AP Politics: ఆరోగ్య, ఐశ్వర్య, ఆనందప్రదేశ్ దిశగా...
ABN , Publish Date - Jun 12 , 2025 | 06:49 AM
ప్రజా జీవితంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్‌రెడ్డిలు భిన్న ధృవాలని రాష్ట్ర ప్రజలకు విదితమే. ప్రజల జీవితాల్ని మెరుగుపరిచే సాధనం ప్రజాస్వామ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలంగా విశ్వసిస్తారు.
ప్రజా జీవితంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్‌రెడ్డిలు భిన్న ధృవాలని రాష్ట్ర ప్రజలకు విదితమే. ప్రజల జీవితాల్ని మెరుగుపరిచే సాధనం ప్రజాస్వామ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలంగా విశ్వసిస్తారు. దీనికి భిన్నంగా ప్రజాస్వామ్య ముసుగులో అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు దుర్వినియోగం చేసే విద్యలో జగన్‌రెడ్డి నిష్ణాతుడు. పలు కల్లబొల్లి మాటలు, విన్యాసాలతో 2019లో 153 అసెంబ్లీ స్థానాలతో అధికారం చేపట్టి, ఐదేళ్ల తర్వాత భారీ ప్రజా తిరస్కారానికి గురై కేవలం 11 స్థానాలకు పతనమయ్యారు. తాను ఊహించని ఈ పరిణామానికి ఆయన మైండ్ బ్లాకయ్యింది. ఓడినప్పట్నించీ ప్రజలపై ఉక్రోషాన్ని పెంచుకుని ప్రజాస్వామ్యం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లను నిస్సిగ్గుగా వెన్నుపోటుదారులుగా అభివర్ణించే దుస్సాహసం చేశారు. గతంలో ప్రధానులుగా పనిచేసిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి; ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు వంటివారు ఓటమి పాలయినప్పుడు ప్రజాతీర్పునకు శిరసు వంచారు కానీ ప్రజల్ని వెన్నుపోటుదారులని దూషించలేదు. గత సంవత్సర కాలంగా ప్రతి రోజూ ప్రజా శ్రేయస్సు కోసం, యువత ఉజ్వల భవిష్యత్తు కోసం తపిస్తూ పలు ఆలోచనలు, ప్రయత్నాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు. దీనికి భిన్నంగా తనను ఓడించారంటూ ప్రజలపై ఆగ్రహంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య వ్యతిరేక జపం చేస్తున్నారు. ఈ మానసిక వైకల్యంతో, ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయమున్నా మళ్లీ అధికారం చేపట్టి తమ రాజకీయ ప్రత్యర్థులు, నియమాల ప్రకారం నడుచుకుంటున్న అధికారుల భరతం పడతానంటూ జగన్మోహన్‌రెడ్డి నిత్యం ఊగిపోతున్నారు. ఈ విధమైన పగ, ప్రతీకారాలతో ఎదురయ్యే అనర్థాల పట్ల ప్రజలు అప్రమత్తతతో ఉండాలి. స్వీయ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా బరితెగించి నడుచుకునే నాయకుల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారు. బటన్ నొక్కడమే అన్ని ప్రజాసమస్యలకు పరిష్కార మార్గంగా భావించిన జగన్మోహన్‌రెడ్డిని ప్రజలు ఎందుకు తిరస్కరించినట్లు? ప్రజలకు నొప్పి కలిగితేనే కదా వారు మార్పు కోరుకునేది. ఇందుకు సంబంధించి ప్రజారోగ్య రంగంలో ఆయన హయాంలో నెలకొన్న పరిస్థితిని స్థూలంగా పరిశీలిద్దాం.
జగన్ పాలించిన ఆ ఐదేళ్లూ భారీ ప్రకటనలు, ఆచరణ శూన్యతలకు ఆలవాలం. ఇందుకు ప్రజారోగ్య రంగం ఒక విశిష్ట సాక్ష్యం. రూ.8,400 కోట్ల ఖర్చుతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేస్తానని చెప్పి, అధికారం నుంచి దిగిపోయే నాటికి అందులో కేవలం 14 శాతం మాత్రమే ఖర్చు చేసి, తదుపరి బాధ్యతను కూటమి ప్రభుత్వంపై వదిలేశారు. నాడు–నేడు కార్యక్రమం కింద రూ.12,000 కోట్లతో వైద్య సదుపాయాల స్వరూపాన్ని సమగ్రంగా మార్చివేస్తానని బీరాలు పలికిన జగన్మోహన్‌రెడ్డి, అందులో కేవలం 17 శాతం మాత్రమే ఖర్చు చేసి తదుపరి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వ వాకిట వదిలేశారు. జీరో వేకెన్సీ పాలసీ కింద వైద్య రంగంలో నియమాకాలన్నింటినీ పూర్తి చేశానని ఆయన గొప్పలు చెప్పుకున్నారు. వాస్తవంలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఐదేళ్లూ వైద్య రంగంలో కూడా అవినీతి అన్ని స్థాయిల్లో తాండవించింది. ప్రతి విషయంలోనూ రాజకీయ జోక్యం మితిమీరి వ్యవస్థ అస్తవ్యస్త మయ్యింది. ఉద్యోగ నియమాకాల లిస్టులు కలెక్టర్ కార్యాలయాల నుంచి కాకుండా వైసీపీ నేతల ఇళ్ల నుంచి వచ్చాయి. వందలాది మంది డాక్టర్లు అనుమతుల్లేకుండా పనికి ఎగనామం పెట్టారు. డ్యూటీకి వచ్చినవారు మొక్కుబడిగా సంతకాలు చేసి స్వంత పనుల్ని చక్కబెట్టుకున్నారు. ప్రజలు, ముఖ్యంగా పేదల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజారోగ్య రంగాన్ని ఈ విధంగా గాలికొదిలేస్తారా? అది జగన్‌కే సాధ్యం. కూటమి ప్రభుత్వం పరిస్థితిని మెరుగుపరచడానికి నడుం బిగించి, మొదటి ఏడాదిలో మార్పు తేగలిగింది. జగన్ పుణ్యమా అని ఇంకా చేయాల్సింది చాలా ఉంది... చేస్తామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలకు హామీ ఇస్తున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత మేరకు ఆరోగ్య, ఐశ్వర్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా ఆరోగ్య రంగంలో ముందుకు పోతున్నాం. ఇది మా విద్యుక్త ధర్మంగా భావిస్తున్నాం. ఎందుకంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలే నిజమైన అధినేతలని కూటమి విశ్వసిస్తోంది. ఓడించారని ప్రజల్ని వెన్నుపోటుదారులుగా దూషించే వారికి మేము భిన్నం.
- సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య,
కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి