Share News

BC Commission: ఆంధ్ర బీసీ కులాలను తెలంగాణలో చేర్చొద్దు

ABN , Publish Date - Jun 12 , 2025 | 06:06 AM

ఆంధ్ర బీసీ కులాలను తెలంగాణలో చేర్చొద్దు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 138 బీసీ కులాలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందులోని 26 బీసీ కులాలను జీవో నెం. 16 ద్వారా (మార్చి 11, 2015న) గత తెరాస ప్రభుత్వం తొలగించింది.

BC Commission: ఆంధ్ర బీసీ కులాలను తెలంగాణలో చేర్చొద్దు

ఆంధ్ర బీసీ కులాలను తెలంగాణలో చేర్చొద్దు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 138 బీసీ కులాలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందులోని 26 బీసీ కులాలను జీవో నెం. 16 ద్వారా (మార్చి 11, 2015న) గత తెరాస ప్రభుత్వం తొలగించింది. అయితే తెలంగాణలో ఏఏ జాబితాల్లో నుంచి ఆ కులాలను తొలగించారో ఆ జాబితాల్లోనే మళ్లీ చేర్చాలని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీసీ కులాల ప్రతినిధులు అడగడం, ఆ వెంటనే బీసీ కమిషన్‌ను పురమాయించి, పబ్లిక్‌ హియరింగ్‌కు పిలవడమంటే తెలంగాణ బీసీ సమాజానికి ద్రోహం తలపెట్టినట్లే అవుతుంది. ప్రజల సమ్మతి లేకుండానే పాలకులు ఆ కులాలను ఇక్కడి బీసీ జాబితాలో చేర్చడానికి సన్నద్ధం అయ్యారని అర్థం. తెలంగాణ బీసీ సంఘాలతో పాటు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు ఈ కులాల చేరికను ఆహ్వానిస్తున్నాయో లేదో స్పష్టం చేయాలి. అసలు ఎందుకు తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నామో కూడా స్పష్టం చేయాలి. ఇప్పటికే తెలంగాణలో ఆంధ్రా వలస, పెత్తందారీ కులాల దోపిడీ ఎక్కువైంది. అభివృద్ధి చెందిన ఆంధ్ర అణగారిన కులాల వల్ల.. తెలంగాణ పీడిత కులాలవారు అన్యాయానికి గురవుతున్నారు.


బీసీ జాబితాలో తూర్పు కాపులను, కళింగలను చేర్చవద్దని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఆందోళనలు జరిగిన చరిత్రను గుర్తు తెచ్చుకోవడం అవసరం. నాటి ఉమ్మడి బీసీ సంఘాలన్నీ తెలంగాణ బీసీలకు ఎంత ద్రోహం చేయాలో అంతా చేశాయి. తూర్పు కాపులు, కళింగ కులాలు పాలక, భూస్వామ్య, పెత్తందారీ ఆధిపత్య కులాలు. మిగతా కులాలు అలా కాకపోయినా తెలంగాణ బీసీ కులాల కన్నా సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన కులాలే. తెలంగాణలోని బీసీ కులాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతికంగా వెనుకబాటుతనానికి గురైన పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ తొలగించిన కులాలను తెలంగాణలో చేర్చితే ఇక్కడి బీసీ కులాల అభివృద్ధికి విఘాతం కలిగించిన వాళ్లు అవుతారు. నాడు తెలంగాణలోని నీళ్లు, నిధులు, నియామకాలను కోస్తాంధ్ర వలసవాద పాలకులు కొల్లగొట్టారు. ఆ కొల్లగొట్టిన వారిలో పీడిత కులాల్లోని పాలకవర్గాలవారు లేరు అనటం అవివేకమే అవుతుంది. ఆంధ్ర వలసవాద, పెత్తందారీ పాలక దోపిడీదారుల ‘ఆధిపత్యం, వివక్ష, దోపిడీ’లకు వ్యతిరేకంగా తెలంగాణ పీడిత వర్గాలే మూకుమ్మడిగా ఉద్యమించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్న విషయం మరచిపోకూడదు.

– పాపని నాగరాజు

కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు

Updated Date - Jun 12 , 2025 | 06:07 AM