04 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1926లో స్థాపించబడిన తర్వాత విద్యా, పరిశోధన రంగాలలో అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ఈ విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో దాని విశిష్టమైన పర్యావరణం, ఘనతను పరిగణనలోకి తీసుకోవడం అవసరం

Andhra University History: విద్యాభారతి భవిష్యత్‌ చిరునామా ఏయూ

విశ్వవిద్యాలయాలు సమాజ అభివృద్ధిలో అత్యంత కీలకమైన కేంద్రాలు. ఇవి కేవలం విద్యను అందించేవే కాకుండా, దేశ భవితవ్యాన్ని తీర్చిదిద్దే శక్తిని కలిగి ఉంటాయి. శాస్త్రీయ పరిశోధనలకు వేదికలుగా పనిచేస్తూ, దేశ సాంకేతిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయి. ఆంధ్ర ప్రాంత ప్రజల బలమైన విద్యా స్వప్నాలను ఆవిష్కరించడానికి ఏర్పడిన ఆంధ్రా విశ్వవిద్యాలయం శత వసంత ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ, దాని పుట్టుక, గమనం, గమ్యం గురించి పునరావలోకనం చేసుకోవటం సముచితం. 1910లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగమైన ఆంధ్ర ప్రాంత ప్రజలు ద్వితీయశ్రేణి పౌరులుగా అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ స్థితిలో మే, 1912లో నిడదవోలులో జరిగిన 21వ క్రిష్ణా, గుంటూరు జిల్లాల సమావేశంలో మచిలీపట్నానికి చెందిన ప్రముఖ న్యాయవాది వల్లూరి సూర్యనారాయణ, ఆంధ్రులకు ప్రత్యేక ప్రావిన్స్ ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత గుంటూరుకి చెందిన యువకులు ఉన్నవ లక్ష్మీనారాయణ, చల్లా శేషగిరిరావు, జొన్నవిత్తుల గురునాథం, కొండా వెంకటప్పయ్యలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవసరాన్ని గుర్తించి, ఒక ప్రజాఉద్యమాన్ని నిర్మించాలని తీర్మానించి, ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేసి, దాని మొదటి సమావేశాన్ని 1913లో బాపట్లలో ఏర్పాటు చేశారు. సరిగ్గా ఈ సమయంలోనే క్రిష్ణా పత్రికలో ముట్నూరి క్రిష్ణారావు ఆంధ్రప్రాంతంలో విద్యా వెనుకబాటుతనాన్ని అధిగమించటానికి ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయ అవసరాన్ని ప్రస్తావించారు. తెలుగు భాషకు గుర్తింపు, గౌరవం, ఆంధ్ర ప్రాంత ప్రజల ఉన్నతవిద్య అవసరాలతో పాటు ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఈ విశ్వవిద్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. న్యాయపతి సుబ్బారావు అధ్యక్షతన ఆంధ్ర మహాసభ రెండవ సమావేశం (1914, బెజవాడ)లో, ఆంధ్రప్రాంత ప్రజలకు పూర్తిస్థాయి విశ్వవిద్యాలయం కావాలని మొదటిసారిగా తీర్మానించారు.


ఆంధ్ర నాయకుల నిరంతర పోరాటం, ఆర్థిక విషయాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, 1924 చివరికల్లా యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఎట్టకేలకు ఆంధ్ర యూనివర్సిటీ బిల్లు నవంబర్ 6, 1925న చట్టంగా మారింది. గవర్నర్ జనరల్ ఆమోదానంతరం జనవరి 20, 1926న అధికారిక గెజిట్‌లో ప్రచురితమై, దేశంలో 13వ విశ్వవిద్యాలయంగా ఆంధ్ర యూనివర్సిటీ ఆవిర్భవించింది. అప్పటికి దేశంలో ఉన్న అతి గొప్ప విద్యావేత్తలలో కట్టమంచి రామలింగారెడ్డి ఒకరు. ఆయన ఇండియా, ఇంగ్లండ్‌లలో విద్యాభ్యాసం చేసి... యూరప్, అమెరికా, కెనడా, జపాన్, ఫిలిప్పైన్స్, హాంకాంగ్, మలయలోని వివిధ విద్యావ్యవస్థ, పారిశ్రామిక సంస్థలను అధ్యయనం చేశారు. తన రాజకీయ భవిష్యత్తును త్యాగం చేసిన కట్టమంచి రామలింగారెడ్డి, వైస్ ఛాన్సలర్‌గా ఏప్రిల్ 26, 1926న బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజునే ఆంధ్ర యూనివర్సిటీ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుతున్నారు. విశ్వవిద్యాలయ అధికారిక చిహ్నాన్ని ఉపకులపతి నిర్దేశకత్వంలో కౌత రామమోహనశాస్త్రి పూర్తి చేశారు. మొదటి నాలుగు సంవత్సరాలు విజయవాడ నుంచి కార్యకలాపాలు సాగించి, పూర్తి స్థాయి విశ్వవిద్యాలయంగా రూపొందటానికి అహర్నిశలు శ్రమించి, తదనంతరం విశాఖపట్నం నుంచి తన కార్యకలాపాలు కొనసాగించింది. 1931లో తెలుగు, హిస్టరీ, పాలిటిక్స్ శాఖలతో ప్రారంభమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం, తర్వాత ఫిలాసఫీ, మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటని, జువాలజి, జియాలజి, లా, ఇంగ్లీష్, ఎకనామిక్స్, కెమికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి కోర్సులతో పాటు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్‌ ఆర్ట్స్ 1931, జయపూర్ విక్రమదేవ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1932, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1955, డా. బి.ఆర్.అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లా 1989, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ 2006, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ 2010 లను ప్రారంభించి దినదిన ప్రవర్ధమానమైంది.


450 ఎకరాల సువిశాలమైన క్యాంపస్, 6 యూనివర్సిటీ కాలేజీలు, 100కు పైగా విభాగాలలో 270కు పైగా కోర్సులు, 140 భవనాలు, 17 పరిశోధన కేంద్రాలు, ఆగ్రో ఎకనమిక్ రీసెర్చ్ సెంటర్, జనాభా పరిశోధన కేంద్రం, సిబ్బంది పిల్లలకు రెండు పాఠశాలలు (తెలుగు, ఇంగ్లీష్ మీడియం), దాదాపు 20 బాలుర, 5 బాలికల, 5 విదేశీ విద్యార్థుల వసతి గృహాలు, 3 డిస్పెన్సరీలు, 300కి పైగా స్టాఫ్ క్వార్టర్స్, 4 గెస్ట్‌హౌస్‌లు, 5 క్యాంటీన్లు, ఫ్యాకల్టీ క్లబ్, ఎంప్లాయ్‌మెంట్ అండ్ గైడెన్స్ బ్యూరో, కో ఆపరేటివ్ సొసైటీ, దేశంలోనే మొదటి దూరవిద్య కేంద్రం(1972), బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, లాంటి భౌతిక వనరులు, వసతులతో పాటు, 5 లక్షల పుస్తకాలు, 300కు పైగా దేశ, విదేశీ జర్నల్స్, 8,000కు పైన ఈ జర్నల్స్, 15,000కు పైగా వినియోగదారులు ఉన్న అతి విశాలమైన గ్రంథాలయం, ఏటా వెయ్యికి పైగా పరిశోధన పత్రాలు, 400కు పైగా పీహెచ్‌డీలు, 100కు పైగా సెమినార్లు, 400 ఎండోమెంట్ అవార్డులు వంటి మేధోవనరులతో పాటు, వేయిమందికి పైగా విదేశీ విద్యార్థులతో విశ్వవిద్యాలయం అలరారుతోంది. ప్రఖ్యాత విద్యావేత్తలు తమ మేధస్సుతో విశ్వవిద్యాలయాల లక్ష్యాలైన బోధన, పరిశోధన, విస్తరణలకు వన్నెలద్దారు. వారు వేసిన మేధోపునాదుల పైన నేటికీ జాతీయ స్థాయిలోని అన్నిరకాల, విద్యార్యాంకింగ్‌లలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంటూనే ఉంది.


విశ్వవిద్యాలయ ఏర్పాటుకు, అభివృద్ధికి కృషి చేసిన ఎవరి శ్రమ వృథా పోలేదు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతితో పాటు దేశంలో అత్యంత ప్రతి‌ష్ఠాత్మకమైన భారతరత్నతో సహా అన్ని అవార్డులు ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఉపాధ్యాయులకు లభించాయి. ఇక భారత రాజకీయాలలో ఈ యూనివర్సిటీ పాత్ర అనన్య సామాన్యం. ఒక్క ప్రధానమంత్రి పదవి తప్ప, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, ముఖ్యమంత్రి, గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు, స్పీకర్లు, యూజీసీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లను విశ్వవిద్యాలయం జాతికి అందించింది. ప్రపంచీకరణ తర్వాత విద్యా వ్యవస్థలో వచ్చిన గణనీయమైన మార్పుల వల్ల భారతీయ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాల్సిన అవసరం ఏర్పడింది. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశానికి నోబెల్ బహుమతులు సంపాదించిన నాలుగు విశ్వవిద్యాలయాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒకటి. పూర్తిగా ప్రాంతీయ, విద్యా అవసరాల కోసం ఏర్పడిన ఈ విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెంది, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తన ఆగమనాన్ని చాటుకోవడం ద్వారా మాత్రమే విశ్వవిద్యాలయం రెండవ శతాబ్దంలోకి సగర్వంగా ప్రవేశించగలదు. తద్వారా ఇది భారతీయ విద్యా భవిష్యత్‌కు చిరునామాగా మారగలదు. దానికోసం పాలకులు, ఆచార్యులు, పరిశోధకుల నిరంతర కృషి అనివార్యం.

డాక్టర్ శామ్యూల్ జాన్ ఆదూరి

ఫ్యాకల్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజి

(నేడు ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు ప్రారంభం)

Updated Date - Apr 26 , 2025 | 06:07 AM